ఖరీఫ్‌ మాసూళ్లే కాలేదు.. రబీ ఎలామరి?

ABN , First Publish Date - 2020-12-13T07:05:22+05:30 IST

ప్రకృతి వైపరీత్యాల కారణంగా ఖరీఫ్‌ పంటల మాసూళ్లలో జరుగుతున్న ఎనలేని జాప్యం వల్ల ‘రబీ’ సాగుకు సమాయత్తం కాలేని నిస్సహాయ పరిస్థితి ఏర్పడింది. జిల్లా అధికారులు నిర్ణ యించిన తేదీల ప్రకారమైతే ఎట్టి పరస్థితుల్లోనూ రైతులు వరి నాట్లు వేసేందుకు పరిస్థితులు ప్రతికూలంగా

ఖరీఫ్‌ మాసూళ్లే కాలేదు.. రబీ ఎలామరి?

వరుస వైపరీత్యాలతో కోతల్లో జాప్యం

ఈ నెలాఖరుకు ముగియనున్న ఖరీఫ్‌ కోతలు

ఇంకా రబీకి సంసిద్ధం కాని రైతాంగం

ఏప్రిల్‌ నెలాఖరు వరకు నీరివ్వాలంటూ డిమాండు


(అమలాపురం-ఆంధ్రజ్యోతి)

ప్రకృతి వైపరీత్యాల కారణంగా ఖరీఫ్‌ పంటల మాసూళ్లలో జరుగుతున్న ఎనలేని జాప్యం వల్ల ‘రబీ’ సాగుకు సమాయత్తం కాలేని నిస్సహాయ పరిస్థితి ఏర్పడింది. జిల్లా అధికారులు నిర్ణ యించిన తేదీల ప్రకారమైతే ఎట్టి పరస్థితుల్లోనూ రైతులు వరి నాట్లు వేసేందుకు పరిస్థితులు ప్రతికూలంగా ఉన్నాయి. ప్రస్తుతం ఖరీఫ్‌ కోతలు పూర్తవ్వాలంటే ఈ నెలాఖరు వరకు సాధ్యంకాదని, ఈ పరిస్థితుల దృష్ట్యా రబీ సాగులో జరుగుతున్న జాప్యాన్ని దృష్టిలో ఉంచుకుని అధికారులు వచ్చే ఏడాది ఏప్రిల్‌ నెలాఖరు వరకు సాగునీరు అందించేలా ప్రణాళికలు సిద్ధం చేయాల్సిందేనని రైతులు విజ్ఞప్తులు చేస్తున్నారు. ఇటీవల వరుసగా కురిసిన భారీ వర్షాలు, నివర్‌ తుఫాను ప్రభావంతో జిల్లావ్యాప్తంగా ఖరీఫ్‌ సేద్యం చేసిన రైతులకు తీవ్రనష్టం వాటిల్లింది. వర్షాల వల్ల పంట చేలన్నీ నేలనంటి నీటిలో మునిగిపోవడంతో సాధారణ పరిస్థితుల కంటే భిన్నంగా కోతల్లో 15 రోజుల నుంచి 20 రోజుల జాప్యం జరుగుతోంది. పూర్తిగా పంటచేలన్నీ కూలీలతోనే కోయించాల్సి రావడంతో రైతులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. కూలీల కొరతే ఇందుకు ప్రధానంగా కనిపిస్తోంది. ఎకరాకు రూ.10 వేల వంతున కాంట్రాక్టు ఇచ్చి నూర్పిళ్లు చేసుకున్నామని, రైతులకు కూలీలు దొరకడం కూడా కష్టంగా ఉందని వారు ఆవేదన చెందుతున్నారు.


 హార్వెస్టర్‌ విధా నానికి ప్రస్తుతం నీటిలో ఉన్న చేలు పనికిరావని, అందువల్ల ప్రతి రైతు ఈ సీజన్‌ లో కూలీలపైనే ఆధారపడాల్సి వస్తోందని, కోతల ప్రక్రియ అంతా పూర్తి కావాలంటే ఈ నెలాఖరు సమయం తప్పదని అమలాపురం పార్లమెంటరీ జిల్లా టీడీపీ రైతు సంఘ అధ్యక్షుడు మట్టా మహలక్ష్మిప్రభాకర్‌ చెప్పారు. దీనివల్ల రబీ షెడ్యూలులో మార్పులుచేసి ఏప్రిల్‌ నెలాఖరు వరకు నీటిని అందించకపోతే ప్రస్తుతం ఖరీఫ్‌ కోల్పోయిన రైతులు రబీలోనూ నష్టపోవాల్సి వస్తుందని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు.  జిల్లావ్యాప్తంగా రబీలో 4.36 లక్షల ఎకరాల్లో వరి సేద్యం జరుగుతుందని అధికారులు అంచనా వేశారు. 120 రోజుల కాలపరిమితితో స్వల్పకాలిక వరి వంగ డాలను సేద్యం చేయాలని అధికారులు సూచిస్తున్నప్పటికీ ప్రస్తుతం జిల్లాలో అందుకు భిన్నమైన పరిస్థితులే ఉన్నాయి. ఈనెల 10వ తేదీ నాటికే నారుమళ్లు సిద్ధం చేసుకోవాల్సిందిగా అధికారులు ముందస్తుగానే ఆదేశాలు ఇచ్చారు. అయితే ప్రస్తుత ఖరీఫ్‌ కోతలే ఇంకా పూర్తికాని పరిస్థితుల్లో రైతులు నారుమడులకు సిద్ధం కాలేని పరిస్థితులు ఉత్పన్నమయ్యాయి. రబీ నర్సరీలు జనవరి మొదటి వారం నుంచి ప్రారంభమై నెలాఖరు నాటికి నాట్లు వేసే పరిస్థితులు ఉంటాయన్న మెజార్టీ రైతుల అభిప్రాయాలను దృష్టిలో ఉంచుకుని రబీ సాగు విషయంలో ప్రభుత్వం స్పష్టమైన నిర్ణయాన్ని తీసుకుని రైతాంగాన్ని ఆదుకోవాలని కోరుతున్నారు. 

Updated Date - 2020-12-13T07:05:22+05:30 IST