నిఘా
ABN , First Publish Date - 2020-10-27T06:58:07+05:30 IST
jc food action

అంగన్‌వాడీ కేంద్రాల సిబ్బంది నిర్లక్ష్య ధోరణి వీడకపోతే వేటు
జాయింట్ కలెక్టర్ ఆధ్వర్యంలో పర్యవేక్షణ క మిటీ ఏర్పాటు
లబ్ధిదారులకు పౌష్టికాహార పంపిణీలో లోపాలుంటే కఠిన చర్యలు
తేడా వస్తే తొలుత వేటు పడేది సూపర్‌వైజర్ల పైనే..
ఆపై సీడీపీవోలు, పీడీ బాధ్యులు 8 ఆదేశాలు జారీ చేసిన ప్రభుత్వం
(కాకినాడ-ఆంధ్రజ్యోతి)
మురికివాడల్లో ఉండే చిన్న పిల్లలు ప్రభుత్వ పాఠశాలల్లో చేరేలోపు వారిని సంపూర్ణ ఆరోగ్యవంతులుగా తీర్చి, కనీస విద్యాబుద్ధులు నేర్పించేందుకు అంగన్‌వాడీ వ్యవస్థ ఏర్ప డింది. తర్వాత కాలక్రమేణా ఈ పథకం నిరుపేద బాలింతలు, గర్బిణులు, కౌమార బాలికల్లో ఉన్న రక్తహీనత నివారించడానికి సైతం నడుంబిగించింది. కానీ ఏ ప్రభుత్వం అధికారంలో ఉన్నా సదరు ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు కేంద్ర ప్రభుత్వ ఆశయాన్ని నీరుగార్చేలా అశ్రద్ధ వహిస్తున్నాయని ఇటీవల కేంద్ర కుటుంబ ఆరోగ్య సంక్షేమ మంత్రిత్వ శాఖ అభిప్రాయపడింది. తాము ఈ వ్యవస్థ బలోపేతానికి ఏటా కోట్లాది నిధులు ఖర్చు చేస్తున్నా ఫలితం ఎక్కడి వేసిన గొంగలి అక్కడే అన్న చందాన ఉంటుందనే నివేదిక కేంద్రానికి అందడంతో పరిస్థితిలో మార్పు తీసుకురావడానికి చర్యలు తీసుకుంది. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వాలకు ఒక సీరియస్ సర్క్యులర్ జారీ చేసిందని సమాచారం. అయితే కేంద్రం పంపిన సర్క్యులర్‌ను అమలు చేసే క్రమంలో రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల జిల్లా యంత్రాంగాలకు మరో సర్క్యులర్‌ను జారీ చేసింది. అంగన్‌వాడీ కేంద్రాల్లో ఆశించిన మేరకు లబ్ధిదారులకు న్యాయం జరగాలంటే తొలుత ఈ వ్యవస్థను సమూలంగా ప్రక్షాళన చేయాలని సదరు సర్క్యులర్‌లో పేర్కొందని సమాచారం. దీంతో తొలుత కేంద్రాల్లో పనిచేసే వర్కర్లు, కార్యకర్తల పనితీరులో మార్పు తీసుకురావాలని, మారకపోతే నిర్ధాక్షిణ్యంగా వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని, ఈ విషయంలో క్షేత్రస్థాయిలో పనిచేసే సూపర్‌వైజర్లు, సీడీపీవోలపై వేటు వేయాలని ఆదే శించింది. దీనికి సంబంధించి జేసీ పర్యవేక్షణలో ఓ కమిటీ వేసి కేంద్రాల పనితీరుపై నిరంతరం పర్యవేక్షించాలని ఆదేశించింది. జిల్లాలో 5113, మినీ 433 అంగన్‌వాడీ కేంద్రాలున్నాయి. ఈ కేంద్రాలకు 6 నెలల నుంచి 72 నెలలు, 6 సంవత్సరాలలోపు పిల్లలు పౌష్టికాహారం కోసం వెళ్తుంటారు. బాలింతలు, గర్బిణులు, కిశోరా బాలికలు కూడా వెళ్తారు. 