తిన్నమా.. పడుకున్నామా.. తెల్లారింది!

ABN , First Publish Date - 2020-04-26T11:37:14+05:30 IST

కరోనా మహమ్మారి కారణంగా గత నెలరోజులుగా అమలవుతున్న లాక్‌డౌన్‌ ప్రజల దైనందిన జీవనశైలి తిన్నామా.. పడుకున్నామా.. తెల్లారిందా అన్న రీతిలో సాగుతోంది.

తిన్నమా.. పడుకున్నామా.. తెల్లారింది!

కరోనా మహమ్మారితో ప్రజల జీవనశైలిలో మార్పులు

సంపన్న కుటుంబాల్లో సాఫీగా సాగుతున్న సంసారాలు

సామాన్య కుటుంబాల్లో బ్రతుకు జీవుడా అంటూ గడిపేస్తున్నారు

మధ్య, పేద తరగతి వర్గాలు ఆపన్నహస్తం కోసం ఎదురుచూపులు

మద్యపాన ప్రియులు మంచానికే పరిమితం

లాక్‌డౌన్‌తో గత నెల రోజుల్లో ప్రజల ఇక్కట్లు


(ఆంధ్రజ్యోతి-అమలాపురం): కరోనా మహమ్మారి కారణంగా గత నెలరోజులుగా అమలవుతున్న లాక్‌డౌన్‌ ప్రజల దైనందిన జీవనశైలి తిన్నామా.. పడుకున్నామా.. తెల్లారిందా అన్న రీతిలో సాగుతోంది. ఎవరినైనా ఏంచేస్తున్నావని పలుకరించినా ఇదే సమాధానం వస్తోంది. ఇళ్లల్లోనే తిష్ట వేస్తున్న పిల్లలు టీవీలకు అతుక్కుపోతున్నారు. మహిళలైతే ప్రతీ క్షణం వంట గదికే పరిమితమవుతున్నారు. ఉద్యోగం సద్యోగం.. లేని వ్యక్తులు ఇళ్ల దగ్గరే ఉంటే పరిస్థితులు ఏ స్థాయిలో ఉంటాయో అదే రీతిన గత నెల రోజులుగా ప్రజలు జీవన విధానాన్ని సాగిస్తున్నారు. సంపన్నుల కుటుంబాల్లో అయి తే సాఫీగానే జీవనం సాగిస్తుంటే, నిరుపేద ఇళ్లల్లో క్లిష్టతరమైన పరిస్థితులు సాక్షాత్కరిస్తున్నాయి.


దాంతో ఏనాడూ బయటకురాని మధ్యతరగతి, నిరుపేద కుటుంబా లు సైతం దాతలు అందిస్తున్న ఆపన్నహస్తం కోసం వెంపర్లాడే పరిస్థితులు జిల్లా వ్యాప్తంగా తలెత్తుతున్నాయి. లాక్‌డౌన్‌ విధానం అమలు వల్ల కొన్ని ప్రాంతాల్లో ఇలా ఉంటే ఇక పాజిటీవ్‌ కేసులు వచ్చిన రాజమహేంద్రవరం, కాకినాడ, కత్తిపూడి, సామర్లకోట వంటి ప్రాంతాల్లో  పరిస్థితులు ఇంకా దారుణంగానే ఉన్నాయి. రెడ్‌జోన్‌, హాట్‌స్పాట్‌ ప్రాంతాల్లో ప్రజలకు కనీసం నిత్యావసర వస్తువులు కొనుగోలు చేసేందుకు కూడా అవకాశం లేకపోవడంతో వారు పడుతున్న ఇబ్బందులు వర్ణణాతీతంగా ఉన్నాయి. ప్రభుత్వశాఖల ఉద్యోగులు నిత్యావసర వస్తువులు సరఫరా చేస్తామని చేస్తున్న ప్రకటనలు అక్కడ ఆచరణ సాధ్యం కావడం లేదు. గత నెలరోజులుగా జిల్లాలో సుమారు 50 లక్షల మంది ప్రజలు లాక్‌డౌన్‌ కారణంగా ఇళ్లకే పరిమిత మయ్యారు. కరోనా మహమ్మారి జనజీవనానికి కీడుతో పాటు మేలు కూడా చేస్తోంది.


