సముద్రంలో ఇదేం వింతో!

ABN , First Publish Date - 2020-10-08T00:26:53+05:30 IST

తూర్పుగోదావరి జిల్లా కాకినాడకు సమీపంలో ఉప్పాడ వద్ద సముద్రతీరం పర్యాటకులను అలరిస్తోంది. సముద్రం రెండు రంగులుగా దర్శనమిస్తూండటంతో

సముద్రంలో ఇదేం వింతో!

కాకినాడ,ఆంధ్రజ్యోతి: తూర్పుగోదావరి జిల్లా కాకినాడకు సమీపంలో ఉప్పాడ వద్ద సముద్రతీరం పర్యాటకులను అలరిస్తోంది. సముద్రం రెండు రంగులుగా దర్శనమిస్తూ.. పర్యాటకులను ఆకట్టుకుంది. ఒకవైపు నీలం రంగు, మరోవైపు ఎరుపు రంగులతో బీచ్ ఎన్నడు లేని విధంగా పర్యాటకులను కనువిందు చేస్తోంది. ఉప్పాడ, కాకినాడ మధ్యలో ఈ వింత చోటుచేసుకుంటుంది. నేమాం ఊరు వరకు మాములుగా నీలంరంగులో ఉన్న సముద్రం.. ఉప్పాడ ఎస్పీజీఎల్ సమీపానికి వచ్చేసరికి ఎరుపు, నీలం రంగులో కనిపిస్తోంది.


దీంతో ఉప్పాడ- కాకినాడ బీచ్ రోడ్డులో వెళ్ళే ప్రయాణీకులు వంతెన వద్ద ఆగి, సముద్రంలోని మార్పును చూసి ఆనందం వ్యక్తం చేస్తున్నారు. మరికొందరు తమ సెల్‌ఫోన్‌లో ఈ దృశ్యాన్ని బంధింస్తున్నారు. అయితే ఎగువ ప్రాంతంలో కురిసిన వర్షపు నీరు.. సముద్రంలో కలవడంతో సముద్రం రంగు మారిందని పలువురు అభిప్రాయపడుతున్నారు. మరికొందరు మాత్రం సముద్రం ఈ విధంగా మారితే తుఫాను వచ్చే అవకాశం ఉందని చెబుతున్నారు. తుపాన్లు వచ్చే సమయంలో సముద్రం రంగు మారడం.. సముద్రంపై తూనీగలు తిరగడం వంటి పరిణామాలు జరిగితే అక్టోబర్ నెలలో తుఫాను హెచ్చరికలకు ముందస్తు సూచనలని మత్స్యకారులు చెబుతున్నారు.

Read more