టీబీ నిర్మూలనే లక్ష్యంగా జాతీయస్థాయి కమిటీ
ABN , First Publish Date - 2020-10-04T09:34:29+05:30 IST
టీబీ నిర్మూలనే లక్ష్యంగా జాతీయస్థాయి కమిటీ
అమలాపురం టౌన్, అక్టోబరు 3: 2025 నాటికి దేశంలో టీబీ నిర్మూలనే లక్ష్యంగా ప్రధాని మోదీ ఆశయానికి అనుగుణంగా ఇండియన్ మెడికల్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఆరుగురు సభ్యులతో కమిటీని నియమించింది. కేరళకు చెందిన డాక్టర్ ఆర్‌వీ అశోక్ చైర్మన్‌గా వ్యవహరించే ఈ కమిటీలో దక్షిణ భారతదేశంనుంచి అమలాపురం పట్టణానికి చెందిన డాక్టర్ పీఎస్ శర్మకు చోటు దక్కింది. ఉత్తర భారతదేశం నుంచి నలుగురు, దక్షిణాదినుంచి ఇద్దరు ఈ కమిటీలో ప్రాతినిధ్యం వహిస్తారు. ప్రధాని మోదీ ఆశయానికి అనుగుణంగా ఈ కమిటీ పనిచేయనుంది. దేశవ్యాప్తంగా ఉన్న ఇండియన్ మెడికల్ అసోసియేషన్ శాఖల ద్వారా వైద్యులను చైతన్యపరిచి టీబీ నిర్మూలనలో వారిని భాగస్వాములను చేయడం ఈ కమిటీ ప్రధానంగా నిర్వహిస్తుంది. ఐఎంఏలో అనేక పదవుల్లో పనిచేసిన డాక్టర్ శర్మకు అరుదైన అవకాశం లభించడంపట్ల ఐఎంఏ రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ ప్రసాదరెడ్డి, మాజీ అధ్యక్షుడు డాక్టర్ గంగాధరరావు, డాక్టర్ జీఎస్.మూర్తి, డాక్టర్ రాంప్రసాద్, కిమ్స్ వైద్యకళాశాల డీన్ డాక్టర్ ఏఎస్.కామేశ్వరరావు అభినందనలు తెలిపారు.