కోరుకొండ తీర్థమండి.. రండి.. రండి..!

ABN , First Publish Date - 2020-03-04T08:56:21+05:30 IST

కోరుకొండ తీర్థానికి సమయం ఆసన్నమైంది. శ్రీలక్ష్మినరసింహస్వామి దివ్యకల్యాణ మహోత్సవాలు ఈనెల 5న ప్రారంభం కానున్నాయి. ఈనెల 5తేదీ పాల్గుణ శుద్ధ ఏకాదశి శుక్రవారం నుంచి 11 వరకు

కోరుకొండ తీర్థమండి.. రండి.. రండి..!

రేపటినుంచి కోరుకొండ శ్రీలక్ష్మినరసింహస్వామి కల్యాణోత్సవాలు

5 నుంచి 11 వరకు కల్యాణ మహోత్సవాలు

6న మధ్యాహ్నం 2.30 గంటలకు రథోత్సవం

రాత్రి 9 గంటలకు కల్యాణం ప్రారంభం


కోరుకొండ: 

కోరుకొండ తీర్థానికి సమయం ఆసన్నమైంది. శ్రీలక్ష్మినరసింహస్వామి దివ్యకల్యాణ మహోత్సవాలు ఈనెల 5న ప్రారంభం కానున్నాయి. ఈనెల 5తేదీ పాల్గుణ శుద్ధ ఏకాదశి శుక్రవారం నుంచి 11 వరకు అంగరంగ వైభవంగా జరిగే స్వామివారి దివ్యకల్యాణమహోత్సవాలకోసం అన్నవరం దేవస్థానం వారు చురుగ్గా ఏర్పాట్లు చేస్తున్నారు. ప్రతిరోజూ వైధిక, వేద, శాస్త్ర, విద్వత్‌గోష్టి, ధార్మిక, సంగీత, సాంస్కృతిక, జానపద కార్యక్రమాలను నిర్వహించనున్నారు. రాష్ట్రం నలుమూలలనుంచే కాకుండా ఇతర రాష్ట్రాల నుంచి తరలి వచ్చే భక్తులకు ఏర్పాట్లు చేస్తున్నట్టు స్థానిక ఎమ్మెల్యే, ఏపీ కాపు కార్పొరేషన్‌ చైర్మన్‌ జక్కంపూడి రాజా ఇంద్రవందిత్‌ ఆధ్వర్యంలో లక్ష్మీనరసింహస్వామి దేవస్థానం అనువంశిక ధర్మకర్త ఎస్పీ రంగరాజబట్టర్‌, అన్నవరం దేవస్థానం వ్యవస్థాపక కుటుంబసభ్యులు ఐవీ రోహిత్‌, అన్నవరం దేవస్థానం కార్యనిర్వహణాధికారి వి.త్రినాథరావు తెలిపారు. ఫౌండర్‌ ట్రస్టీ ఎస్‌పీ రంగరాజబట్టర్‌ పర్యవేక్షణలో వైఖానస ఆగమపండితులు ఖండవల్లి సూర్యనారాయణాచార్యులు(రమణబాబు) బ్రహ్మత్వంలో పెద్దింటి, పెరవలి, పెదపాటి, అనువంశిక అర్చకత్వంలో స్వామి దివ్యకల్యాణ మహోత్సవాలను వైభవంగా నిర్వహించడం ఇక్కడి ఆచారం.


క్షేత్రమహత్యం

శ్రీలక్ష్మినరసింహస్వామివారు కలియుగంలో భక్తులు కోరిన కోర్కెలు తీర్చడంకోసం ధాన్యపురాశిలా కోరుగా ఉన్న కొండపై స్వయంభూగా వెలశారని భక్తుల నమ్మకం. కోరుకొండకు సువర్ణగిరి, వేదాద్రి, పరాసర శైలం, పారిజాతగిరి అనే పేర్లు ఉన్నాయి. 650 మెట్లకు పైగా నిటారైన కోరుగా ఉన్న కొండ కావడంతో దీనికి కోరుకొండ అనే పేరు వచ్చింది. కొండ చుట్టూ భక్తులు ప్రదక్షిణ చేసే అవకాశం దేశంలో అరుణాచలం తర్వాత కోరుకొండకు మాత్రమే ఉంది. 


