రిజిస్ట్రేషన్లు ఎప్పుడో..

ABN , First Publish Date - 2020-12-27T07:39:46+05:30 IST

(రాజమహేంద్రవరం-ఆంధ్రజ్యోతి) పేదలందరికీ ఇళ్ల పట్టాలు ఇస్తున్నాం. వారికి ఆ స్థలాలను రిజిస్ట్రేషన్‌ చేసి మరీ అప్పగిస్తాం.. ఇదీ ప్రభుత్వం చెప్పింది. గతంలో మాదిరి డీ పట్టాలు ఇచ్చి చేతులు దులుసుకోవడం లేదని, సర్వహక్కులూ వచ్చేలా చరిత్ర మారుస్తున్నామనీ చెప్పింది.

రిజిస్ట్రేషన్లు ఎప్పుడో..
ఇంటి స్థలంలో పట్టా పట్టుకుని కూర్చున్న లబ్ధిదారులు

   చివరకు డీ ఫారం పట్టాలే ఇచ్చారు

  లేఅవుట్లూ అంతంతమాత్రమే

  వెలుగుబందలో 8,100 మందికి పట్టాలు

  సభలో 700 మందికే పంపిణీ

  జనవరి 7తేదీ వరకూ వార్డుల్లో పంపిణీ

  టిడ్కో లబ్ధిదారులకు ఐదుగురికే ఇళ్లు


(రాజమహేంద్రవరం-ఆంధ్రజ్యోతి) పేదలందరికీ ఇళ్ల పట్టాలు ఇస్తున్నాం. వారికి ఆ స్థలాలను రిజిస్ట్రేషన్‌ చేసి మరీ అప్పగిస్తాం.. ఇదీ ప్రభుత్వం  చెప్పింది. గతంలో మాదిరి డీ పట్టాలు ఇచ్చి చేతులు దులుసుకోవడం లేదని, సర్వహక్కులూ వచ్చేలా చరిత్ర మారుస్తున్నామనీ చెప్పింది. దీంతో లబ్ధిదారులంతా ఎంతో ఆశగా ఎదురుచూశారు. రిజిస్ర్టేషన్‌ ప్రక్రియ ఎలా ఉంటుందో అన్న ఆసక్తి అందరిలోనూ ఉంది. కానీ ప్రస్తుతానికి యథావిధిగా డీ-ఫారం పట్టాలే ఇచ్చారు. తర్వాత రిజిస్ర్టేషన్‌ చేస్తామని జిల్లా కలెక్టర్‌ డి మురళీధరరెడ్డి ప్రకటించారు.  రాజమహేంద్రవరం మున్సిపల్‌ కార్పొరేషన్‌ పరిధిలోని సిటీ, రూరల్‌ నియోజకవర్గాలకు సంబంధించి 42 వేల మందికి  పట్టాలు, టిడ్కో ఇళ్లు ఇస్తామన్నారు. బూరుగుపూడి, కాపవరం ఆవ భూముల్లో పట్టాల పంపిణీ విషయం కోర్టులో ఉండడంతో కేవలం వెలుగుబందలో 8,100 మందికి మాత్రమే పట్టాలు సిద్ధం చేశారు. ఇక్కడ శనివారం డిప్యూటీ సీఎం ధర్మాన కృష్ణదాసు, ఎంపీ మాగంటి భరత్‌, సిటీ కోఆర్డినేటర్‌ శ్రీఘా కోళ్లపు శివరామసుబ్రహ్మణ్యం, రూరల్‌ కోఆర్డినేటర్‌ ఆకుల వీర్రాజు, జిల్లా కలెక్టర్‌ మురళీధరరెడ్డి, మున్సిపల్‌ కమిషనర్‌ అభిషిక్త్‌ కిశోర్‌ తదితరుల సమక్షంలో 700 మందికి పట్టాలు ఇచ్చారు. వాస్తవానికి ముందుగానే లబ్ధిదారులకు పట్టాలు ఇచ్చి లేఅవుట్‌లో వారికి కేటాయించిన స్థలంలో కూర్చోబెట్టారు. వేదిక మీద కొద్దిమందికి మాత్రమే పట్టాలు ఇచ్చారు. ఇక టిడ్కో ఇళ్ల పట్టాలు కేవలం ఐదుగురికి మాత్రమే పంపి ణీ చేశారు. మిగతావన్నీ ఇక వార్డుల్లో జనవరి 7వ తేదీలోపు పంపిణీ చేయడానికి ఏర్పాట్లు చేస్తున్నారు. బూరుగుపూడి, కాపవరం ఆవలో సుమారు 500 ఎకరాల వరకూ సేకరించిన సంగతి తెలిసిందే. అది ఆవ భూమి అన్న ఆందోళన పెద్దఎత్తున లేవడం, కొందరు కోర్టును ఆశ్రయించడంతో అక్కడ పట్టాల పంపిణీ జరగలేదు. దీనికి ప్రత్యామ్నాయ స్థల సేకరణ కూడా ఏమీ చేయలేదు. ఇక్కడ మునిగిపోయే భూములకు ఎక్కువ ధర చెల్లించి కొనుగోలు చేసిన సంగతి తెలిసిందే. రైతుల ఖాతాల్లోకి చాలా వరకూ డబ్బు కూడా జమచేశారు. ఈ నేపఽథ్యంలో అధికార యంత్రాంగం ఇక్కడే పట్టాలు ఇవ్వడానికి మంకుపట్టు పడుతోంది. కోర్టు తీర్పు కూడా తమకు అనుకూలంగా వస్తుందని ప్రభుత్వం భావిస్తున్నట్టు ఉంది. అందుకే ప్రత్యామ్నాయ ఏర్పాట్లు ఏమీ చేయలేదు. ఇక వెలుగుబందలో 32 ఎకరాల దేవస్థానం భూమికి కూడా వివాదాస్పదంగా ఉంది. దీంతో మొత్తం 42 వేల నుంచి 54 వేల మంది వరకూ లబ్ధిదార్లకు పట్టాలు ఇస్తామని చెప్పిన యంత్రాంగం ప్రస్తుతం కేవలం 8,100 పట్టాలతోనే సరిపెడుతోంది. మిగతా వారి పరిస్థితి ఏంటో అర్థంకాకవారంతా ఆందోళన చెందుతున్నారు. ఎప్పుడు కేసు పరిష్కారమవుతుందో, ఎప్పుడు పట్టాలిస్తారోనని ఎదురు చూస్తున్నారు. మరోవైపు ఇప్పుడు పంపిణీ చేసినవి కూడా డీ-ఫారం పట్టాలు కావడంతో లబ్ధిదారులు అయోమయం లో ఉన్నారు. డీ-ఫారం పట్టా అంటే కేవలం అసైన్డ్‌ పట్టా మాత్రమే. దీనిపై ప్రభుత్వానికి పూర్తి హక్కు ఉంటుంది. 30 సంవత్సరాలు దాటితేనే లబ్ధిదారుడికి సొంతం అవు తుంది. కానీ ముందుగా ప్రభుత్వం చెప్పినట్టు రిజిస్ర్టేషన్‌ చేస్తే వెంటనే లబ్ధిదారుడికి ఇప్పుడే సొంతం అవుతుంది. 


