ముక్కోటికి ముస్తాబు

ABN , First Publish Date - 2020-12-25T07:31:42+05:30 IST

ముక్కోటి ఏకాదశి పర్వదినం సందర్భంగా ప్రముఖ పుణ్యక్షేత్రమైన సత్యదేవుని సన్నిధిలో ఉత్తర ద్వార దర్శనానికి ఏర్పాట్లు పూర్తి చేశారు.

ముక్కోటికి ముస్తాబు

అన్నవరం, డిసెంబరు 24: ముక్కోటి ఏకాదశి పర్వదినం  సందర్భంగా ప్రముఖ పుణ్యక్షేత్రమైన సత్యదేవుని సన్నిధిలో ఉత్తర ద్వార దర్శనానికి ఏర్పాట్లు పూర్తి చేశారు. తెల్లవారు జామున రెండు గంటలకు సుప్రభాత సేవ అనంతరం ప్రధా నాలయంలో విశాఖ శారదా పీఠం ఉత్తరాధికారి స్వాత్మానం దేంద్ర ఆధ్వర్యంలో ప్రత్యేక పూజలు చేసి హారతి ఇస్తారు. ఐదు గంటల నుంచి భక్తులను ఉత్తర ద్వార దర్శనానికి అనుమతిస్తారు. 11 గంటల వరకు మాత్రమే దర్శనం ఉంటుందని, భక్తులు గమనించాలని పీఆర్వో కొండలరావు కోరారు. ఉత్తర ద్వార మార్గాన్ని సుగంధభరిత పుష్పమాలికలతో సర్వాంగ సుందరంగా అలంకరించారు. ప్రధానాలయంలో ప్రత్యేక వేదికపై స్వామి, అమ్మవార్లకు పుష్పాలంకరణ చేసి శేష పాన్పుపై శయనించే విష్ణుమూర్తిగా సత్యదేవుడిని, ఆయన పాదాలను సుతిమెత్తగా ఒత్తుతున్న దేవేరిగా అనంతలక్ష్మి అమ్మవారిని అలంకరించారు. సత్యదేవుని సన్నిధిలో ఈ నెల 16న ప్రారంభమై దిగ్విజయంగా జరుగుతున్న కోటి తులసి పూజ శుక్రవారం ముగియనుంది. ఉదయం 11 గంటలకు శారదా పీఠం ఉత్తరాధికారి స్వాత్మానందేంద్ర సరస్వతి ఆధ్వర్యంలో ఉదయం 11 గంటలకు హోమ పూర్ణాహుతి జరుపుతారు.Updated Date - 2020-12-25T07:31:42+05:30 IST