పెరిగిన శాంపిళ్లు

ABN , First Publish Date - 2020-04-18T09:46:02+05:30 IST

కరోనా నిర్ధారిత పరీక్షలు తక్కువగా చేయడం వల్ల పాజిటివ్‌ కేసులు పూర్తిగా వెలుగులోకి రావడం లేదనే విమర్శల నేపథ్యంలో శుక్రవారం

పెరిగిన శాంపిళ్లు

ఆర్‌టీపీసీఆర్‌ యంత్రాలతో జిల్లాలో కరోనా నిర్ధారిత పరీక్షలు మొదలు

అయిదు కేంద్రాల్లో మొత్తం 25 అమర్చి రోజుకు వెయ్యి శాంపిళ్ల సేకరణ 

తొలి రోజు శుక్రవారం 470 శాంపిళ్లు సేకరించిన వైద్యులు

ఒక యంత్రం నుంచి ఒకేసారి ఇద్దరికి పరీక్షలు.. గంటన్నరలో ఫలితాలు 

20 తర్వాత లాక్‌డౌన్‌ మినహాయింపులో కొబ్బరి, గిరిజన ఉత్పత్తుల రవాణా

కోనసీమ కొబ్బరి రవాణాకు తీరనున్న బెంగ.. ఏజెన్సీలో చింత, పనసకు ఓకే

లాక్‌డౌన్‌ మళ్లీ పొడిగింపుతో చిన్న మధ్య తరహా పరిశ్రమల్లో సంక్షోభ నీరసం


(ఆంధ్రజ్యోతి ప్రతినిధి- కాకినాడ)

కరోనా నిర్ధారిత పరీక్షలు తక్కువగా చేయడం వల్ల పాజిటివ్‌ కేసులు పూర్తిగా వెలుగులోకి రావడం లేదనే విమర్శల నేపథ్యంలో శుక్రవారం నుంచి జిల్లాలో పరీక్షల సంఖ్యను అధికారులు భారీగా పెంచారు. మొత్తం అయిదు ఆసుపత్రి కేంద్రాల్లో 25 రివర్స్‌ ట్రాన్స్‌క్రిప్షన్‌ పాలిమర్‌ చైన్‌ రియాక్షన్‌ (ఆర్‌టీపీసీఆర్‌) యంత్రాలతో శాంపిళ్లు సేకరించారు. వీటి ద్వారా ట్రూనాట్‌ బే టా సీవోవీ పరీక్ష చేస్తే కొవిడ్‌ వైరస్‌ను గుర్తించవచ్చు. తొలి రోజు మొత్తం 470 శాంపిళ్లు తీసుకుని ఫలితాలు వెల్లడించారు. టీబీ నిర్ధారిత పరీక్షల కోసం వినియోగించే ఈ పరికరాన్ని ఆర్‌టీపీసీఆర్‌ యంత్రంగా పిలుస్తారు. ఇవి టీబీ నిర్ధారణ పరీక్షలకే పనికి వస్తాయి. కానీ కరోనా కేసులు పెరుగుతుండడం, అటు పరీక్షించే యంత్రాలు తక్కువగా ఉండడంతో వీటిలో సాంకేతిక పరిజ్ఞానాన్ని మార్చి కొత్త చిప్‌లు అమర్చారు. వీటి ద్వారా కరోనా నిర్ధారణ పరీక్షలు శుక్రవారం నుంచి మొదలుపెట్టారు. 25 యంత్రాలు జిల్లాలో ఉండగా, కాకినాడ జీజీహెచ్‌, రాజమహేంద్రవరం జిల్లా ఆసుపత్రి, రంపచోడవరం, జీఎస్‌ఎల్‌, కిమ్స్‌ ఆసుపత్రుల్లో వీటిని ఏర్పాటుచేసి పరీక్షలు మొదలుపెట్టారు. రోజుకు వెయ్యి శాంపిళ్లు పరీక్షించాలనే లక్ష్యంలో భాగంగా వైద్య సిబ్బందిని మోహరించినట్టు కలెక్టర్‌ మురళీధర్‌రెడ్డి వివరించారు. ఒక్కో యంత్రం ద్వారా ఒకేసారి ఇద్దరి నుంచి శాంపిళ్లు సేక రించవచ్చు. ఇలా సేకరించిన శాంపిళ్ల ఫలితాలను గంటన్నర వ్యవధిలో వెల్లడించనున్నారు. 


కోనసీమ కొబ్బరికి కష్టాలు తప్పేనా..

