సమనస ఎస్‌బీఐలో ‘గోల్డ్‌లోన్‌’ గోల్‌మాల్‌!

ABN , First Publish Date - 2020-09-13T10:12:19+05:30 IST

బ్యాంకులో కుదువ పెట్టిన బంగారు ఆభరణాల విషయంలో ఒక బ్యాంకు ఉద్యోగి సుమారు రూ.1.50 కోట్ల మేర అదనపు రుణాలు తీసుకుని గోల్‌మాల్‌కు పాల్పడినట్టు విశ్వసనీయ సమాచారం

సమనస ఎస్‌బీఐలో ‘గోల్డ్‌లోన్‌’ గోల్‌మాల్‌!

  సుమారు రూ.1.50 కోట్ల మేర అక్రమాలు జరిగినట్టు గుర్తింపు

 గత ఐదు రోజులుగా గోప్యంగా ఉన్న వ్యవహారం

  ఆందోళనలో గోల్డ్‌లోన్‌ తాకట్టుదారులు


అమలాపురం (ఆంధ్రజ్యోతి) : బ్యాంకులో కుదువ పెట్టిన బంగారు ఆభరణాల విషయంలో ఒక బ్యాంకు ఉద్యోగి సుమారు రూ.1.50 కోట్ల మేర అదనపు రుణాలు తీసుకుని గోల్‌మాల్‌కు పాల్పడినట్టు విశ్వసనీయ సమాచారం. అమలాపురం రూరల్‌  మండలం సమనస స్టేట్‌బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా బ్రాంచిలో ఈ అక్రమాలు చోటు చేసుకున్నట్టు ఆడిట్‌ విచారణ ద్వారా వెలుగు చూసింది. అయితే ఈ గోల్‌మాల్‌ వ్యవహారంపై పోలీసులకు ఫిర్యాదు అందలేదు. బ్యాంకులోని క్యాషియర్‌ చాంబర్‌లోనే బంగారు తాకట్టు వ్యవహార లావాదేవీలు నిర్వహిస్తారు.


క్యాషియర్‌ దగ్గర ఒక తాళం, అక్కౌంటెంట్‌ దగ్గర మరో తాళంతో బ్యాంకులోని నగదు, బంగారు ఆభరణాల బ్యాగులకు జాయింట్‌ కస్టోడియన్లుగా ఉంటారు. అయితే ఏడాదిన్నర కాలం నుంచి బ్యాంకు ఆడిట్‌ జరగలేదు. గత కొన్ని రోజుల నుంచి సమనస ఎస్‌బీఐ బ్రాంచి ఆడిట్‌లో భాగంగా రికార్డులు, బంగారు ఆభరణాల పరిశీలన, తాకట్టు వ్యవహారాల్లో అనుమానాలు వచ్చిన ఆడిట్‌ అధికారి మరింత లోతుగా విచారణ చేపట్టారు. గత ఐదు రోజులుగా ఆడిట్‌ జరుగుతున్నట్టు సమాచారం.


అయితే తనిఖీల్లో భాగంగా బ్యాంకులో ఖాతాలెన్నీ, బ్యాగులెన్ని, వాటిలో ఉన్న బంగారు ఆభరణాలు, తూకాలు సక్రమంగా ఉన్నాయా లేదా అని పరిశీలన చేస్తున్న క్రమంలో ఈ గోల్‌మాల్‌ వ్యవ హారం బట్టబయలైంది. బ్యాంకులో ఉన్న బంగారం బ్యాగుల్లో తూకాల్లో వ్యత్యాసాలు, ఖాతాదారులు కుదువ పెట్టిన నగలనే మళ్లీ మళ్లీ మరికొందరు వ్యక్తుల పేరిట, బంధువుల పేరిట గోల్డ్‌ రుణాలు తీసుకున్నట్టు అధికారుల విచారణలో తేలింది. సుమారు రూ.1.30 కోట్ల నుంచి రూ.1.50 కోట్ల వరకు అదనపు రుణాలు తీసుకున్నట్టు ఆడిట్‌ అధికారులు గుర్తించి బ్యాంకు ఉన్నతాధికారులకు సమాచారం ఇచ్చారు.


అయితే రూ.కోటి పైబడి అక్రమాలు ఉంటే ఆ కేసు సీబీఐ పరిధిలోకి వెళుతుందన్న దృష్ట్యా కొందరు యూనియన్‌ నేతలు సైతం జోక్యం చేసుకుని రూ.కోటి లోపుగా తీసుకువచ్చేందుకు విఫలయత్నం చేసినట్టు తెలిసింది. అయితే ఇప్పటికిప్పుడు అంత సొమ్ము కట్టే పరిస్థితి లేకపోవడంతో ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేయ డం మినహా పోలీసులకు గానీ, సీబీఐకు గానీ సమాచారం అందించ కుండా జాప్యం చేయడం వెనుక అనేక అనుమానాలకు తావిస్తోంది.


తొలుత విచారణ అధికారి ఒక గోల్డ్‌ బ్యాగులో ఉన్న ఆభరణాలను తూకం వేసినప్పుడు రికార్డుల్లో ఉన్న లెక్కలకు, వాస్తవంగా ఉన్న లెక్క లకు మధ్య 30 గ్రాముల బంగారం తేడా ఉన్నట్టు గుర్తించడం ద్వారా లోతైన విచారణకు వెళ్లడంతో ఈ అక్రమాలు బహిర్గతమయ్యాయి. వాస్తవానికి రూ.కోటి లోపైతే ఎస్‌బీఐ రీజనల్‌ బ్రాంచి ఆఫీస్‌ అధికారులు విచారణ చేపడతారు. అంతకు దాటితే సీబీఐ విచారణకు తీసుకుంటుం ది.


ఈ క్రమంలో ఈ వ్యవహారాన్ని గుట్టుచప్పుడు కాకుండా సర్థుబాబు చేయాలనే యోచనలో బ్యాంకు అధికారులు ఉన్నట్టు తెలుస్తోంది. ఎస్‌బీఐ సమనస బ్రాంచిలో గోల్డ్‌లోను వ్యవహారంలో అక్రమాలు జరిగా యన్న అంశంపై అమలాపురం తాలూకా పోలీసులకు ఇంతవరకు ఎటు వంటి ఫిర్యాదు అందలేదని తాలూకా ఎస్‌ఐ సీహెచ్‌.రాజేష్‌ తెలిపారు. ఈ వ్యవహారం ఆ నోటా, ఈ నోటా ఖాతాదారులకు చేరడంతో తమ పేర్ల మీద గానీ, తాము కుదువ పెట్టిన బంగారు ఆభరణాల మీద గానీ అద నపు రుణాలు తీసుకున్నారా అనే ఆందోళనతో ఉన్నట్టు సమాచారం.

Updated Date - 2020-09-13T10:12:19+05:30 IST