6 నెలల నుంచి 72 నెలల పిల్లలకు ప్రతీ రోజూ పాలు, గుడ్డు ఈ కేంద్రాల్లో ఇవ్వాలి. 3 నుంచి 6 ఏళ్లలోపు చిన్నారులకు ఆకు కూరతో భోజనం పెట్టాలి. బాలింతలకు, గర్బిణులకు బియ్యం, కందిపప్పు, నూనె, ఇతర సరుకులను టేక్ హోమ్ రేషన్ (టీహెచ్‌ఆర్)గా ఇస్తారు. 3 నుంచి 6 ఏళ్లలోపు వయస్సున్న పిల్లలకు రెండు రకాలుగా మధ్యాహ్న భోజనం పెట్టాల్సి ఉంది. పప్పు, ఆకుకూరతో కలిపి అన్నం లేదా కూరగా యలతో సాంబారు, అన్నం ఇలా రెండు పద్ధతుల్లో ఏదో ఒక పద్ధతిన భోజనం పెట్టాలి. నాలుగు రోజులు గుడ్డు ఇవ్వాలి. 7 నెలల నుంచి 3 సంవత్సరాల వయస్సు పిల్లలకు టేక్‌హోమ్ రేషన్ (టీహెచ్‌ఆర్) పద్ధతిలో బియ్యం, కందిపప్పు, నూనె, గుడ్లు ఇవ్వాలి. గర్బిణులు, బాలింతలకు టీహెచ్‌ఆర్ పద్ధతిన రోజుకు 120 గ్రాముల బియ్యం, 40 గ్రాముల కంది పప్పు, 18.2 గ్రాముల వంట నూనె, నాలుగు రోజులపాటు గుడ్లు ఇవ్వాలి. కానీ ఈ వస్తువులన్నీ అంగన్‌వాడీ కేంద్రాలకు ఎప్పుడూ సజావుగా పంపిణీ కావడం లేదని, తాము ఎక్కడ నుంచి తెచ్చి పెట్టాలని అంగన్‌వాడీలు వాదిస్తున్నారు. అన్నీ సక్రమంగా ఇస్తే తాము ఎందుకు ఉదాశీనంగా ఉంటామని ప్రశ్నిస్తున్నారు. శాఖాపరమైన లోపాలు సరిదిద్దుకుని అన్ని అంగన్‌వాడీ కేంద్రాలకు లబ్ధిదారులకు సరిపడిన సరుకులు సకాలంలో మంజూరు చేసి, ఆపై తమ తప్పిదం ఉంటే చర్యలు తీసుకుంటే సమంజసంగా ఉంటుందని చెబుతున్నారు. అరకొరగా ఇచ్చి అన్నీ పక్కాగా అమలు చేయాలంటే తాము నెలలో ఎన్నిసార్లు అప్పులు తెచ్చి లబ్ధిదారులను సంతృప్తిపరచాలో చెప్పాలంటున్నారు. జిల్లాలో 3,98,04 మంది గర్భవతులు, 3,34,84 మంది బాలింతలు, 0-6 నెలల పిల్లలు 3,35,88, 6 నెలల నుంచి 6 ఏళ్ల పిల్లలు 3,15,023 మంది అంగన్‌వాడీ కేంద్రాల్లో పౌష్ఠికాహారం తీసుకుంటున్నారు. కానీ వీరికి కొన్నిచోట్ల పూర్తి స్థాయిలో పౌష్టికాహారం అందడం లేదని ఆరోపణలు వ్యక్తమవుతున్నాయి.
కమిటీ పనిచేసేది ఇలా..
ఐసీడీఎస్ శాఖను పర్యవేక్షిస్తున్న జేసీ ఆధ్వర్యంలో కమిటీ ఏర్పడనుంది. కమిటీలో జేసీ, ఈ శాఖ పీడీ, ఆర్డీవోలు, ఎంపీడీవోలు సభ్యులుగా ఉంటారు. వీరంతా నెలలో రెండు మూడు సార్లు ఆకస్మికంగా అంగన్‌వాడీ కేంద్రాలను తనిఖీ చేస్తారు. అక్కడ ఎటువంటి పొరపాటు గమనించినా తొలుత వర్కరు, కార్యకర్తపై చర్యలు తీసుకుంటారు. ఆపై శాఖాపరమైన విచారణలో బాధ్యులపై బలమైన వేటు వేస్తారు. ఈ విషయంలో సూపర్‌వైజర్లు, సీడీపీవోలు ఇక మెరుగైన పనితీరు కనబరచాల్సి ఉంది.