-
-
Home » Andhra Pradesh » East Godavari » Latest News in Telugu
-
దివిస్‌పై జగన్‌ది ద్వంద్వ వైఖరి
ABN , First Publish Date - 2020-12-19T05:56:54+05:30 IST
దివీస్ ఏర్పాటు విషయంలో సీఎం జగన్ ద్వంద్వ వైఖరి అవలంబిస్తున్నారని ఎమ్మెల్సీలు ఐ.వెంకటేశ్వరరావు, రాము సూర్యారావు అన్నారు.

ఎమ్మెల్సీలు ఐవీ, ఆర్‌ఎస్‌ఆర్
కాకినాడ,డిసెంబరు 18 (ఆంధ్రజ్యోతి): దివీస్ ఏర్పాటు విషయంలో సీఎం జగన్ ద్వంద్వ వైఖరి అవలంబిస్తున్నారని ఎమ్మెల్సీలు ఐ.వెంకటేశ్వరరావు, రాము సూర్యారావు అన్నారు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు దివీస్ యాజమాన్యానికి వ్యతిరేకంగాను, ఇప్పుడు అధికారంలోకి వచ్చిన తర్వాత అనుకూలంగా వ్యవహరిస్తున్నారన్నారు. ప్రతిపక్షంలో ఉండగా దివీస్‌ను బంగాళాఖాతంలో కలిపేస్తానని చెప్పిన జగన్ ఇప్పుడు యాజమాన్యానికి వత్తాసు పలుకుతున్నారన్నారు. ఈ మేరకు వారు ఓ ప్రకటన విడుదల చేశారు. సంక్షేమం, అభివృద్ధి విషయంలో సీఎం మాట్లాడితే మాట తప్పనని, మడమ తిప్పనని చెబుతుంటారని, ఇప్పుడు ఆయన మాట తప్పి రైతులను మోసం చేస్తున్నారని అన్నారు. కంపెనీ నిర్మాణాన్ని నిలిపివేయాలని స్థానిక రైతులు నెల నుంచి పోరాటం చేస్తున్నారన్నారు. దివీస్ తమకొద్దంటూ కొత్తపాకల గ్రామంలో సమీప 14 గ్రామాల ప్రజలు, రైతులు నిరాహార దీక్షలు చేస్తున్నా యంత్రాంగం పట్టించుకోకపోవడం దారుణమన్నారు.
అరెస్ట్ చేసిన నాయకులను విడుదల చేయాలి
దివీస్ నిర్మాణ పనులను అడ్డుకున్న గ్రామస్థులకు మద్దతుగా ఈ నెల 17న జరిగిన బహిరంగ ప్రదర్శనలో పాల్గొన్న వామపక్ష నాయకులు కేఎన్ శ్రీనివాస్, దువ్వా శేషబాబ్జీ, ఎం.రాజశేఖర్, బుగతా బంగార్రాజు, కె.జనార్దన్, టి.నాగేశ్వరరావును అరెస్టు చేయడం దారుణమని వారిని వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు.
వామపక్షాల నిరసన
తొండంగి మండలం కొత్తపాకల ప్రాంతంలో దివీస్ పరిశ్రమకు వ్యతిరేకంగా పోరాడుతున్న వామపక్ష, రైతు సంఘం నాయకులు కె.సత్యశ్రీనివాసు, దువ్వా శేషుబాబ్జి, మోర్తా రాజశేఖర్, బుగతా బంగారురాజు, జనార్ధన్ ను తక్షణమే విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ జిల్లా కలెక్టరేట్ వద్ద శుక్రవారం వామపక్షాల ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. సీపీఎం, సీపీఎంల్, సీపీఐ, న్యూడెమోక్రసీ, లిబరేషన్, ఏఐఎఫ్‌టీయూ, పీడీయం నాయకులు పాల్గొని నిరసన తెలిపారు. ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ వైసీపీ ప్రజలను నమ్మించి మోసం చేసిందని రాబోయే కాలంలో తగిన మూల్యం చెల్లిస్తారన్నారు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మాట్లాడిన మాటలు, ఇచ్చిన హమీలు, సీఎం జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి రాగానే మరిచిపోయారని విమర్శించారు. రెండు రోజుల్లో 96 మందిని అరెస్టు చేసి అదుపులోకి తీసుకున్నారని వారందరినీ తక్షణం విడుదల చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో సీహెచ్ అజయ్‌కుమార్, బేబీరాణి, జుత్తుగ శ్రీను, టి.ప్రసాద్, పి.ఆదినారాయణ, పి.వీరబాబు పాల్గొన్నారు.