ఏడాదిన్నరలో గృహ ప్రవేశాలు సాధ్యమేనా?


 ప్రస్తుతం పట్టాలు పంపిణీ చేసిన వాటిలో ఏడాదిన్నర లో గృహ ప్రవేశాలు చేస్తామని అధికారులు చెబుతున్నారు. కానీ లేఅవుట్లే సరిగ్గాలేవు. వెలుగుబందలో 210 ఎకరాల్లో 8,100 మందికి పట్టాలు సిద్ధం చేశారు. కొంతమందికి శనివారం పంపిణీ చేశారు. ఇక్కడ లేఅవుట్‌ సక్రమం గా లేదు. కొంత మెరక, మిగతాది అంతా బాగా పల్లపు ప్రాంతం. మెరక నుంచి వాలుగా ఉంటుంది. అక్కడ  ఏ మాత్రం మెరక చేయకుండానే లేఅవుట్‌ వేశారు. పైగా రోడ్లు కూడా నామమాత్రంగా గ్రావెల్‌తో వేశారు. రాజమహేంద్రవరానికి సుమారు 15 కిలోమీటర్ల దూరంలో ఈ లేఅవుట్‌ ఉంది. సిటీకి వచ్చి అక్కడకు వెళ్లాలంటే వ్యయ ప్రయాసలు తప్పవు. ప్రస్తుతం గ్రావెల్‌ రోడ్లు వేసి ప్లాట్లు విభజించారు. ఇక అక్కడ ఏవిధమైన సౌకర్యాలు లేవు. ఇంకా రోడ్లు పటిష్టంగా వేయాలి. డ్రైనేజీలు నిర్మించాలి.  మంచినీటి, విద్యుత్‌ సౌకర్యం ఉంటేనే అక్కడ ఎవరైనా ఇల్లు కట్టుకునే ప్రయత్నం చేస్తారు. పైగా జిల్లాలో 3,84, 218 ఇళ్ల పట్టాలు మంజూరయ్యాయి. కానీ గృహాలు 1.54 లక్షలు మాత్రమే మంజూరయ్యాయి. దీనితో అధికారులు మూడు ఆప్షన్లు పెట్టారు. ఎవరైనా సొంతంగా ఇల్లు కట్టుకోవచ్చు. వారికి రూ.లక్ష 80 వేలు దఫదఫాలుగా అందిస్తారు. లేకపోతే మెటీరియల్‌ కావాలన్నా ఉచితంగా ఇస్తారు.  లేదంటే తమకు ప్రభుత్వమే కట్టి ఇవ్వాలన్నా ఉచితంగా కట్టి ఇస్తారు. ఎక్కువమంది లబ్ధిదారులు కట్టి ఇవ్వమని కోరుతున్నారు. ఈ స్థలాల్లో కట్టుకోవాలంటే ముందు మౌలిక సౌకర్యాలు కల్పించడం తప్పనిసరి. 


టిడ్కో లబ్ధిదార్లకూ కేటాయింపులు


వెలుగుబంద సభలో టిడ్కో ఇళ్లకు సంబంధించి ఐదుగురికి పట్టాలు పంపిణీ చేశారు. మిగతావారికి వార్డులవారీ ఇస్తామని చెప్పారు. ఇక్కడ కూడా మౌలిక సదుపాయలు ఏర్పాటైన తర్వాతే గృహ ప్రవేశాలుంటాయి. 300 ఎస్‌ఎఫ్‌టీ ఇళ్లను ఉచితంగా ఇస్తారు. మిగిలినవి రుణంతో ఇస్తారు.

Updated Date - 2020-12-27T07:39:46+05:30 IST