కుమార్తె ఫీజు చెల్లించేందుకు కారులో వెళ్తుండగా.. లారీ ఢీకొట్టడంతో..

ABN , First Publish Date - 2020-10-27T17:35:29+05:30 IST

జాతీయ రహదారిపై నెల్లూరు జిల్లా కొడవలూరు మండలం టపాతోపు రైల్వేగేటు సమీపంలో ఆదివారం జరిగిన ప్రమాదంలో..

కుమార్తె ఫీజు చెల్లించేందుకు కారులో వెళ్తుండగా.. లారీ ఢీకొట్టడంతో..

లారీని ఢీకొన్న కారు దంపతుల దుర్మరణం

కుమార్తె కాలేజీ ఫీజు చెల్లించేందుకు రాజమహేంద్రవరం నుంచి పయనం

నెల్లూరు జిల్లా టపాతోపు రైల్వేగేటు సమీపంలో ప్రమాదం


కొడవలూరు: జాతీయ రహదారిపై నెల్లూరు జిల్లా కొడవలూరు మండలం టపాతోపు రైల్వేగేటు సమీపంలో ఆదివారం జరిగిన  ప్రమాదంలో భార్యాభర్తలు మృతి చెందారు. తమిళనాడులో ఎంబీబీఎస్‌ కోర్సు చదువుతున్న తమ కుమార్తెకు ఫీజు చెల్లించేందుకు రాజమహేంద్రవరానికి చెందిన భార్యాభర్తలు త్సల్లాప్రగడ జానకిరామయ్య (55), భార్య పద్మావతి (50) ఆదివారం ఉదయం కారులో బయలుదేరారు. కారు టపాతోపు సమీపంలోకి వచ్చేసరికి అకస్మాత్తుగా లారీ అడ్డు వచ్చింది. దీంతో కారు లారీని ఢీకొంది. ప్రమాదంలో కారు నడుపుతున్న జానకిరామయ్య అక్కడికక్కడే మృతి చెందారు. పక్క సీటులో కూర్చున్న ఆయన భార్య పద్మావతికి తీవ్రగాయాలు కాగా 108 వాహనంలో నెల్లూరులోని ప్రభుత్వ వైద్యశాలకు తరలిస్తుండగా మార్గమధ్యంలో మృతి చెందారు. ఘటన స్థలాన్ని ఎస్‌ఐ ఆలీ పరిశీలించారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం నెల్లూరు ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. కుమార్తె ఫీజు చెల్లించేందుకు తీసుకువెళ్తున్న రూ.40 లక్షలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.


జేఎన్‌ రోడ్డులో విషాదఛాయలు

రాజమహేంద్రవరం: రాజమహేంద్రవరం జేఎన్‌రోడ్డులోని జానకిరామయ్య ఇంటి వద్ద విషాదచాయలు అలుముకున్నాయి. చుట్టుపక్కల వారు శోక సంద్రంలో మునిగిపోయారు. గతంలో జానకిరామయ్య కిరోసిన్‌ బంక్‌ వ్యాపారం చేసేవారని స్థానికులు చెప్పారు. వారికి ఇద్దరు కుమార్తెలు. పెద్ద కుమార్తె చెన్నైలో మెడిసిన్‌ చదువుతోంది. ఆమె చదువు నిమిత్తం ఫీజు కట్టేందుకే వారు కారులో చెన్నై బయలుదేరారు. ప్రస్తుతం జానకిరామయ్య వ్యాపార కార్యకలాపాలు నిర్వహిస్తుండగా, పద్మావతి ప్రైవేట్‌ స్కూల్‌లో టీచర్‌గా పనిచేస్తున్నారు. బంధువులు నెల్లూరు బయలుదేరి వెళ్లారు.

Updated Date - 2020-10-27T17:35:29+05:30 IST