మీ భూమెంత? మా భూమెంత?
ABN , First Publish Date - 2020-12-10T06:02:10+05:30 IST
జిల్లాలో శాశ్వత భూ హక్కు సమగ్ర సర్వేకు అన్ని ఏర్పాట్లు చేస్తున్నామని కలెక్టర్ డి.మురళీధర్‌రెడ్డి తెలిపారు.

సమగ్ర సర్వేకు అధికారుల సన్నద్ధం
డెయిరీపారమ్ సెంటర్(కాకినాడ),డిసెంబరు9: జిల్లాలో శాశ్వత భూ హక్కు సమగ్ర సర్వేకు అన్ని ఏర్పాట్లు చేస్తున్నామని కలెక్టర్ డి.మురళీధర్‌రెడ్డి తెలిపారు. ఈ నెల 21 నుంచి ప్రారంభించనున్న వైఎస్‌ఆర్ జగనన్న శాశ్వత భూ హక్కు- భూరక్ష పథకం కింద సమగ్ర సర్వే నిర్వహించేందుకు చేపట్టాల్సిన ఏర్పాట్లపై ముఖ్యమంత్రి జగన్మోహనరెడ్డి తాడేపల్లి నుంచి వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సమావేశంలో జాయింట్ కలెక్టర్లు జి లక్ష్మీశ, చేకూరి కీర్తి పాల్గొన్నారు. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ ఈ పఽథకం అమలుకు అవసరమైన శిక్షణ, సాంకేతిక సహకారం అందించేందుకు సర్వే ఆఫ్ ఇండియా సంస్థతో రాష్ట్ర ప్రభుత్వం అవగాహన ఒప్పందం చేసుకుందని వివరించారు. ఈ పఽథకం ప్రారంభం లోగా జిల్లాల్లో సమగ్ర సర్వే కార్యక్రమాల నిర్వహణకు అవసరమైన ముందస్తు ఏర్పాట్లు పటిష్టంగా చేపట్టాలన్నారు. ఈ సమావేశంలో జిల్లా రెవెన్యూ అధికారి సీహెచ్ సత్తిబాబు, సర్వే శాఖ ఏడీ ఏవీఎస్ గోపాలకృష్ణ, కలెక్టరేట్ సూపరింటెండెంట్లు పాల్గొన్నారు.