ప్రాణాలు కొట్టుకుపోతున్నాయి!

ABN , First Publish Date - 2020-09-06T10:08:32+05:30 IST

జిల్లాలో కిరాణా కొట్టు నడుపుతున్న వందలాది పేద కుటుంబాల్లో కొవిడ్‌ మరణాలు కల్లోలం సృష్టిస్తున్నాయి.

ప్రాణాలు కొట్టుకుపోతున్నాయి!

  • కొవిడ్‌ మరణాల బారిన కిరాణా కొట్టు నిర్వాహకులు
  •  బతుకుదెరువు కోసం తప్పనిసరి పరిస్థితుల్లో వ్యాపారం
  • వచ్చేపోయే వినియోగదారులతో సులువుగా పాకిపోతున్న వైరస్‌ 
  • వీరి నుంచి ఇంట్లో కుటుంబ సభ్యులకూ మహమ్మారి భయంకరంగా వ్యాప్తి
  • వైరస్‌ సోకి.. ఆఖరి క్షణాల్లో పరిస్థితి విషమించి జిల్లాలో 42 మంది మృతి
  • ఒక్క రావులపాలెంలోనే ముగ్గురు కిరాణా వ్యాపారుల ఇళ్లల్లో ఆరుగురి మృతి
  • అనారోగ్యంతో మృతి చెందాక మరికొందరిలో వైరస్‌ నిర్దారణ
  • మృత్యువు బారిన కోడిగుడ్ల వ్యాపారులు, కర్రీ పాయింట్‌ నిర్వాహకులు కూడా


(కాకినాడ-ఆంధ్రజ్యోతి)

జిల్లాలో కిరాణా కొట్టు నడుపుతున్న వందలాది పేద కుటుంబాల్లో కొవిడ్‌ మరణాలు కల్లోలం సృష్టిస్తున్నాయి. ఎన్నో జీవితాలు తల్లకిందులైపోతున్నాయి. ఇప్పటివరకు జిల్లావ్యాప్తంగా 45 మంది కిరాణాకొట్టు నిర్వాహకులు వైరస్‌తో కన్నుమూయడం పరిస్థితి తీవ్రతను చాటుతోంది. బతుకుదెరువు కోసం వేరే దారిలేక కిరాణా దుకాణాలు నడుపుతున్న ఎందరో వైరస్‌ బారిన పడుతున్నారు. వచ్చేపోయే వినియోగదారుల ద్వారా వీరికి వేగంగా వైరస్‌ పాకేస్తోంది. వీరివల్ల ఇంట్లో వారు సైతం మహమ్మారికి బలైపోతున్నారు.


వందల్లో బాధితులు...

కొవిడ్‌ మహమ్మారి జిల్లా అంతుచూస్తోంది. వేలాది కేసులతో పగబట్టేస్తోంది. నిత్యం పదుల సంఖ్యలో జనం వైరస్‌తో కన్నుమూస్తున్నారు. వీరిలో కిరాణా కొట్టు నిర్వాహకులు కూడా అధికంగా ఉంటున్నారు. వైరస్‌ ఆరంభంలో నెలల తరబడి లాక్‌డౌన్‌తో కిరాణా కొట్టు నడుపుతున్న వందల కుటుంబాలు ఆర్థికంగా చితికిపోయాయి. ఇంటి అద్దె, దుకాణం అద్దె కట్టలేక ఎన్నో కుటుంబాలు రోడ్డున పడ్డాయి. అయితే రోజం తా దుకాణం నడిస్తే వచ్చే డబ్బులతో కుటుంబం బతికే పరి స్థితి ఉండడంతో అనేకచోట్ల వ్యాపారులు దుకాణాలు తెరిచారు. ఈ క్రమంలో వైరస్‌ బారిన పడతామనే భయం ఉన్నా తప్పనిసరి పరిస్థితుల్లో దుకాణాలు నడుపుతున్నారు. కొందరు దుకాణం ముందు ప్లాస్టిక్‌ కవర్లు వేలాడదీయడం, మాస్క్‌ ధరించడం, అడ్డుకట్టలు వేయడం చేస్తున్నా ఏదొక సమయంలో తెలియకుండానే వైరస్‌కు చిక్కుకుంటున్నారు. ఒక్కో దుకాణానికి ఉదయం నుంచి రాత్రి వరకు పదుల సంఖ్యలో వినియోగదారులు వస్తుంటారు.


