అభివృద్ధి పనులకు కేబినెట్ ఆమోదం: మంత్రి మల్లాడి
ABN , First Publish Date - 2020-10-28T06:19:12+05:30 IST
యానాంలోని పలు అభివృద్ధి పనులకు, ప్రాజెక్టులకు తాను ప్రతిపాదించిన పేర్లను పుదుచ్చేరి కేబినెట్ ఆమోదం తెలిపిందని ఆరోగ్య శాఖ మంత్రి మల్లాడి కృష్ణారావు తెలిపారు.

యానాం, అక్టోబరు 27: యానాంలోని పలు అభివృద్ధి పనులకు, ప్రాజెక్టులకు తాను ప్రతిపాదించిన పేర్లను పుదుచ్చేరి కేబినెట్ ఆమోదం తెలిపిందని ఆరోగ్య శాఖ మంత్రి మల్లాడి కృష్ణారావు తెలిపారు. ఈసందర్భంగా వీటికి సంబంధించిన పలు విషయాలను ఆయన విలేకరులకు తెలిపారు. యానాం శివారు గిరియాంపేటలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలకు మత్స్యకార నాయకుడు, మాజీ ఎమ్మేల్యే రక్షా హరికృష్ణ కళాశాలగా, కనకాలపేటలో నిర్మించిన ఇండోర్‌స్టేడియానికి స్వాతంత్ర సమరయోధుడు కోన నర్సయ్య పేర్లకు ప్రభుత్వ ఆమోదం తెలిపిందన్నారు. ఆరోగ్య బీమా పథకం మొత్తాన్ని రూ.2.50లక్షల నుంచి రూ.5లక్షలకు పెంచడం జరిగిందన్నారు. ఈపథకం డిసెంబరు నుంచి అమలులోకి వస్తుందన్నారు. యానాం ప్రభుత్వ పాఠశాలల్లో, జూనియర్ కళాశాలల్లో చదివే విద్యార్థులకు మెడిసిన్‌లో పది శాతం సీట్లుకు రిజర్వేషన్ కల్పిస్తూ ఆమోదం తెలిపిందన్నారు.
ఉరుసు ఉత్సవాలు రద్దు.. ఏకాంతంగా పూజలు
ముమ్మిడివరం, అక్టోబరు 27: మండలంలోని కొత్తలంకలో ఈనెల29 నుంచి నిర్వహించాల్సిన వలీబాబా ఉరుసు ఉత్సవాలను కరోనా కారణంగా రద్దు చేస్తున్నట్టు అమలాపురం డీఎస్పీ షేక్ మసూంభాషా తెలిపారు. డీఎస్పీ మసూంభాషా, ముమ్మిడివరం సీఐ ఎం.జానకీరామ్‌లు మంగళవారం వలీబాబా దర్గాను దర్శించుకున్నారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ బాబా దర్గా వద్ద పూజా కార్యక్రమాలు ఏకాంతంగా జరుగుతాయని, భక్తులకు అనుమతిలేదన్నారు. బాబాకు పూజచేసిన గంథాన్ని భక్తులకు పంపిణీ చేయడం జరగదని, తీర్థం జరగనందున పూజాసామగ్రి విక్రయకేంద్రాలు, స్వీట్‌స్టాల్స్, హోటల్స్ వంటివాటికి అనుమతి లేదన్నారు. ఊరేగింపునకు అనుమతి లేదన్నారు. ఇతర ప్రాంతాల నుంచి వచ్చే బస్సులు, కార్లు, ఇతర వాహనాలకు ఎటువంటి అనుమతి ఇవ్వమని చెప్పారు. దర్గా వద్ద భక్తులకు ఎటువంటి వసతి సౌకర్యం కల్పించడం జరగదని ఆయన చెప్పారు. డీఎస్పీ సమక్షంలో పోలీసులు దర్గా వద్ద హెచ్చరిక బోర్డును ఏర్పాటుచేశారు. ముమ్మిడివరం ఎస్‌ఐ కేవీ నాగార్జున, పోలీసులు పాల్గొన్నారు.