‘పుంజు’కోలేదు:

ABN , First Publish Date - 2020-12-17T07:32:54+05:30 IST

సంక్రాంతికి ఇంకా నెల రోజులు వ్యవధి ఉందనగానే జిల్లాలో కోనసీమ సహా మెట్ట ప్రాంతంలో కోడి పందాలకు ఏటా భారీ సన్నాహాలు మొదలయ్యేవి.

‘పుంజు’కోలేదు:

 ఈసారి కో‘ఢీ’ కష్టమే 

 జిల్లాలో సంక్రాంతి కోడి పందాల సందడిపై కొవిడ్‌ ఎఫెక్ట్‌

 కోనసీమ సహా జిల్లాలో ఎక్కడా కానరాని భారీ సన్నాహాల సందడి

 ఏటా ఈపాటికే జాతి కోళ్లను కొని  రకరకాల మేతలతో నిర్వాహకుల హడావుడి

 కానీ ఈసారి పండగ దగ్గరపడుతున్నా ఎక్కడా కానరాని కోడి జాడ

 ఈసురోమంటున్న పందెంరాయుళ్లు

  పెట్టుబడులపై నిర్వాహకుల్లోనూ నీరసం


సంక్రాంతి అంటే కోడిపందాలు.. కాలుదువ్వే పుంజులు.. కరెన్సీ కట్టలతో కాయ్‌రాజా కాయ్‌ అంటూ సందడి చేసే పందెం రాయుళ్లు. ఒకరకంగా చెప్పాలంటే సంక్రాంతి సందడి అందరికంటే ముందే మొదలయ్యేది తూర్పులోనే. అదీ కోనసీమలో అయితే ఇక చెప్పక్కర్లేదు. ముందస్తు బరులు.. మేలు జాతి పుంజులను మేపుతూ రోజుల తరబడి సన్నాహాలు ఎక్కడికక్కడ కనిపించేవి. అయితే ఈసారి కొవిడ్‌తో ఈ పరిస్థితి పూర్తిగా తారుమారైంది. ఎక్కడా సన్నాహాల సందడి లేదు. ఏటా ఈపాటికే కోనసీమ సహా జిల్లాలో ఎక్కడికక్కడ ముస్తాబయ్యే పందెం పుంజులు ఇప్పుడు పండగ దగ్గరవుతున్నా కనిపించడం లేదు. సంక్రాంతికి నాంది          పలికే ధనుర్మాసం మొదలైనా పల్లెల్లో గతంలో కనిపించే సందడి లేదు.


(కాకినాడ-ఆంధ్రజ్యోతి)

