-
-
Home » Andhra Pradesh » East Godavari » iab meeting in rajamahendravarm
-
రబీ 120 రోజుల పంటే!
ABN , First Publish Date - 2020-11-25T06:43:29+05:30 IST
రాజమహేంద్రవరం, నవంబరు 24 (ఆంధ్రజ్యోతి): గోదావరి డెల్టా కాలువలను మార్చి 31న మూసివేస్తాం. అందువల్ల రబీ సాగు ముందుగానే మొదలెట్టాలి. 120 రోజుల్లో పంటకొచ్చే వరి విత్తనాలు వాడుకోవాలి. ఆకుమడులు వేసి, నాట్లు వేస్తే ఈ సీజన్‌లో సమయం సరిపోదు. అందువల్ల

విత్తనాలు వెదజల్లితేనే మేలు 8 మార్చి 31నే కాలువలు మూత
పూర్తి ఆయకట్టుకు నీరు 8 31 నుంచి ఎగువ కాఫర్‌డ్యామ్ పనులు
జూన్ 10న కాలువలకు నీరు విడుదల 8 పశ్చిమ డెల్టాకు జూన్ 5న
పుష్కర, చాగల్నాడు కాలువ కింద సాగు నిల్
ఏపీఎస్‌ఐడిసీ తుని సర్కిల్ పరిధిలో ఎత్తిపోతల పథకాలన్నింటికి
నీరు నిలుపుదల.. ముసురుమిల్లి ఆయకట్టుకూ రబీ లేదు
పంపా, తొర్రిగడ్డ, మద్దిగడ్డ, సుబ్బారెడ్డిసాగర్ ప్రాజెక్టుల పరిధిలో ఆరుతడి పంటలే
ఉభయగోదావరి జిల్లాల ఐఏబీ సమావేశంలో నిర్ణయం
రాజమహేంద్రవరం, నవంబరు 24 (ఆంధ్రజ్యోతి): గోదావరి డెల్టా కాలువలను మార్చి 31న మూసివేస్తాం. అందువల్ల రబీ సాగు ముందుగానే మొదలెట్టాలి. 120 రోజుల్లో పంటకొచ్చే వరి విత్తనాలు వాడుకోవాలి. ఆకుమడులు వేసి, నాట్లు వేస్తే ఈ సీజన్‌లో సమయం సరిపోదు. అందువల్ల విత్తనాలు వెదజల్లే పద్ధతిలోనే రబీ సాగుకు రైతులు సిద్ధం కావడం మంచిది. పోలవరం ప్రాజెక్టుకు సంబంధించిన ఎగువ కాఫర్‌డ్యామ్ పనులు పూర్తి చేయడం కోసం మార్చి 31 నుంచి పోలవరం దిగువకు నీరు నిలుపుదల చేస్తారు. అందువల్ల తర్వాత గోదావరికి నీరు రాదు. ఈనేపథ్యంలో ఇరిగేషన్, రెవెన్యూ, ఆర్‌డబ్య్లుఎస్, వ్యవసాయశాఖ అధికారులు సమన్వయ పరచుకుని యాక్షన్ ప్లాన్ సిద్ధం చేయాలని ఉభ యగోదావరి జిల్లాల నీటిపారుల సలహా మండలి (ఐఏబీ) నిర్ణయించింది. రాజమహేంద్రవరం ఆనం కళాకేంద్రంలో డిప్యూటీ సీఎం, జిల్లా ఇన్‌చార్జి మంత్రి ధర్మాన కృష్ణదాసు అధ్యక్షతన జరిగిన సమావేశంలో మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేల, రైతులు తమ సూచనలు చెప్పిన తర్వాత జిల్లా కలెక్టర్ డి.మురళీధరరెడ్డి, పశ్చిమగోదావరి కలెక్టర్ ముత్యాలరాజు మార్చి 31నే కాలువలు మూసివేస్తున్నట్టు ప్రకటించారు. పశ్చిమగోదావరి జిల్లాలో ఈ నెల 26న మళ్లీ ప్రజాప్రతినిధులతో సమీక్షించి యాక్షన్ ప్లాన్ ప్రకటిస్తామని అక్కడి కలెక్టర్ ముత్యాలరాజు ప్రకటించారు. ఈ సీజన్‌లో మూడు డెల్టాల్లోనూ పూర్తి ఆయకట్టుకు నీరివ్వడానికి నిర్ణయించారు. 2020-2021 రబీ అంచనాల ప్రకారం తూర్పుగోదావరి జిల్లాలో 4,36, 533 ఎకరాలు, పశ్చిమగోదావరి జిల్లాలో 4,60,000 ఎక రాల పంటకు, మంచినీటి అవసరాలకు మొత్తం 90.22 టీఎంసీలు నీరు అవసరమని, కానీ 68.553 టీఎంసీల నీరు మాత్రమే అందుబాటులో ఉందన్నారు.
