-
-
Home » Andhra Pradesh » East Godavari » house sites mp harsha kumar
-
మురికివాడలను నిర్మిస్తారా?
ABN , First Publish Date - 2020-12-27T07:17:51+05:30 IST
ఇళ్ళ స్థలాల పంపిణీలో పేద వర్గాలకు తీరని అన్యాయం జరుగుతోందని అమలాపురం మాజీ ఎంపీ జీవీ హర్షకుమార్ ఆవేదన వ్యక్తం చేశారు.

మాజీ ఎంపీ హర్షకుమార్ ధ్వజం
రాజమహేంద్రవరం సిటీ, డిసెంబరు26: ఇళ్ళ స్థలాల పంపిణీలో పేద వర్గాలకు తీరని అన్యాయం జరుగుతోందని అమలాపురం మాజీ ఎంపీ జీవీ హర్షకుమార్ ఆవేదన వ్యక్తం చేశారు. ఇళ్ల పేరుతో మురికివాడలను నిర్మిస్తున్నారా అని ప్రశ్నించారు. రాజమహేంద్రవరంలోని తన నివాసంలో శనివారం ఆయన విలేకర్లతో మాట్లాడారు. గతంలో ఇందిరమ్మ ఇళ్ళలో తండ్రి వైఎస్‌ఆర్ దళితులకు, వెనుకబడిన వర్గాలకు చెందాల్సి వాటిని చెందకుండా గండికొట్టారని, ఇప్పుడు కొడుకు జగన్ దారుణంగా నివాసయోగ్యం కాని ప్రాంతాల్లో పేదలకు ఇళ్ల స్థలాల కేటాయింపులు చేసి మురికివాడలు ఏర్పాటు చేస్తున్నారన్నారు. కొమరగిరిలో సీఎం జగన్ మాట్లాడిన తీరు చూస్తే నవ్వు వచ్చిందన్నారు. సమసమాజ స్థాపన అంటూ సెంటు భూమి పేదలకివ్వడం ఎంత దారుణమని విమర్శించారు. ప్రభుత్వాలు ఏ సంక్షేమ కార్యక్రమాలు చేపట్టినా అందులో ఎస్సీ, ఎస్టీ బీసీల వాటా కచ్చితంగా ఇచ్చి తీరాలని అది భారత రాజ్యాంగంలో డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కల్పించిన హక్కు అని అన్నారు. పేదలకు ఇచ్చే భూమి కనీసం రెండు నుంచి మూడు సెంట్లు ఉండాలని అన్నారు. 35 లక్షల 75 వేల ఇళ్ళ పట్టాలు అవసరం లేదని 3 సెంట్ల చొప్పున పది లక్షల మందికి ఇచ్చినా పేదలు ఆనందపడేవారని వారికి ఉపయోగకరంగా ఉండేవన్నారు. వెనుకబడిన వర్గాలను నియంత్రించుకుంటూ వస్తున్న జగన్ భవిష్యత్తులో రిజర్వేషన్లు రద్దు చేసే కుట్ర చేస్తున్నారేమోనని ఽసందేహం వ్యక్తం చేశారు. వైసీపీలోని దళిత, వెనుకబడిన వర్గాల ప్రజాప్రతినిధులకు సిగ్గుంటే వెంటనే ప్రభుత్వం నుంచి బయటకు రావాలని డిమాండ్ చేశారు. పేద విద్యార్థులకు అన్యాయం చేస్తూ జారీ చేసిన ఫీజు రీయింబర్స్‌మెంట్ రద్దు జీవోను వెంటనే ఉపసంహరించుకోవాలని లేకుంటా రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమిస్తామని హెచ్చరించారు.