మట్టిలో మూటల వేట
ABN , First Publish Date - 2020-10-03T07:03:51+05:30 IST
పేదల ఇళ్ల స్థలాల భూములతో అధికార వైసీపీ నేతలు ఎంచక్కా వ్యాపారం చేసుకుంటున్నారు. అడ్డగోలుగా కోట్లలో సంపాదిస్తున్నారు.

కాకినాడ, ఆంధ్రజ్యోతి: పేదల ఇళ్ల స్థలాల భూములతో అధికార వైసీపీ నేతలు ఎంచక్కా వ్యాపారం చేసుకుంటున్నారు. అడ్డగోలుగా కోట్లలో సంపాదిస్తున్నారు. అడ్డొచ్చిన వారిని అంతుచూస్తామని బెదిరిస్తున్నారు. బిక్కవోలు మండలం కాపవరం భూముల్లో. ఓ ప్రైవేటు సంస్థ నుంచి 201 ఎకరాలు ఇళ్ల స్థలాలకు కొనుగోలు చేసిన అధికారులు అందులో పల్లపు ప్రాంతాన్ని మట్టితో చదును చేయడానికి గ్రావెల్ తవ్వకాలకు అనుమతిచ్చారు. తీరా ఈ అనుమతులను అడ్డంపెట్టుకుని ఏకంగా ఆ భూములను లోయలుగా మార్చేస్తున్నారు. అసలు స్థలాన్ని చదును చేయకుండా ఆ ముసుగులో కాకినాడ, యానాం, రాజమహేంద్రవరం ప్రాంతాల్లో రియల్ ఎస్టేట్ అవసరాలకు గ్రావెల్ తరలించి కోట్లు పిండేస్తున్నారు.
బిక్కవోలు మండలం పరిధిలో పేదల ఇళ్ల స్థలాలకు భూములు లేకపోవడంతో ఎన్‌ఎఫ్‌సీఎల్ అనే ప్రైవేటు సంస్థ నుంచి జిల్లా కలెక్టర్ అనుమతితో రెవెన్యూ అధికారులు కాపవరం గ్రామంలో 201 ఎకరాలు సేకరించారు. ఇందులో కొన్ని పల్లపు భూములు కాగా మరికొంత కొండప్రాంతం. ఎకరాకు ఈ సంస్థకు రూ.35 లక్షల చొప్పున ప్రభుత్వం పరిహారం చెల్లించింది. తొలివిడతగా 160 ఎకరాలు పంచడానికిగాను లేఅవుట్ అభివృద్ధి చేయడానికి అధికారులు నిర్ణయించారు. అందుకోసం ఎక్కడో దూరం నుంచి గ్రావెల్ తెచ్చి నింపే బదులు కొండప్రాంతంగా ఉన్న సర్వే నెంబర్ 34/1, 36/2, 37/1లో సుమారు పది ఎకరాల్లో గ్రావెల్ తవ్వి చదును చేయడానికి అనుమతి ఇచ్చారు. ఈ భూముల్లో మీటరు లోతులో మాత్రమే మట్టి తవ్వాలని నిబంధన విధించారు. తవ్విన గ్రావెల్‌ను ఆనుకుని ఉన్న లేఅవుట్ భూముల్లో చదును చేయడానికి వీలుగా జూన్, జూలై నెలల్లో గనులశాఖ తాత్కాలిక పర్మిట్ నెంబర్లు 1305, 2128, 2129 జారీ చేసింది.
