రైతుల భూములు లాక్కోవడం..మంత్రులకు కట్టబెట్టడం
ABN , First Publish Date - 2020-10-03T07:39:17+05:30 IST
వైసీపీ ప్రభుత్వంలో రైతుల భూములను బలవంతంగా లాక్కొని మంత్రులకు కట్టబెట్టడమే పని అని పెద్దాపురం ఎమ్మెల్యే నిమ్మకాయల

ఇదే వైసీపీ ప్రభుత్వం పని
పెద్దాపురం ఎమ్మెల్యే చినరాజప్ప ఆరోపణ
పెద్దాపురం, అక్టోబరు 2: వైసీపీ ప్రభుత్వంలో రైతుల భూములను బలవంతంగా లాక్కొని మంత్రులకు కట్టబెట్టడమే పని అని పెద్దాపురం ఎమ్మెల్యే నిమ్మకాయల చినరాజప్ప ఆరోపించారు. శుక్రవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ జగన్ ముఖ్యమంత్రి అయిన తర్వాత విజయసాయిరెడ్డికి విశాఖపట్నం బాధ్యతలను అప్పగించారన్నారు. ఇప్పటికే సుమారు నాలుగు వేల ఎకరాల భూమిని లాక్కున్నారని, మళ్లీ ఇప్పుడు వారి కన్ను తూర్పుగోదావరి జిల్లాపై పడిందన్నారు. జిల్లాలో సుమారు 10వేల ఎకరాల భూమిని విజయసాయిరెడ్డి తన అనుచరులకు, అరబిందో సంస్థకు కట్టబెట్టారని ఆరోపించారు. మాజీ మంత్రి యనమల రామకృష్ణుడు వాస్తవా లను చెప్తుంటే వ్యవసాయ శాఖ మంత్రి కురసాల కన్నబాబు ఆ విషయాలను మసిపూసి మారేడుకాయ చేస్తున్నారని విమర్శించారు.
టీడీపీ ప్రభుత్వ హయాంలో చంద్రబాబు రైతులకు అండగా నిలిచారని, వారి హక్కులను కాపాడారని గుర్తుచేశారు. చంద్రబాబు హయాంలో తూర్పు గోదావరి, చిత్తూరు జిల్లాల్లో మంచి పరిశ్రమలు తీసుకువచ్చారన్నారు. వైసీపీ అధికారంలోకి వచ్చాక ఎక్కడా పరిశ్రమలు వచ్చిన దాఖలాలు లేవన్నారు. పైగా వచ్చిన పరిశ్రమలు వెనక్కి వెళ్లిపోతున్నాయన్నారు. పైగా టీడీపీ హయాంలో కొన్ని కార్పొరేషన్లు మూసివేశారని తమపై విషం చిమ్ముతున్నారని విమర్శించారు. ప్రభుత్వ భూములను అమ్మేస్తున్నారని కోర్టు ఓవైపు మొట్టికాయలు వేస్తున్నా వైసీపీ నాయకుల వైఖరిలో మార్పు రావడం లేదన్నారు. ముఖ్యమంత్రి చేస్తున్న తప్పులను మంత్రి కన్నబాబు సమర్థించడం కరెక్టు కాదన్నారు.