దీంతో మన జిల్లాలో 3,60,533 ఎకరాలు, పశ్చిమగోదావరి జిల్లా లో 3,79,914 ఎకరాలకు నీరు సరిపోతుందన్నారు. కానీ పూర్తి ఆయకట్టుకు నీరివ్వడం కోసం డ్రెయిన్లపై అడ్డుకట్టలు వేసి, ఇంజన్ల ద్వారా నీరు అందివ్వడానికి నిర్ణయించినట్టు అధికారులు తెలిపారు. రబీ కాలువలు డిసెంబరు 1న తెరచి మార్చి 31న మూసివేస్తామని, 2021 ఖరీఫ్‌నకు జూన్ 10వ తేదీన కాలువలకు నీరు వదులుతామని జిల్లా కలెక్టర్ ప్రకటించారు. ఏలేరు రిజర్వాయర్ పరిధిలోని 53, 017 ఎకరాల పూర్తి ఆయకట్టుకు నీరందివ్వడానికి నిర్ణయించారు. మార్చి 31 వరకూ పోలవరం కాఫర్‌డ్యామ్ నుంచి 10 వేల క్యూసెక్కుల నీరు అవసరమని అధికారులు ప్రతిపాదించగా, అక్కడి సీఈ నాగిరెడ్డి మాత్రం 9 వేల క్యూసెక్కుల నీరే ఇవ్వగలమన్నారు. పశ్చిమగోదావరికి సంబంధించిన పశ్చిమడెల్టా కాలువలను జూన్ 5న తెరుస్తారు.
అక్కడ పంట లేదు
మార్చి 31 కాఫర్‌డ్యామ్ వద్ద తూములు పూర్తిగా మూసివేసి, కాఫర్‌డ్యామ్‌లో మిగిలిన భాగాన్ని నిర్మించడానికి నిర్ణయించడం వల్ల పలు ఎత్తిపోతల పథకాలకు నీరివ్వలేమని అధికారులు ప్రకటించారు. పుష్కర, చాగల్నాడు పరిధిలోని ఆయకట్టుకు రబీ సాగు నీరు లేదు. ఏపీఎస్‌ఐడీసీ తుని సర్కిల్ పరిధిలోని అన్ని ఎత్తిపోతల పథకాలకు నీటిసరఫరా నిలిపివేస్తారు. పోలవరం ఎడమ ప్రధాన కాలువ సర్కిల్ పరిధిలోని ముసురుమిల్లి ప్రాజెక్టు పరిధిలో సీఎ డబ్ల్యుఎంలో మైనర్స్, సబ్‌మైనర్స్ లైనింగ్ పనులు, రిపేర్లు చేయడానికి నిర్ణయించడంతో ఈ సీజన్‌లో రబీ పంట ప్రతిపాదించలేదు.
మధ్యతరహా ప్రాజెక్టులైన పంపా, మద్దిగెడ్డ, సుబ్బారెడ్డిసాగర్ ప్రాజెక్టుల పరిధిలోని పంటలకు, తొర్రిగడ్డ పరిధిలోని 1650 ఎకరాలకు ఆరు తడి పంటలు అనుమతి ఇచ్చారు. ఈ సమావేశంలో మంత్రులు చెల్లుబోయిన వేణుగోపాల్, కురసాల కన్నబాబు, చెరకువాడ శ్రీరంగనాథరాజు, పినిపే విశ్వరూప్, తానేటి వనిత, రాజ్యసభ సభ్యుడు, మాజీ డిప్యూటీ సీఎం పిల్లి సుభాష్‌చంద్రబోసు, ఎంపీలు మార్గాని భరత్, వంగా గీత, ఎమ్మెల్యేలు గోరంట్ల బుచ్చయ్యచౌదరి, రామానాయుడు, జక్కంపూడి రాజా, చిర్ల జగ్గిరెడ్డి, చిట్టిబాబు, జ్యోతుల చంటిబాబు, అధికారులు పాల్గొన్నారు.