కొండపై ఆలయ నిర్మాణం

ముమ్మిడి నాయకుడు భార్యలక్ష్మిదాసి గొప్పవైష్ణవ భక్తురాలు ఆమె కీ.శ. 1353లో విజయ సంవత్సరం ఫాల్గుణమాసం శుద్ధ దశమి గురువారం రోహిణీ నక్షత్రంలో కొండపైన దేవాలయ నిర్మాణం, జీర్ణోద్ధరణ చేసినట్లు శిలాశాసనాలు ఉన్నాయి. కొండపైన 10 సెంట్లు వైశాల్యం గల కొండ శిఖరంమీద ఈ దేవాలయం నేటికీ చెక్కుచెదరకుండా ఉంది. కొండదిగువన మరో పెద్దదేవాలయాన్ని నిర్మించి కొండ ఎక్కలేని భక్తుల కోసం స్వామిని ప్రతిష్ట చేశారు.


స్వామివారి చారిత్రక నేపథ్యం

మంచి కొండ రెడ్డిరాజులు క్రీ. శ. 1325, 1395 మధ్య కోరుకొండను రాజధానిగా చేసుకుని 70ఏళ్లు పరిపాలించారు. కోరుకొండ శ్రీలక్ష్మినరసింహస్వామివారి దివ్య క్షేత్రంగా దీన్ని తీర్చిదిద్దారు. 1340, 1370 మధ్య రాజైన ముమ్మిడి నాయకుడు శ్రీరంగంలోని వైష్ణవ గురువుల శిష్యరికం చేసి శ్రీరంగం నుంచి పరాసర బట్టర్‌ వంశీకులను కోరుకొండకు రప్పించి స్వామివారికి ధర్మకర్తగా నియమించారు.


ముస్తాబౌతున్న రథం, వాహనాలు 

కోరుకొండ శ్రీలక్ష్మినరసింహాస్వామి బ్రహోత్సవాల సందర్భంగా స్వామివారి అతిపెద్ద రథం మరమ్మతులు చేసి రంగులు అద్దుతున్నారు. స్వామివారి ఉత్సవాల్లో 5 రోజులపాటు రోజుకు ఒక వాహనంలో స్వామి గ్రామోత్సవం చేస్తారు. అందుకోసం స్వామివారి రథం, గరుఢ, ఆంజనేయ, గజ, శేషవాహనాలను సిద్ధం చేస్తున్నారు. కొండదిగువన, కొండపైన, స్వామి పాదాల వద్ద శ్రీభూసమేత అనంత పద్మనాభ స్వామి ఆలయం, కొండపైన వైకుంఠ నారాయణుని ఆలయం, స్వామి స్వయంభూగా వెలసిన ఆలయం, ప్రతిష్టించిన మూలవిరాట్‌లను ఉత్సవాల సమయంలో ఊరేగించే ఉత్సవమూర్తులను ఉత్సవాలకోసం సిద్ధం చేస్తున్నారు.


ప్రధాన కార్యక్రమాలు 

5న గురువారం సాయంత్రం 5గంటలకు వైకానస ఆగమ పండితులు శ్రీమాన్‌ఖండవల్లి సూర్యనారాయణాచార్యులు ఆధ్వర్యంలో స్వామివారికి కోనేరువద్ద నుంచి పుట్టమన్ను తెస్తారు. అంకురార్పణం, ధ్వజారోహణంతో స్వామి ఉత్సవాలకు శ్రీకారం చుడతారు.


6న మధ్యాహ్నం 12గంటలకు స్వామిని పెండ్లికుమారుడుగాను, అమ్మవారిని పెండ్లికుమార్తెగా అలంకరిస్తారు. మధ్యాహ్నం 2గంటలకు రథోత్సవం, రాత్రి 9గంటలకు స్వామివారి కల్యాణమహోత్సవం జరుగుతాయి.


11న రాత్రి పర్యంక శయనోత్సవం (శ్రీపుష్పయాగం) నిర్వహిస్తారు.

Updated Date - 2020-03-04T08:56:21+05:30 IST