ఎంత బిల్లు కడితే అంతే వైద్యం అందుతుందని.. చులకనగా మాట్లాడడంతో..

ABN , First Publish Date - 2020-07-19T15:53:47+05:30 IST

ఓ ప్రైవేట్‌ ఆస్పత్రి వైద్యుల నిర్వాకంతో..

ఎంత బిల్లు కడితే అంతే వైద్యం అందుతుందని.. చులకనగా మాట్లాడడంతో..

కాకినాడ(ఆంధ్రజ్యోతి): ఓ ప్రైవేట్‌ ఆస్పత్రి వైద్యుల నిర్వాకంతో ఒక వ్యక్తి ఆస్పత్రిపై నుంచి దూకి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. తాళ్లరేవుకు చెందిన మండవల్లి సత్య వెంకటకృష్ణ భాస్కర్‌కుమార్‌ (37) జ్వరంతో బాధపడుతుండడంతో ఈ నెల 17న కాకినాడ బాలాజీ చెరువు సెంటర్‌ సమీపంలో ఓ ప్రైవేట్‌ ఆస్పత్రికి తరలించారు. ఈ నేపథ్యంలో భాస్కరకుమార్‌ ఆస్పత్రి పైనుంచి దూకి చనిపోయాడు. దీనిపై అతని తండ్రి మాట్లాడుతూ గతంలో ఒకసారి ఆస్పత్రికి తీసుకొస్తే చికిత్స చేసి బిల్లు కట్టించుకున్నారని ఇంటికి తీసుకెళ్లిపోయామన్నారు.


అయితే జ్వరం తగ్గకపోవడంతో మళ్లీ ఆస్పత్రికి తీసుకువచ్చామని చెప్పారు. చికిత్స అందుతుండగా బిల్లు విషయంలో వైద్యులు, ఆస్పత్రి సిబ్బంది అవహేళన చేశారన్నారు. ఎంత బిల్లు కడితే అంతే వైద్యం అందుతుందని చులకనగా మాట్లాడారని వాపోయాడు. గుండె నొప్పి వస్తుందని తన కుమారుడు చెప్పినా పట్టించుకోలేదన్నారు. దీంతో మనస్తాపం చెందిన తన కుమారుడు బిల్డింగ్‌పై నుంచి దూకి చనిపోయాడన్నారు. అయితే ఆస్పత్రి సిబ్బంది వాదన మరోలా ఉంది. బిల్లు విషయంలో తండ్రీకొడుకుకు మధ్య వాదోపవాదనలు జరగడంతో మనస్తాపం చెంది భాస్కరకుమార్‌ మరణించాడని చెబుతున్నారు. త్రీ టౌన్‌ పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.


Updated Date - 2020-07-19T15:53:47+05:30 IST