ప్రైవేటు తంత్రం

ABN , First Publish Date - 2020-06-04T10:55:08+05:30 IST

కరోనా వల్ల నష్టపోయిన కొన్ని ప్రైవేట్‌ ఆస్పత్రులు కాస్త ముందడుగు వేసి అక్కడక్కడా పీఆర్‌వోల ముసుగులో ఏజెంట్లను రంగంలోకి దించారు.

ప్రైవేటు తంత్రం

 జీజీహెచ్‌కు వెళ్లే రోగులకు ఆరోగ్యశ్రీ ఎర 

  సదుపాయాల ఆశ చూపి గుట్టుగా తమ ఆస్పత్రులకు తరలింపు  

 ఏజెంట్లకు సహకరిస్తున్న కొందరు పెద్దాసుపత్రుల సిబ్బంది 


కరోనా వల్ల నష్టపోయిన కొన్ని ప్రైవేట్‌ ఆస్పత్రులు కాస్త ముందడుగు వేసి అక్కడక్కడా పీఆర్‌వోల ముసుగులో ఏజెంట్లను రంగంలోకి దించారు. దీంతో ఈ రెండున్నర నెలల కాలంలో ప్రభుత్వ ఆస్పత్రులకు వివిధ రుగ్మతలతో వచ్చే రోగులను ప్రభుత్వ ఆస్పత్రుల్లో పనిచేస్తున్న తాత్కాలిక సిబ్బంది సహాయంతో వీరి ఆస్పత్రులకు రప్పించుకుంటు న్నారు. సదుపాయాల దృష్ట్యా మంచి వసతులు ఉంటాయని, తమ ఆసుపత్రిలో తొలుత సేవలన్నీ ఉచితమని నమ్మబలుకు తున్నారు. వార్డులో ఇన్‌పేషెంట్‌గా చేరాక, కొన్ని పరీక్షలు చేస్తు న్నారు. తర్వాత సదరు వ్యాధికి సంబంధించిన కోడ్‌ ఆరోగ్యశ్రీ పథకంలో వర్తించడం లేదని, దీన్ని ఆన్‌లైన్‌లో ట్రస్ట్‌కు పంపుతామని, ఈలోగా కొంత నగదు చెల్లించాలని చావు కబురు చల్లగా చెబుతున్నారు. ట్రస్ట్‌ నుంచి అనుమతి లభిస్తే చెల్లించిన మొత్తాన్ని తిరిగి ఇస్తామని నమ్మబలుకుతున్నారు. దీంతో అవాక్కవుతోన్న రోగులు, వారి బంధువులు విషయాన్ని ఎవరితో చెప్పుకోవాలో తెలీక అడిగిన మొత్తంలో విడతల వారీ చెల్లిస్తున్నారు.


ఉచితంగా వైద్య,ఆరోగ్య సేవలు పొందుదామని ప్రభుత్వఆస్పత్రులకు వెళ్లి, అక్కడ కాలయాపన జరుగుతోందని భావించడం, అక్కడ సిబ్బంది చెప్పారని యు టర్న్‌ తీసుకున్నందుకు తగిన మూల్యం చెల్లించుకునే పరిస్థితి ఏర్పడుతోంది. దీంతో అడకత్తెరలో పోక చెక్కలా అక్కడ నుంచి అవుట్‌ పేషెంట్‌గా బయట కు రాలేక, ఇన్‌ పేషెంట్‌గా ఉండలేక సతమతం అవుతున్నారని తెలుస్తోంది. అయితే ఏ పేషెంట్‌, వారి బంధువులు ఈ విషయాన్ని బయటకు చెప్పడం లేదు. చెప్పనీయకుండా సదరు పీఆర్వోలు రోగులను, వారి బంధువులను పలు రూపాల్లో మభ్యపెడుతున్నారని సమాచారం. కోనసీమ నుంచి ఆర్ధోసంబంధిత రుగ్మతతో ఓ వ్యక్తిని ఈనెల 1న అతని బంధువులు కాకినాడ జీజీహెచ్‌కు తీసుకు వచ్చారు.  అప్పటికే అక్కడ కాపుకాసిన ఓ ప్రైవేట్‌ ఆస్పత్రి పీఆర్‌వో రోగి బందువుల నుంచి వివరాలు సేకరిస్తున్నారు. రోగి బందువులకు, పీఆర్వోకు జరుగుతున్న సంభాషణను ఆస్పత్రి సెక్యూరిటీ సిబ్బంది గమనిస్తున్నారు. సెక్యూరిటీ కళ్లు తనపై ఉన్నాయని గమనించని పీఆర్వో రోగిని, వారి బందువులను క్యాజువాల్టీ పక్కన ఓ మూలన ఉండ మని చెప్పి ఆస్పత్రిలో ఓ విభాగానికి వెళ్లాడు. దీంతో అప్పటివరకు అతని కదలికలను గమనిస్తున్న సెక్యురిటీ సిబ్బందిలో ఒకరు అక్కడే ఉండి, మరొకరు పీఆర్వోను వెంబడించారు.