ప్రజల్లో ఆర్థిక దుబారాను అరికట్టడంతోపాటు ఆరోగ్య రక్షణను నేర్పిందనే చెప్పాలి. ఉద్యోగాల్లేవు, వ్యాపారాల్లేవు, కూలీ నాలీ పనులు అసలే లేవు. చేతివృత్తుల వారికి పనుల్లేవు. ఇలా అన్నివర్గాల వారిని నెలరోజులుగా ఒక్కమాటలో చెప్పాలంటే ఇళ్లకే పరిమితం చేశారు. విరామ సమయంలో కావలసిన వస్తువులు కొనుక్కునేవారు కొందరైతే, వాటికోసం ఆయా యజ మానులు, వడ్డీ వ్యాపారులను ఆశ్రయించి ఇళ్లల్లోకి కావలసిన నిత్యావసర వస్తువులను సమకూర్చుకుం టున్నారు. వినోదాలు, షికార్లకు సాధ్యం కాని పరిస్థితు లతో పిల్లలంతా ఇళ్లలోనే టీవీలు, వివిధ రకాల ఆటలు, పాటల్లో నిమగ్నమవు తున్నారు. కొన్ని ఇళ్లల్లో అయితే ఆయా యజమానులు, మహిళలు సైతం చతుర్ముఖ పారాయణంతో సరదా కాలాక్షేపాలు చేస్తున్నారు. ఎటువంటి ఒత్తిళ్లు లేకుండానే ప్రశాంతమైన మనసుతో ఇంట్లోనే ఉంటూ కడుపునిండా కావలసింది చేయించుకుని తింటున్నారు కొందరు. మరికొందరు తిన్న వెంటనే నిద్రపోతున్నారు. కుటుంబ సమేతంగా ఇంట్లోనే ఉండి ఆత్మీయంగా గడుపుతున్నారు.


కరోనా ప్రజలందరికీ కనువిప్పు కలిగించిందనే చెప్పాలి. ఆరోగ్యం కాపాడుకోవడంతో పాటు ప్రాణం విలువ తెలిసిన ప్రతీ వ్యక్తి ముఖ్యంగా ఆయా గృహ యజమానుల పట్ల కుటుంబ సభ్యులు సైతం ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటున్నారు. బయటికి వెళ్లి ఇంటికి వచ్చేవరకు ఆ యజమాని కోసం కుటుంబమంతా వెయ్యి కళ్లతో ఎదురు చూస్తున్నారు. ఉదయం లేచిన దగ్గర నుంచి రాత్రి వరకు కాలు బయట పెట్టకుండా ఇళ్లల్లోనే గడపాలంటే ఉద్యోగులు, వ్యాపారులు, ఇతర శ్రామికవర్గాలు పడుతున్న కష్టాలు అన్నీఇన్నీకావు. ఒకవైపు బతుకు పోరాటం.. మరోవైపు జీనపోరాటం వారిది. సామాన్య కుటుంబాల వారైౖతే విలవిల్లాడిపోతున్నారు. మరికొన్ని రోజులు ఇదే పరిస్థితి ఎదురైతే సామాన్య కుటుంబాలు బతికి బట్టకట్టాలంటే కష్టతరమే.


మొత్తంమీద కరోనా మహమ్మారి వల్ల ఎన్నడూలేని రీతిలో నెలరోజులపాటు కుటుంబ యజమానులు ఇళ్లకే పరిమితమై నరకయాతన అనుభవిస్తున్నవారు చాలామంది ఉన్నారు. ఇక వ్యసనపరుల పరిస్థితి అయితే మరీ దారుణంగా ఉంది. ఇప్పటికే మద్యం అలవాటు ఉన్న వ్యక్తులు మంచాన పడుతున్న పరిస్థితులు కోనసీమలో కోకోల్లలుగానే ఉన్నాయి. దాంతో ఎక్కడికక్కడే నాటుసారా ప్రబలుతోంది. మందు దొరకనివారు సారాతో సరిపెట్టు కుంటున్నారు. ఇలా లాక్‌డౌన్‌ కారణంగా ప్రజలు పడుతున్న కష్టాలు గట్టెక్కేది ఎప్పుడా అని వెయ్యి కళ్లతో ఎదురుచూస్తున్నారు.

Updated Date - 2020-04-26T11:37:14+05:30 IST