భూ సేకరణ వేగవంతం చేయాలి

ABN , First Publish Date - 2020-02-12T08:53:21+05:30 IST

ఉగాదిరోజున పేదలకు ఇవ్వనున్న ఇళ్లపట్టాలకు సంబంధించి భూ సేకరణ ప్రక్రియ వేగవంతం చేసి లేఅవుట్‌లు సిద్ధం చేయాలని సీఎం జగన్‌ కలెక్టర్‌ మురళీధర్‌రెడ్డిని ఆదేశించారు. పేదలకు కావలసిన భూములను సమీకరించే విషయంలో జిల్లా

భూ సేకరణ వేగవంతం చేయాలి

మార్చి 1కి భూములు సిద్ధం చేయాలి

ప్లాన్‌-బీ అమలు చేయండి

ఎంత ఖర్చయినా పర్వాలేదు

కలెక్టర్‌ను ఆదేశించిన సీఎం జగన్‌ 


కాకినాడ, ఫిబ్రవరి 11 (ఆంధ్రజ్యోతి ప్రతినిధి)

ఉగాదిరోజున పేదలకు ఇవ్వనున్న ఇళ్లపట్టాలకు సంబంధించి భూ సేకరణ ప్రక్రియ వేగవంతం చేసి లేఅవుట్‌లు సిద్ధం చేయాలని సీఎం జగన్‌ కలెక్టర్‌ మురళీధర్‌రెడ్డిని ఆదేశించారు. పేదలకు కావలసిన భూములను సమీకరించే విషయంలో జిల్లా వెనుకబడిపోయిందని సీఎం తెలిపారు. మార్చి 1నాటికి మొత్తం అన్ని భూములు సిద్ధం చేయాలని సూచించారు. జిల్లాల్లో భూముల సమీకరణ నత్తనడకగా ఉండడంపై మంగళవారం కలెక్టర్ల వీడియో కాన్ఫరెన్స్‌లో సీఎం జగన్‌ సమీక్షించారు. తూర్పుగోదావరిలో నత్తనడకకు కారణమేంటని కలెక్టర్‌ను ప్రశ్నించారు. దీంతో మురళీధర్‌రెడ్డి పరిస్థితిని వివరించారు. జిల్లాలో పేదల కోసం ప్రభుత్వ భూములు, చెరువులు, ఇతర ప్రభుత్వశాఖల స్థలాలు పోను ఇంకా 1500ఎకరాలు అవసరమని తెలిపారు. ఇప్పటికే వీటిలో 300ఎకరాలు సిద్ధంగా ఉన్నాయని... ఇంకా 1200 ఎకరాల ప్రైవేటు భూమి అవసరమని, అందుకోసం కాకినాడకు సమీపంలోని 800 ఎకరాల చొల్లంగి ఉప్పు భూములను తీసుకుంటున్నట్టు వివరించారు. కానీ ఢిల్లీ నుంచి అనుమతులు రాలేదన్నారు. కేంద్ర సాల్ట్‌ కమిషనర్‌ పరిధిలోని ఉప్పు భూములు ఇళ్లస్థలాల అవసరాలకు కేటాయించడానికి అక్కడి నుంచి అనుమతి ఇస్తారా? లేదా? అనేది తెలియడానికి ఇంకా వారం లేదా పదిరోజులు పట్టవచ్చని కలెక్టర్‌ వివరించారు.


ఇప్పటికే అమరావతిలో ప్రిన్సిపల్‌ సెక్రటరీతో మాట్లాడనన్నారు. ఇవి గనుక అందుబాటులోకి వస్తే సేకరించాల్సిన భూమి కేవలం 400ఎకరాలు మాత్రమే ఉంటుందని చెప్పారు. దీనిపై సీఎం జగన్‌ మాట్లాడుతూ ఉప్పు భూములకు అనుమతి ఆలస్యమైనా, ఒకవేళ ఇవ్వకపోయినా ఇబ్బందిలేకుండా ప్రత్యామ్నాయంగా ప్లాన్‌-బీ అమలుచేయాలని ఆదేశించారు. ఈ భూములు కాకుండా ఇతరత్రా మార్గాల్లో భూములు సమీకరించుకునేలా కార్యాచరణ సిద్ధం చేయాలన్నారు. మార్చి 15కి ఎట్టి పరిస్థితుల్లో ప్లాట్‌లు సిద్ధమవ్వాలని ఆయన స్పష్టంచేశారు. ప్రైవేటు భూముల కొనుగోలుకు ఎంత ఖర్చయినా పర్వాలేదని, కలెక్టర్‌ చొరవ తీసుకోవాలని సీఎం ఆదేశించారు.

Updated Date - 2020-02-12T08:53:21+05:30 IST