మొత్తం మూడు ఉత్తర్వులకు కలిపి 14,975 క్యూబిక్ మీటర్ల మట్టి తవ్వడానికి మాత్రమే అనుమతి ఇచ్చింది. అయితే కోట్లలో కాసులు కురిపించే ఈ గ్రావెల్‌పై స్థానిక నియోజకవర్గ అధికార పార్టీ కీలక నేతల అనుచరులు కన్నేశారు. విలువైన గ్రావెల్‌ను బయట విక్రయించి ఎంచక్కా సొమ్ములు చేసుకోవడానికి గొప్ప పథకమే పన్నారు. అందుకోసం గనుల శాఖ ఏడీ ఉత్తర్వులను అడ్డం పెట్టుకుని లక్ష క్యూబిక్ మీటర్లకు పైగా ఈ భూముల్లో మట్టి తవ్వేశారు. అధికారుల నుంచి ఏమాత్రం పర్యవేక్షణ లేకపోవడంతో యథేచ్ఛగా చెలరేగిపోయారు. తవ్విన గ్రావెల్‌ను అనుమతించిన పక్క స్థలాల చదునుకు కాకుండా మొత్తం బయట రియల్ ఎస్టేట్ అవసరాలకు విక్రయించేస్తున్నారు. గడచిన వంద రోజులుగా ఇదే తంతు. అసలే అధికార పార్టీ నేతలు కావడంతో అధికారులు ఇటువైపు కన్నెత్తి చూడడం లేదు. దీంతో ఇప్పుడు ఇక్కడ రేయింబవళ్లు మూడు జేసీబీలు గ్రావెల్ తవ్వుతూనే ఉన్నాయి. నిత్యం 25కిపైగా లారీలు మట్టిని కాకినాడ, రాజమహేంద్రవరం, యానాం, పిఠాపురం, కాకినాడ రూరల్ తదితర ప్రాంతాల్లో ప్రైవేటు భూములకు తరలిస్తున్నారు. ఇప్పటివరకు దాదాపు రూ.8 కోట్ల వరకు మట్టి విక్రయాలు జరిపి అధికార పార్టీ నేతలు కొందరు రెండు చేతులా సంపాదించేశారు. ఇచ్చిన అనుమతులకు మించి గ్రావెల్‌ను ఊదేసినా ఇంతవరకు గనులశాఖ పట్టించుకోలేదు.
లోయలుగా మారిపోయిన స్థలాలు...
పరిహారం చెల్లించిన తర్వాత రెవెన్యూ శాఖ భూములను తన ఆధీనంలోకి తీసుకోవాలి. తవ్విన గ్రావెల్ అక్కడే చదునుకు ఉపయోగపడేలా చేయాలి. కానీ అధికార పార్టీ నేతల జోక్యంతో ఇవన్నీ గాలికి వదిలేశారు. ఇంతవరకు ఆ భూములను స్వాధీనం చేసుకోలేదు. దీంతో సదరు అక్రమార్కులు ఇక్కడ పాగా వేసేశారు. గుడారాలు ఏర్పాటు చేసుకుని మందీమార్బలంతో పహారా కాస్తున్నారు. ఎవరైనా ప్రశ్నించడానికి వెళ్తే దాడి చేయడానికి కూడా వెనుకాడడం లేదు. వాహనంతో ఎవరు ఈ భూముల వద్దకు వచ్చినా నెంబరు నమెదు చేస్తున్నారు. ఫోటోలు తీస్తున్నారు. ఒకరకంగా చిన్నపాటి సామ్రాజ్యం నడుపుతున్నారు. వంద రోజుల నుంచి నిరాటంకంగా సాగుతున్న అడ్డగోలు గ్రావెల్ మాఫియా కారణంగా ఇక్కడ భూములు లోయలను తలపిస్తున్నాయి. పది మీటర్లకు మించి మట్టి తోడేయడంతో అవన్నీ వర్షం నీటితో నిండిపోయాయి. భవిష్యత్తులో ఇక్కడ ఇళ్ల స్థలాలు కేటాయిస్తే అందులో ఉండేవారు ప్రమాదవశాత్తు ఈ భూముల్లో పడి చనిపోయే ప్రమాదం ఉన్నా ఖాతరు చేయడం లేదు. మరోపక్క గ్రావెల్ తవ్వుతున్న భూముల్లో 500 వరకు రకరకాల వృక్షాలు, భారీ చెట్లు ఉన్నాయి. అటవీశాఖ అనుమతులు లేకుండానే గ్రావెల్ కోసం వీటిని నేలకూల్చేశారు. దీనిపై స్థానికులు సమాచార హక్కు చట్టం కింద దరఖాస్తు చేస్తే చెట్ల తవ్వకానికి అనుమతులు ఇవ్వలేదని స్పష్టం చేశారు.