జిల్లాలో 2,266 హెక్టార్లలో వరికి నష్టం
ABN , First Publish Date - 2020-04-28T09:25:08+05:30 IST
జిల్లాలో 2,266 హెక్టార్లలో వరి పంటకు నష్టం వాటిల్లిందని వ్యవసాయ శాఖ మంత్రి కురసాల కన్నబాబు తెలిపారు.

కరప, ఏప్రిల్ 27: జిల్లాలో 2,266 హెక్టార్లలో వరి పంటకు నష్టం వాటిల్లిందని వ్యవసాయ శాఖ మంత్రి కురసాల కన్నబాబు తెలిపారు. రైతులు ఆందోళన చెందవద్దని, ప్రతీ గింజ కొనుగోలు చేసేలా అవసరమైన అన్ని చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు. కరప మండలం వేములవాడ, వాకాడ, కరప గ్రామాల్లో సోమవారం ఆయన పర్యటించారు. నేలకొరిగిన వరిని, తడిసిన ధాన్యం రాశులను పరిశీలించారు. అనంతరం రైతులతో మాట్లాడి సమస్యలను తెలుసుకున్నారు. తడిసిన ధాన్యం వంకతో రేటు తగ్గించి కొనుగోలు చేస్తే కఠినచర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. బొండాలు రకాన్ని మద్దతుఽ దరకు కొనుగోలు చేస్తామని, మిల్లర్లు సహకరించాలని కోరారు. ప్రభుత్వం ప్రోత్సహించిన సన్నాల రకాన్ని కొనుగోలు చేయడం లేదని వస్తున్న వార్తలలో నిజం లేదన్నారు.
రేటు దిగిపోకుండా ముఖ్యమంత్రి పటిష్ట చర్యలు తీసుకున్నారని, దీనిలో భాగంగా ఇతర రాష్ట్రాల ధాన్యం మన రాష్ట్రానికి రాకుండా కట్టుదిట్టం చేశామన్నారు. రైతులు సచివాలయంలో పండించిన పంట వివరాలను తెలియజేస్తే సిబ్బంది కూపన్ అందిస్తారన్నారు. గత ఖరీఫ్‌లో తుఫాన్ల కారణంగా నష్టపోయిన పంటకు రూ.54 కోట్లు ఇన్‌పుట్ సబ్సిడీని సీఎం మంజూరు చేశారని, వారంరోజుల్లో రైతుల ఖాతాలకు ఆ సొమ్ము జమ అవుతుందని తెలిపారు. పడిపోయిన పంట దెబ్బతినకుండా ఉప్పు ద్రావణాన్ని పిచికారీ చేయాలని ఆయన సూచించారు. వ్యవసాయ శాఖ డీడీ వీటీ రామారావు, ఏడీఏ పద్మశ్రీ, ఏవో గాయత్రీదేవి, కరప ఏఎంసీ చైర్మన్ కర్నాసుల సీతారామాంజనేయులు, యాళ్ల సుబ్బారావు పాల్గొన్నారు.