కరోనా వేళలోనూ.. గోల్డ్‌ రన్‌!

ABN , First Publish Date - 2020-04-24T09:32:59+05:30 IST

కరోనా వేళ కూడా బంగారం ధరలు పెరుగుతూనే ఉన్నాయి. ఆరు నెలల కిందట 10 గ్రాముల బంగారం ధర సుమారు రూ.33000 వరకూ ఉండగా, ఇవాళ రూ.44 వేలకు చేరింది. కరోనా లాక్‌డౌన్‌ మొదలైన

కరోనా వేళలోనూ.. గోల్డ్‌ రన్‌!

26న అక్షయ తృతీయ కోసం ఆన్‌లైన్‌ వ్యాపారానికి రెడీ

కార్పొరేట్‌, పెద్ద సంస్థలన్నీ ఏర్పాట్లు

లాక్‌డౌన్‌ సమయంలో జిల్లాలో నిలిచిన రూ.600 కోట్ల మేర లావాదేవీలు


(ఆంధ్రజ్యోతి-రాజమహేంద్రవరం)

కరోనా వేళ కూడా బంగారం ధరలు పెరుగుతూనే ఉన్నాయి. ఆరు నెలల కిందట 10 గ్రాముల బంగారం ధర సుమారు రూ.33000 వరకూ ఉండగా, ఇవాళ  రూ.44 వేలకు చేరింది. కరోనా లాక్‌డౌన్‌ మొదలైన తర్వాత అమ్మకాలు లేకపోయినప్పటికీ అంతర్జాతీయ పరిస్థితుల నేపథ్యంలో బంగారం ధర పెరిగింది. ఇక బంగారం మార్కెట్‌లో అక్షయ తృతీయ అనేది ఓ సెంటిమెంట్‌. ఆ రోజు బంగారం కొంటే మంచిదనే నమ్మకం ఉంది. ఈ నేపథ్యంలో రాజమహేంద్రవరం, కాకినాడతోపాటు జిల్లాలోని ఇతర పట్టణాల్లోని పెద్ద బంగారం షాపులన్నీ ఆన్‌లైన్‌ వ్యాపారానికి తెరతీశా యి. గతంలో కూడా ఉన్నప్పటికీ ఈసారి అక్షయ తృతీయ సందర్భంగా ఆయా సంస్థల పేరిట ఆన్‌లైన్‌ షాపింగ్‌ లింకులు పెడతారు. వాటిలో అన్ని రకాల ఆభరణాలు ఉంటాయి.


కావలసినవారు ఆర్డర్‌ చేసుకోవచ్చు. కరోనా లాక్‌డౌన్‌ ముగిసిన తర్వాత కొనుకున్న వస్తువు ఇస్తారు. ప్రస్తుతం కొన్ని సంస్థలు ప్రామిస్‌ టు ప్రొటెక్ట్‌ అనే క్యాంపెయిన్‌ ప్రారంభించాయి. సోషల్‌ మీడియా, గూగుల్‌ నెట్‌వర్కును బాగా వినియోగించుకుంటున్నాయి. కొందరు డిస్కౌంట్లు కూడా ఇస్తున్నారు. రాజమహేంద్రవరంలో ప్రధాన వ్యాపార సంస్థలన్నీ  ఆన్‌లైన్‌ వ్యాపారానికి శ్రీకారం చుట్టాయి. ఫోన్‌లో కూడా మాట్లాడి వ్యాపారం చేసుకునే అవ కాశం కల్పించాయి. కాగా జిల్లాలో సాధారణ రోజుల్లో రోజుకు రూ.15 నుంచి 20 కోట్ల అమ్మకాలు జరుగుతుంటాయి.


ఈ లెక్కన  లాక్‌డౌన్‌ మొదలైప్పటి నుంచి ఇప్పటివరకూ రూ.600 కోట్ల వరకూ వ్యాపారా లావాదేవీలు నిలిచిపోయినట్టు వ్యాపారులు చెబుతున్నారు. ఇక బంగారం పనిచేసుకునే వారి పరిస్థితి మరీ దారుణం. షాపులన్నీ మూతపడడంతో వేలాది మంది ఉద్యోగులు, పనివాళ్లు ఇబ్బందులపాలయ్యారు.

Updated Date - 2020-04-24T09:32:59+05:30 IST