లోపల ఓ టెక్నీషియన్‌ రూంలోకి పీఆర్వో వెళ్లి 15 నిమి షాల తర్వాత బయటకు వచ్చి రోగి, వారి బంధువు లున్న చోటకు వెళ్లాడు. అనంతరం వీరిరువురికి మధ్య మాటలు నడిచాయి. అనంతరం అక్కడ నుంచి వారంతా ఆసుపత్రి బయటకు రావడాన్ని ప్రధాన గేటు వద్ద దుస్తుల్లో ఉన్న సెక్యూరిటీ గార్డు ఎలర్ట్‌ అయ్యాడు. వెంటనే ఈ గార్డు పీఆర్వోను పట్టుకున్నాడు. విషయం సీరియస్‌ అయ్యిందని గమనించిన పీఆర్వో పలాయనం చిత్తగించాడు. అయితే రోగి బంధువులతో ఆ పీఆర్వో ఏం మాట్లా డారనే వివరాలు సూపరింటెండెంట్‌ రాఘవేంద్ర రావు రాబట్టారు. జీజీహెచ్‌కు వస్తున్న ఆరోగ్యశ్రీ సంబంధిత కేసులను బయట ఆస్పత్రులకు పంపు తున్న సదరు ఆస్పత్రిలో పనిచేస్తున్న తాత్కాలిక సిబ్బంది వివరాలను సేకరించారు. తిన్న ఇంటి వాసాలు లెక్కపెడుతోన్న వారిపై మంగళవారం ఆయన వేటు వేశారని తెలిసింది. 


 కాకినాడ జీజీహెచ్‌లోనే కాదు..

రాజమహేంద్రవరం, కాకినాడ, తుని, అమలా పురం, పిఠాపురం, పెద్దాపురం, రామచంద్రాపురం ప్రభుత్వ ఆస్పత్రుల్లో ఉన్న వివిధ విభాగాలకు చెందిన సర్జరీ, మెడికల్‌, వివిధ విభాగాల నిపుణు లు జిల్లాలో ఏ ప్రైవేట్‌ ఆస్పత్రుల్లో లేరనేది కొంద రికి మాత్రమే తెలుసు. అయితే వీరిలో చాలామంది వివిధ వైద్యుల పేరుతో జిల్లాలో ప్రైవేట్‌ ఆస్పత్రులు ఏర్పాటు చేశారు. ఇంకొందరు భాగస్వాములుగా ఉన్నారు. మరికొందరు పార్ట్‌టెం వైద్యులుగా పని చేస్తున్నారు. దాంతో ప్రభుత్వాస్పత్రుల్లో పనిచేస్తున్న నిపుణులైన వైద్యులు కొందరు ప్రైవేట్‌ ఆస్పత్రుల యాజమాన్యాలతో మిలాఖత్‌ అయ్యి అదనపు ఆదా యానికి అర్రులు చాస్తున్నారు. తదనుగుణంగా పీఆర్వో, ఏజెంట్లు, బ్రోకర్లు పుట్టుకొచ్చారు. దీన్ని సమూలంగా నిర్వీర్యం చేయకపోతే పేదల బతుకులతో ఆటలాడే పరిస్థితి కొనసాగుతుంది.

Updated Date - 2020-06-04T10:55:08+05:30 IST