-
-
Home » Andhra Pradesh » East Godavari » LOCAL CANDIDATES HOUSES
-
స్థానికులకే ఇళ్లు కేటాయించాలి
ABN , First Publish Date - 2020-12-19T06:36:29+05:30 IST
స్థానికంగా ఉంటున్న పేద ప్రజలను కాదని వేరొకరికి ఈ ప్రాంతంలో ఇళ్లు కేటాయించడం ఎంత వరకు సబబని రాజమహేంద్రవరం రూరల్ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్యచౌదరి డిమాండ్‌చేశారు.

ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్యచౌదరి
రాజమహేంద్రవరంరూరల్, డిసెంబరు 18 : స్థానికంగా ఉంటున్న పేద ప్రజలను కాదని వేరొకరికి ఈ ప్రాంతంలో ఇళ్లు కేటాయించడం ఎంత వరకు సబబని రాజమహేంద్రవరం రూరల్ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్యచౌదరి డిమాండ్‌చేశారు. రూరల్ మండలం హుకుంపేట పరిధిలో ఉన్న డి-బ్లాక్‌లో శుక్రవారం ఆయన పర్యటించారు. ఒడియాపేట, టవర్‌లైన్ కింద ఉంటున్న పేద ప్రజల ప్రాంతాలను పరిశీలించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే గోరంట్ల మాట్లాడుతూ ఈ ప్రాంతవాసులు సుమారు 20 ఏళ్లుగా ఇక్కడే నివాసం ఉంటున్నారని, వారిని కాదని, నగర ప్రాంతానికి చెందిన వారికి ఇళ్లు కేటాయించడం ఏమిటని ప్రశ్నించారు. వీరందరికీ ఈ ప్రాంతంలోనే ఇళ్లు కేటాయించాలని, లేని పక్షంలో పేద ప్రజల తరుపున పోరాడతామన్నారు. అనంతరం మండల పరిషత్ పాఠశాలను పరిశీలించారు. జగన్ ప్రభుత్వం మనబడి కార్యక్రమంలో బాగంగా రాష్ట్రంలో అన్ని పాఠశాలలు అభివృద్ధి చేస్తున్నామని చెపుతున్నారని, అదేమీ జరగడంలేదని దుయ్యబట్టారు. ఈ ప్రాం తంలో మండల పరిషత్ పాఠశాలలో 150 మంది విద్యార్థులు ఉన్నారని పాఠశాల భవనం స్లాబ్ నీరుకారి, కూలేందుకు సిద్ధంగా ఉందని, విద్యార్థులు కూర్చునే పరిస్థితిలో పాఠశాల లేదన్నారు. విద్యాశాఖ అధికారులు తక్షణమే వీటికి మరమ్మతులు చేయాలని ఆదేశించారు.కార్యక్రమంలో జి.నాగేశ్వరరావు, స్థానిక ప్రజలు, పాల్గొన్నారు.
మా పోరాట ఫలితమే : ఎమ్మెల్యే ఆదిరెడ్డి భవాని
రాజమహేంద్రవరం సిటీ, డిసెంబరు 18: ఈనెల 25న టిడ్కో ఇళ్ళలో గృహప్రవేశాలు చేస్తున్న లబ్ధిదారులందరికీ తెలుగుదేశం పార్టీ పక్షాన శుభాకాంక్షలు తెలుపుతున్నామని ఎమ్మెల్యే ఆదిరెడ్డి భవాని పేర్కొన్నారు. శుక్రవారం నగర టీడీపీ ఆధ్వర్యంలో స్థానిక 29,30, 33, 43, 44 డివిజన్లకు సంబంధించిన టిడ్కో లబ్ధిదారులకు ఎమ్మెల్యే భవాని, టీడీపీ రాష్ట్ర ఆర్గనైజింగ్ సెక్రటరీలు యర్రా వేణుగోపాలరాయుడు, ఆదిరెడ్డి వాసు, టీడీపీ రాష్ట్ర కార్యదర్శి కాశీనవీన్‌కుమార్‌లు పసుపు, కుంకుమ, జాకెట్ ముక్కలను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే భవాని మాట్లాడుతూ తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో టిడ్కో ఇళ్ల లబ్ధిదారుల కోసం పోరాటం చేయకుంటే కేటాయింపులు ఇంకా ఆలస్యమయ్యేవని చెప్పారు. టిడ్కో ఇళ్ల విషయంలో ఎవరికి అన్యాయం జరిగినా టీడీపీ తరపున బాధితులకు అండగా నిలబడతామని ఆ పార్టీ నేతలు ప్రకటించారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నగర ప్రధాన కార్యదర్శి రెడ్డి మణి, మహిళా కమిటీ అధ్యక్షురాలు మాలే విజయలక్ష్మీ, నాయకులు మజ్జి శ్రీనివాస్, సిరెడ్డి బాబు, సంసాని ప్రసాద్, కిలారి వెంకటేశ్వరావు, దాట్ల సుబ్రహ్మణ్యం పాల్గొన్నారు.