మద్యం తెగ తాగేషారు

ABN , First Publish Date - 2020-10-28T07:05:21+05:30 IST

అసలే మందుబాబులు. వారికి పండగ వచ్చిందంటే ఆ లెక్కేవేరు. మందుతోనే పండగ వారికి. కానీ గతంలోలా పరిస్థితి లేదు. కావలసిన బ్రాండ్లు లేవు. ప్రభుత్వ మద్యం దుకాణం ఏది అమ్మితే అదే పుచ్చుకోవాలి. గతంలో వంద రకాల బ్రాండ్ల వరకూ ఉండేవి. ఇవాళ 20 లోపే ఉన్నాయి

మద్యం తెగ తాగేషారు

  • దసరా రోజు మద్యం అమ్మకాల మొత్తం రూ.7.24 కోట్లు 
  • ఈనెల 1 నుంచి 26వ తేదీ వరకూ  రూ.132.5 కోట్లు
  • బార్లలో రూ.15 కోట్లు 8 మొత్తం రూ.147.5 కోట్లు 
  • బ్రాండ్లు లేక బార్లకు దెబ్బ 8 బీర్లన్నీ చెత్త సరుకే
  • మద్యం ప్రియుల గగ్గోలు

(రాజమహేంద్రవరం-ఆంధ్రజ్యోతి)

అసలే మందుబాబులు. వారికి పండగ వచ్చిందంటే ఆ లెక్కేవేరు. మందుతోనే పండగ వారికి. కానీ గతంలోలా పరిస్థితి లేదు. కావలసిన బ్రాండ్లు లేవు. ప్రభుత్వ మద్యం దుకాణం ఏది అమ్మితే అదే పుచ్చుకోవాలి. గతంలో వంద రకాల బ్రాండ్ల వరకూ ఉండేవి. ఇవాళ 20 లోపే ఉన్నాయి. అవి కూడా ధరలు విపరీతం కావడంతో మందుబాబులకు మజా కంటే బాధే ఎక్కువ కనిపిస్తోంది. ఇక బీర్లు చెత్త సరుకని బహిరంగంగానే చెబుతున్నారు. అయినా తాగేవాడు ఆగలేడు, తూలేవాడు నిలబడలేడన్నట్టు మద్యం అమ్మకాలు మాత్రం ఆగడం లేదు. ఇరుగుపొరుగు రాష్ర్టాలలో బాగా తక్కువ ధర. ఇక్కడ అనేక రెట్లు ఎక్కువ. నిన్న మొన్నటి వరకూ  మూడు బాటిళ్లకు అనుమతి ఉండేది. దాంతో నచ్చిన బ్రాండ్లు తెచ్చుకునేవారు. ఇవాళ ప్రభుత్వం వాటిని కూడా నిలిపివేసింది. ఇక చచ్చినట్టు దొరికింది తాగవలసిందే. విజయదశమి రోజున జిల్లాలో రూ.7.24 కోట్ల మద్యం తాగేశారు. బార్లలో మరికొంత తాగారు. అది రూ.కోటిన్నర వరకూ ఉండవచ్చని అధికారులు చెబుతున్నారు. దీంతో ఆరోజు సుమారు రూ.8.5 కోట్లు వరకూ తాగేసి ఉంటారు. జిల్లాలో 363 ప్రభుత్వ మద్యం దుకాణాలు ఉన్నాయి. అందులో ఒకటి మూతపడింది. మిగతా 362 అవుట్‌లెట్లలోనూ మద్యం అమ్మకాలు సాగుతున్నాయి.  ఈనెల 25న అంటే విజయదశమిరోజున  సామర్లకోట డిపో పరిధిలోని 144 దుకాణాల్లో 2272 బాక్సుల లిక్కర్‌, 1500 బాక్సుల బీరు తాగేశారు. దీని విలువ  రూ.2.95 కోట్లు. రాజమహేంద్రవరం డిపో పరిధిలో  136 దుకాణాల్లో 1859 లిక్కర్‌ బాక్సులు, 1176 బీరు బాక్సులు తాగేశారు.దీని విలువ రూ.2.46 కోట్లు. అమలాపురం డిపో పరిధిలో 82 షాపుల నుంచి 1608 లిక్కర్‌ బాక్సు లు, 505 బీరు బాక్సులు తాగేశారు. వీటి విలువ రూ.1.83 కోట్లు. మొత్తం ఆరోజు ప్రభుత్వ దుకాణాల నుంచి 5739 లిక్కర్‌ బాక్సులు, 3181 బీరు బాక్సులు తాగేశారు. వీటి విలువ రూ.7.24 కోట్లు. ఇక జిల్లాలో 56 బార్లు ఉన్నాయి. అక్కడ నెలకు సుమారు 15 కోట్ల వరకూ మద్యం అమ్ముడవుతోంది. దసరా రోజున జిల్లాలో మొత్తం బార్లలో రూ.కోటిన్నర వరకూ అమ్ముడై ఉండొచ్చని అధికారులు చెబుతున్నారు. ఇక ఈనెల 1వ తేదీ నుంచి ఈనెల 26వ తేదీ వరకూ జిల్లాలో మొత్తం అమ్మకాలు రూ.132.5 కోట్లు, బార్లలో  సుమారు 15 కోట్లు.. మొత్తం 147.5 కోట్ల లిక్కరు తాగేశారు. ఈ  నెలలో మిగిలిన అయిదు రోజుల్లో సుమారు రూ.30 కోట్ల మద్యం తాగే అవకాశం ఉన్నట్టు అంచనా. ప్రతీనెల రూ.160 నుంచి 170 కోట్లకు పైగా మద్యం తాగేస్తున్నారు. అవి కాకుండా పొరుగురాష్ర్టాల నుంచి ఇప్పటి వరకూ మూడేసి బాటిళ్ల వంతున తెచ్చుకుని కొంతమంది తాగేశారు. కానీ పొరుగురాష్ర్టాలలో తక్కువ ధరలు కావడం వల్ల కొంతమంది అక్రమంగా తెచ్చి అమ్ముతున్నారు. అది కూడా ఆదనపు తాగుడే. ఇవి కాకుండా సామాన్య ప్రజలు నాటు సారా మీద పడ్డారు. జిల్లాలో విస్తృతంగా నాటుసారా లభ్యమవుతోంది. 200 మిల్లీలీటర్ల నాటుసారా రూ.100 వరకూ అమ్ముడవుతోంది. 

Updated Date - 2020-10-28T07:05:21+05:30 IST