సంక్రాంతికి ఇంకా నెల రోజులు వ్యవధి ఉందనగానే జిల్లాలో కోనసీమ సహా మెట్ట ప్రాంతంలో కోడి పందాలకు ఏటా భారీ సన్నాహాలు మొదలయ్యేవి. పండగ రోజు పందాల కోసం ఎక్కడికక్కడ జాతికోళ్లను ముందునుంచే సిద్ధం చేసేవారు. పోటీల్లో తమ పుంజే గెలిచేలా చేయడానికి నెల ముందు నుంచే వాటికి రకరకాల ఆహారాలు అందించి పుష్టిగా పోషించేవారు. ప్రత్యర్థిని మట్టికరిపించడానికి ఈత నేర్పించడం, ఎదుటి పుంజుపై పంజా విసరడం వంటి వాటిపై తర్ఫీదు ఇచ్చే సందడి ఎక్కడికక్కడ ముచ్చటగొలిపేది. ఒకరకంగా చెప్పాలంటే జిల్లాలో మెట్టతోపాటు కోనసీమలో డిసెంబరు రెండో వారానికే కోడి           పందాల సందడి భారీగానే మొదలయ్యేది. అనూహ్యంగా ఈసారి ఎక్కడా పందాల సన్నాహాల జాడ కనిపించడం లేదు. బరులకు ప్రసిద్ధి చెందిన ప్రాంతాల్లో అసలు ఆ ఊసే వినిపించడం లేదు. వాస్తవానికి ఏటా ఈపాటికి అనేకమంది పందెంరాయుళ్లు, ఏళ్ల తరబడి బరులు నడిపే నిర్వాహకులు పశ్చిమగోదావరి జిల్లాలోని భీమవరానికి వెళ్లి అక్కడి నుంచి మేలు జాతి పుంజులను కొనుగోలు చేసి తీసుకుని వచ్చేవారు. ముఖ్యంగా డేగ, నెమలి, కాకి, అబ్రాస్‌, సేతు, పర్లసవల, మైల, కొక్కిరాయి తదితర పుంజులను రూ.5 వేల నుంచి రూ.10 వేల వరకు పెట్టి పుంజులను కొనేవారు. ఈ కొనుగోళ్ల వరకే జిల్లావ్యాప్తంగా కోట్లలో ఉండేది. కానీ ఈసారి కొవిడ్‌ భయంతో ఎక్కడా పందెం కోళ్ల జాడ కనిపించడం లేదు. కొనుగోళ్లు సైతం పూర్తిగా తగ్గిపోయాయి. అటు డిసెంబరు మొదటివారం నుంచే ముమ్మిడివరం, ఐ.పోలవరం, కాట్రేనికోన, రాజోలు, రావులపాలెం, జగ్గంపేట, తుని, ప్రత్తిపాడు తదితర ప్రాంతాల్లో పందెం పుంజులను మేపుతూ బరుల కోసం నిర్వాహకులు సన్నాహాలు చేసేవారు. కానీ ఈసారి ఎక్కడా పుంజుల జాడే కనిపించడం లేదు. మురమళ్ల, ఇంజరం, గోడితిప్ప, కాట్రేనికోన, గెద్దనాపల్లి తదితర ప్రాంతాల నుంచి పందెం నిర్వాహకులు భీమవరం వెళ్లి మేలుజాతి పుంజులు తెచ్చేవారు. కానీ ఈసారి కొవిడ్‌ భయంతో పందాలు ఉండవనే అనుమానంతో దూరంగా ఉన్నారు. విక్రయదారులు ఫోన్లు చేస్తున్నా కొనుగోలు చేయడానికి ముందుకు రావడం లేదు. ఒకవేళ లక్షలు వెచ్చించి కొని తెచ్చినా తీరా బరులకు పందెంరాయుళ్లు వస్తారనే నమ్మకం లేకపోవడంతో సాహసం చేయడం లేదు. వాస్తవానికి కొవిడ్‌ ముప్పు ఇతర జిల్లాలతో పోల్చితే తూర్పులో అధికంగా ఉంది. లక్షకుపైగా కేసులు ఇక్కడే నమోదయ్యాయి. దీంతో ఇప్పటికీ అనేకమంది ఇళ్ల నుంచి అత్యవసరమైతేనే బయటకు వస్తున్నారు. అటు కొవిడ్‌ రెండో దశ ముప్ప ఉందనే హెచ్చరికలు బలంగా వినిపిస్తున్నాయి. ఈనేపథ్యంలో పందేలకు ముందస్తు ఏర్పాట్లు చేయడం వృథా అనే భావన అనేకమంది నిర్వాహకులను వెన్నాడుతోంది. వాస్తవానికి కోనసీమకు చెందిన ఎందరో దేశవిదేశాల్లో వివిధ వృత్తులరీత్యా ఉండగా, కొవిడ్‌ ముప్పుతో వారంతా కొన్ని నెలలుగా స్వస్థలాలకే పరిమితం అయ్యారు. ఈనేపథ్యంలో సంక్రాంతి పందాలకు భారీగా డిమాండు ఉంటుందని నిర్వాహకులు అంచనా వేసుకున్నారు. కానీ వైరస్‌ ముప్పు నేపథ్యంలో గుమిగూడడం, పందాల నిర్వహణపై ఆంక్ష లుండడంతో ఈసారి పందాలు నిర్వహించడం కష్టమనే అంచనాతో పందెంరాయుళ్లు,నిర్వాహకులు ఉన్నారు. దీంతో ఈ ప్రభావం మునుపెన్నడూ లేనివిధంగా పందాల ముందస్తు సన్నాహాలపై పడింది. దీంతో ఎక్కడా పుంజులను తెచ్చి సిద్ధం చేస్తున్న ఆనవాళ్లు కనిపించడం లేదు. ఒకరకంగా పందాల ఊసు కూడా చాలామంది మర్చిపోయినట్టే కనిపిస్తోందని ఏటా బరులు నిర్వహించే ఓ నిర్వాహకుడు వివరించారు. అటు నిర్వాహకుల్లో ఎవరైనా ముందుకు వచ్చి ధైర్యం చేస్తే తామూ ఓ అడుగు వేద్దామనే ధోరణితో ఎవరికివారు ఆగుతున్నారు. మరోపక్క కొవిడ్‌ ఉధృతి ఎంత ఉన్నా పండగకు వారం ముందు నుంచి ఉన్నంతలో గుట్టుగా పందాలు నిర్వహించే అవకాశాలు కొంతవరకు ఉన్నాయని అంగీకరిస్తున్నారు. అయితే జాతి పుంజులు ఆ సమయానికి దొరికిన చోట నుంచి తెచ్చి బరిలో నింపవచ్చని చెబుతున్నారు. పండగనాటికి పందాల సందడి ఉంటుందా? లేదా? అనేది వచ్చే జనవరి తొలి వారంలో స్పష్టత రావచ్చు.Updated Date - 2020-12-17T07:32:54+05:30 IST