రెడ్‌జోన్‌, కంటైన్మెంట్‌ ప్రాం తాల్లోని వారు కూడా కొనుగోళ్లకు వస్తుంటారు. తద్వారా వీరి నుంచి వ్యాపారులకు వైరస్‌ వ్యాపిస్తోంది. రెడ్‌జోన్‌ ప్రాంతా ల్లో కట్టడి లేకపోవడం, చివరకు కొవిడ్‌ సోకిన వ్యక్తుల ఇళ్ల ల్లోంచి కూడా నిత్యావసర సరకుల కోసం దుకాణాలకు నేరుగా వచ్చేస్తున్నారు. ఈ క్రమంలో ఎవరిలో వైరస్‌ ఉందో.. ఎవరు కొవిడ్‌ క్యారియరో తెలియని పరిస్థితి. అటు వినియోగదారుడికి సరుకులు అందించే క్రమంలోను, డబ్బులు ఇచ్చుపుచ్చుకునే క్రమంలో దూరం పాటింపు ఉండడం లేదు. అలాగే వచ్చిన సొమ్మును లెక్కించే సమయంలో నోటితో తడిచేయడం కూడా అలవాటుగా చేస్తుండడం వీరికి ప్రాణాల మీదకు తెస్తోంది. దీంతో కిరాణాదుకాణాల వ్యాపారులు పెద్ద ఎత్తున వైరస్‌బారిన పడుతున్నారు. ఇలా జిల్లాలో ఇప్పుడు వందలాది మంది వైరస్‌సోకి విలవిల్లాడుతున్నారు. 


ఎక్కువ ఆ ప్రాంతాల్లోనే...

కొవిడ్‌ సోకిన వ్యాపారుల్లో జిల్లావ్యాప్తంగా ఇప్పటివరకు మరణించిన వారి సంఖ్య 45. తునిలో ముగ్గురు, కడియం 1, పెద్దాపురం 2, సామర్లకోట 1, శంఖవరం 1, కాకినాడ 4, గొల్లప్రోలు 1, పిఠాపురం 1, కాట్రేనికోన 1, ఆత్రేయపురం 1, సఖినేటిపల్లి 1, కొత్తపేట 1, రాజమహేంద్రవరం 5, రాజానగరం 2, గోకవరం 1, రావులపాలెం 3 చొప్పున పలు మండలాల్లో మరణించిన వారున్నారు. మరికొందరు చావుబతుకుల మధ్య కొట్టుమిట్టాడుతున్నారు. మరోపక్క ఆయా దుకాణాల నిర్వాహకుల ఇళ్లల్లో కుటుంబ సభ్యులు చాలామంది మృత్యువాత పడ్డారు. ప్రధానంగా రావులపాలెం మండలంలో ముగ్గురు కిరాణా కొట్టు వ్యాపారులు వైరస్‌తో చనిపోయారు. వీరి ద్వారా మహమ్మారి వ్యాపించి వారి కుటుంబాల్లో మరో ముగ్గురు కన్నుమూశారు. ఇలా అనేక కిరాణావ్యాపారుల కుటుంబాల్లో చాలామంది చావుబతుకుల మధ్య కొట్టుమిట్టాడుతున్నారు. చిన్న ఇళ్లల్లో ఉండే కిరాణావ్యాపారులు తమకు కొవిడ్‌ సోకిందనే విషయం తెలుసుకునేలోపే ఇంట్లో మిగిలిన వారికి వైరస్‌ వ్యాపించేస్తోంది. వ్యాపారం పోతుందనే భయం తో కొందరు టెస్ట్‌లకు వెళ్లడానికి నిర్లక్ష్యం చేస్తున్నారు.


మరికొందరికి అసలు లక్షణాలు బయట పడడం లేదు. ఇంకొం దరు హోంఐసోలేషన్‌లో చికిత్స తీసుకుంటున్నారు. తీరా ఒక్కసారిగా పరిస్థితి విషమిస్తుండడంతోసకాలంలో అంబులెన్స్‌లు రాక, ఆసుపత్రుల్లో పడకలు దొరక్క, ఒకవేళ దొరికినా ఆరోగ్యం అప్పటికే బాగా క్షీణించిపోయి చాలామంది కన్నుమూస్తున్నారు. ఆ తర్వాత కొద్దిరోజుల్లో వీరి కుటుంబాల్లోను పలువురు ఇళ్లల్లో చనిపోతున్నారు. ఇలా చనిపోయినవారిలో చాలామందికి మరణానంతర పరీక్షల్లో వైరస్‌ నిర్ధారణ అవు తుండడం విశేషం. అటు అనేకప్రాంతాల్లోని కోడిగుడ్ల వ్యాపారులు, కర్రీ పాయింట్ల నిర్వాహకుల పరిస్థితీ ఇలాగే ఉంది.

Updated Date - 2020-09-06T10:08:32+05:30 IST