-
-
Home » Andhra Pradesh » East Godavari » Kill the virus in the air
-
కరోనా వైరస్‌ను గాలిలోనే చంపేందుకు కాకినాడ డాక్టర్ల కొత్త ప్రయోగం..!
ABN , First Publish Date - 2020-03-25T09:53:17+05:30 IST
కరోనా వైరస్ సోకిన రోగుల విషయంలో కాకినాడ జీజీహెచ్‌లో మరిన్ని అత్యంత పక్కా జాగ్రత్తలు తీసుకునే దిశగా ఏర్పాట్లు జరుగుతున్నాయి.

కాకినాడ జీజీహెచ్‌లో కొత్తగా నెగిటివ్ ప్రెజర్ ఐసోలేషన్ గదులు
కరోనా సోకిన రోగుల కోసం అధునాతన సాంకేతిక పరిజ్ఞానంతో నిర్మాణం
ఇనుప కవచం గది తరహాలో హెపా ఫిల్టర్లను అమర్చి ఒక గది ఒక రోగికి..
రోగి వదిలిన శ్వాసలో వైరస్‌ను చంపి.. శుద్ది చేసిన గాలి బయటకు..
విదేశాల నుంచి రాష్ట్రానికి వచ్చిన వారిలో జిల్లాలోనే అధికంగా జాగ్రత్తలు
(ఆంధ్రజ్యోతి ప్రతినిధి-కాకినాడ): కరోనా వైరస్ సోకిన రోగుల విషయంలో కాకినాడ జీజీహెచ్‌లో మరిన్ని అత్యంత పక్కా జాగ్రత్తలు తీసుకునే దిశగా ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఇప్పటికే పాజిటివ్‌గా తేలిన రోగులను ప్రత్యేక ఐసొలేషషన్ వార్డుల్లో ఉంచి వైద్యులు చికిత్స అందిస్తున్నారు. అత్యంత ప్రమాదకరమైన ఈ వైరస్ మనిషి నుంచి మనిషికి సులువుగా సోకుతుండ డంతో చివరకు వైద్యులు సైతం వణికిపోతున్నారు. రెండు రోజుల కిందట జీజీహెచ్‌లో ఓ రోగికి చికిత్స అందిస్తోన్న ఓ యువ వైద్యుడికి కరోనా లక్షణాలు కనిపించడం విశేషం. ఈ నేపథ్యంలో రోగులను మరింత భద్రతా వలయంలో ఉంచి చికిత్స అందించేందుకు, ఈ రోగులు శ్వాస ద్వారా వదిలే గాలి నేరుగా బయటకు వెళ్లి వైరస్ విస్తరించకుండా ఉండేందుకు జీజీహెచ్‌లో అధునాతన వసతులతో నెగిటివ్ ప్రెజర్ ఐసొలేషన్ వార్డులు రూపుదిద్దుకుంటున్నాయి.
ప్రస్తుతమున్న ఐసొలేషన్ వార్డుతో సంబంధం లేకుండా ఎనిమిది గదులను సిద్ధం చేస్తున్నారు. మరో వారంలో ఇవి పూర్తి స్థాయిలో సేవలకు అందుబాటులోకి వస్తాయి. రూ.1.30 కోట్ల వ్యయంతో ఎనిమిది గదులు నిర్మిస్తుండగా, ఒక్కో నెగిటివ్ ప్రెజర్ ఐసొలేషన్ గదిలో కేవలం ఒక కరోనా రోగిని మాత్రమే ఉంచుతారు. చెప్పాలంటే నెగటివ్ ప్రెజర్ ఐసొలేషషన్ గదులు పూర్తిగా ఇనుప కవచంలా ఉంటుంది. ఈ గదిలో ప్రత్యేక పరిజ్ఞానంతో తయారుచేసిన హెపా ఫిల్టర్లు అమర్చుతారు. ఇవి కరోనా రోగి తన శ్వాస ద్వారా వదిలిన గాలిని అక్కడికక్కడే శుద్ధి చేస్తాయి. రోగి వదిలిన గాలిలో ఉండే వైరస్‌ను ఈ ఫిల్టర్లు పూర్తిగా నిర్మూలిస్తాయి. ఏచిన్న అవశేషం కూడా ఉండకుండా చంపేస్తాయి. ఆ తర్వాత వైరస్‌రహిత స్వచ్ఛమైన గాలిగా మార్చి ఈ పిల్టర్ల ద్వారా బయటకు వదులుతారు.
ఇప్పటివరకు కరోనా రోగులు శ్వాస ద్వారా వదిలేగాలి నేరుగా బయటకు వెళ్లిపోతోంది. దీన్ని ఎవరు పీల్చినా వైరస్ బారిన పడతారు. దీనివల్ల రోగుల సంఖ్య పెరిగే ప్రమాదం ఉంది. ఈ ప్రత్యేక గదుల్లో వైరస్ కలిసి ఉండే గాలిని పూర్తిగా శుద్ధిచేసి బయటకు వదలడం ద్వారా వైరస్ వ్యాప్తి తగ్గుతుంది. తద్వారా కొత్తవ్యక్తులకు హాని జరగదు. విదేశాల్లో ఉంటూ వైరస్ ప్రమాదం నేపథ్యంలో స్వస్థలాలకు వచ్చే వారి సంఖ్య తూర్పుగోదావరి జిల్లాలోనే అధికంగా ఉంది. అదికూడా చైనా, ఇటలీ, దుబాయ్, ఖతర్ తదితర దేశాల నుంచి వచ్చిన వారు జిల్లాలో అధిక సంఖ్యలో ఉన్నారు. ఈనేపథ్యంలో ఈ ప్రత్యేక గదులకు అనుమతులు తీసుకువచ్చామని జీజీహెచ్ సూపరిటెండెంట్ డాక్టర్ ఎం.రాఘవేంద్రరావు ‘ఆంధ్రజ్యోతి’కి వివరించారు.