సర్కారు సింగారం

ABN , First Publish Date - 2020-12-06T07:04:37+05:30 IST

ఈ ఇళ్లు కట్టింది గత టీడీపీ ప్రభుత్వ హయాంలో. గృహప్రవేశాలు చేసుకునే తరుణంలో లబ్ధిదారులకు ఎన్నికల కోడ్‌ అడ్డు తగిలింది.

సర్కారు సింగారం
మండపేటలో గత టీడీపీ ప్రభుత్వ హయాంలో అధునాతన షిర్‌వాల్‌ టెక్నాలజీతో నిర్మించిన జీప్లస్‌ త్రి గృహ సముదాయాలకు నీలం, తెలుపు రంగులు వేస్తున్న దృశ్యం

టీడీపీ హయాంలో కట్టిన ఇళ్లకు వైసీపీ ప్రభుత్వం కొత్త రంగులు

నీలం, తెలుపు రంగులతో ఆ భవనాలకు సొంత రూపు

ఈనెల 25న పంపిణీకి సిద్ధం చేస్తున్న టిడ్కో అధికారులు

మౌలిక వసతులపై మాత్రం కనిపించని స్పందన

మండపేట, డిసెంబరు 5 : ఈ ఇళ్లు కట్టింది గత టీడీపీ ప్రభుత్వ హయాంలో. గృహప్రవేశాలు చేసుకునే తరుణంలో లబ్ధిదారులకు ఎన్నికల కోడ్‌ అడ్డు తగిలింది. ఎన్నికలయ్యాక ఇక ఇళ్లలోకి వెళ్లడమే తరువాయి అనుకున్న వీరికి వైసీపీ ప్రభుత్వం షాకిచ్చింది. అసలు ఈ ఇళ్ల సంగతే పట్టించుకోవడం మానేసింది. ఇప్పుడు ఎట్టకేలకు ఆ గృహాలను లబ్ధిదారులకు అందించడానికి సన్నాహాలు చేస్తోంది. అయితే తనదైన ముద్ర వేసేందుకు వైసీపీ ప్రభుత్వం ఇప్పుడు వాటికి కొత్త రంగులు వేయిస్తోంది. నీలం, తెలుపు రంగులతో వాటిపై ప్రత్యేక ముద్రను వేసుకునే పనిలో పడింది. అధికారులు ఆ పనిలో హడావుడి పడుతున్నారు. ‘అందరికీ ఇళ్లు’ పథకం కింద ఎన్టీఆర్‌, పీఎంఏవై పేరుతో పట్టణ ప్రాంతాల్లో అధునాతన షిర్‌వాల్‌ టెక్నాలజీతో జిప్లస్‌ త్రి తరహాలో గత టీడీపీ ప్రభుత్వం వేలాది ఇళ్లను నిర్మించింది. 300 అడుగులు సింగిల్‌బెడ్‌రూంకు రూ.500ను డిపాజిట్‌ను కట్టించుకుని లబ్ధిదారులను ఎంపిక చేశారు. రెండో కేటగిరీలో సింగిల్‌   బెడ్‌రూంకు రూ.50,000, మూడో కేటగిరిలో డబుల్‌బెడ్‌రూంకు లక్ష లబ్ధిదారులు తమ వాటాగా చెల్లించారు. ఎన్నికల్లో గెలిస్తే వైసీపీ ఈ ఇళ్లను ఉచితంగా ఇస్తా మని హామీ ఇచ్చింది. కానీ ఇప్పుడు వైసీపీ ప్రభుత్వం 300 అడుగులు ఇంటిని రూపాయి డిపాజిట్‌ చెల్లించి ఇవ్వడానికి అంగీకరించింది. మిగిలిన రెండు కేటగిరీలలో లబ్ధిదారులు వాయిదాల పద్ధతిలో బ్యాంకు నుంచి రుణం తీసుకుని వాయిదాలు చెల్లించాల్సి ఉంటుంది. టీడీపీ ప్రభుత్వం ఫేజ్‌ 1లో 19,242 ఇళ్లను నిర్మించగా అందులో రూ.500 చెల్లించిన సింగిల్‌బెడ్‌రూంలు 198 బ్లాక్‌లుగా మొత్తం 6,336 ఫ్లాట్లు ఉన్నాయి. ఇక సింగిల్‌బెడ్‌రూం 365 అడుగుల ఇళ్లు 56 బ్లాకులుగా మొత్తం 1,763 ఫ్లాట్లు ఉన్నాయి. 430 అడుగుల డబుల్‌బెడ్‌రూం ఇళ్లు 292 బ్లాకులుగా 9,340 ఫ్లాట్లు ఉన్నాయి. జిల్లా మొత్తం మీద తొలివిడత 19,242 ఇళ్లలో 17,412 ఇళ్ల నిర్మాణం టిడ్కో పూర్తిచేసింది. ఎన్నికలముందు 2019 ఫిబ్రవరి 9న అప్పటి ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణుడు మండపేటలో రూ.266 కోట్ల వ్యయంతో నిర్మించిన 4,064 ఇళ్లను ప్రారంభించారు. కానీ ఎన్నికల కోడ్‌తో ఈ పంపిణీ  ప్రక్రియ తర్వాత నిలిచిపోయింది. కానీ ఈ ఇళ్లకు మౌలిక వసతుల ఏర్పాటు పూర్తి కాలేదు. తర్వాత వచ్చిన వైసీపీ ప్రభుత్వం పట్టించుకోకపోవడంతో వాటి ఊసే లేదు. ఇక 2019లో ప్రారంభించిన ఇళ్లకు సంబంధించి లబ్ధిదారులకు ఇళ్ల పత్రాలను అప్పట్లోనే కొందరికి అందించారు. తర్వాత వైసీపీ ప్రభుత్వం జాబితాలో కొన్నిచోట్ల వడపోత చేపట్టింది. ఎట్టకేలకు ఈనెల 25న ఇళ్ల పట్టాల పంపిణీ సమయంలోనే ఈ గృహాలను అందించే దిశగా ప్రయత్నాలు మొదలయ్యాయి. దీంతో తమ మార్కు కనబడేలా నీలం, తెలుపు రంగులను వేస్తున్నారు. కానీ మౌలిక వసతుల కల్పనకు ఎలాంటి ప్రయత్నాలు చేయకపోవడాన్ని లబ్ధిదారులు విమర్శిస్తున్నారు.



Updated Date - 2020-12-06T07:04:37+05:30 IST