లాక్‌డౌన్‌తో జిల్లాలో కోనసీమలో లక్షలాది ఎకరాల్లోని కొబ్బరి తోటల్లో కాయల రవాణా నిలిచిపోయింది. 60వేల మందికిపైగా కార్మికులకు ఉపాధి పోయింది. ఈనెల 20 తర్వాత అమలులోకి వచ్చేవిధంగా కేంద్రం కొన్ని రంగాలకు సడలింపులు శుక్రవారం ప్రకటించింది. అందులో కొబ్బరి రవాణాపై నిషేధం తొలగించింది. వీటి రవాణాకు నిషేధం నుంచి మినహాయింపు ఇచ్చింది. దీంతో కోనసీమ కొబ్బరికి  కొంతవరకు కష్టాలు తీరే అవకాశం ఉంది. అయితే జిల్లాను కేంద్రం హాట్‌ స్పాట్‌గా ప్రకటించడంతో జిల్లాలో ఈనెల 20 తర్వాత కేంద్రం ప్రకటించిన మినహాయింపుల అమలు కొంతవరకు సందిగ్దంలో పడింది. అయితే రెడ్‌ జోన్‌లు మినహా మిగిలిన జిల్లా అంతటా కేంద్రం సడలింపులు అమలు చేసేలా రాష్ట్రం 19 లేదా 20న నిర్ణయం తీసుకునే అవకాశం ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు. తద్వారా అప్పటివరకు కొంతవరకు స్పష్టత లోపించే అవకాశం ఉంది. మరోపక్క గిరిజన ఉత్పత్తులకు కూడా కేంద్రం మినహాయింపులు ఇచ్చింది. దీంతో చింతపండు, పనస, పైనాపిల్‌ తదితర ఉత్పత్తుల మార్కెటింగ్‌కు కొంతవరకు ఇక్కట్లు తొలగే అవకాశం ఉంది. 


ఉండలేం... ఉత్పత్తి చేస్తాం..

కేంద్రం మళ్లీ రెండోసారి లాక్‌డౌన్‌ ప్రకటించిన నేపథ్యంలో జిల్లాలో మూతపడ్డ చిన్నమధ్య తరహా పరిశ్రమలు ఇక ఓపిక పట్టలేని పరిస్థితి ఏర్పడింది. మూత కొనసాగితే ఆర్థికంగా మరింత సంక్షోభంలోకి కూరుకు పోతామనే ఆందోళనతో ఎలాగైనా వాటిని తిరిగి తెరవడానికి పలు యాజమా న్యాలు ప్రయత్నిస్తున్నాయి. కొంతమంది కార్మికులతో అయినా ఉత్పత్తులు తేవడానికి ముందుకు వస్తున్నాయి. ఇందుకు అనుమతి ఇవ్వాలంటూ జిల్లా కలెక్టరేట్‌కు దరఖాస్తులు భారీగా వస్తున్నాయి. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రకటించిన 25 అత్యవసర మినహాయింపు విభాగాల్లో తమ ప్లాంట్‌ లేదా పరిశ్రమ ఉందని, తక్కువ మంది కార్మికులతో వాటిని తిరిగి తెరుస్తామంటూ కంట్రోల్‌ రూంను పలువురు యజమానులు ఆశ్రయిస్తున్నారు. వీటిని జిల్లా పరిశ్రమలశాఖ పరిశీలించి కలెక్టర్‌ ఆదేశాలతో అనుమతులు ఇస్తుంది. అయిదు రోజుల వరకు 74 వరకు పరిశ్రమలకు లాక్‌డౌన్‌ నుంచి మినహాయింపులు ఇవ్వగా ఇప్పుడు వీటి సంఖ్య 108కి చేరింది. ఇంకా 40 వరకు దరఖాస్తులు అనుమతుల కోసం ఎదురు చూస్తున్నాయి. ఏప్రిల్‌ 14 తర్వాత నుంచి రోజుకు 30 వరకు దరఖాస్తులు పలు కంపెనీల నుంచి నిర్వహణ అనుమతుల కోసం వెల్లువెత్తుతున్నాయి.


జిల్లాలోకి వలస కూలీలు దండు

ఇతర రాష్ట్రాల్లో పనిచేస్తూ లాక్‌డౌన్‌లో చిక్కుకున్న వలస కూలీలు ఇంటి దారి పట్టారు. జాతీయ రహదారితోపాటు ఇతర మార్గాల ద్వారా తమ గమ్యస్థానాలకు వెళుతూ జిల్లాలో పోలీసులకు పట్టుబడ్డారు. వీరంతా శ్రీకాకుళం, విజయనగరం, విశాఖ, ఒడిశా ప్రాంతాలకు చెందినవారు. కొందరు నడిచి వెళుతుండగా, మరికొందరు వాహనాల్లో వెళుతూ దొరికిపోయారు. వీరందరినీ క్వారంటైన్‌ సెంటర్లకు తరలించారు. అన్నవరంలో సుమారు 250 మందిని తరలించగా, రాజమహేంద్రవరం పరిధిలో 68 మందిని బొమ్మూరు క్వారంటైన్‌కు తరలించారు. అన్నవరం కొండపై ఉన్న క్వారంటైన్‌ సెంటర్‌కు వలస కూలీలను తరలించిన నేపథ్యంలో అక్కడి పరిస్థితులను కలెక్టర్‌ మురళీధర్‌రెడ్డి శుక్రవారం పర్యవేక్షించారు.

Updated Date - 2020-04-18T09:46:02+05:30 IST