జీజీహెచ్‌కు కరోనా బాధిత కుటుంబం

ABN , First Publish Date - 2020-03-23T08:47:53+05:30 IST

కరోనా వైరస్‌ బారిన పడిన రాజమహేంద్రవరంలోని వీరభద్రపురం యువకుడికి పాజిటివ్‌ అని తేలడంతో అతడి కుటుంభసభ్యులను శనివారం

జీజీహెచ్‌కు కరోనా బాధిత కుటుంబం

రాత్రికి రాత్రే తరలింపు

వీరభద్రపురంలో తీవ్ర కలకలం 

250 కుటుంబాలకు 14 రోజుల గృహనిర్బంధం


రాజమహేంద్రవరం సిటీ/జీజీహెచ్‌ (కాకినాడ) మార్చి 22: కరోనా వైరస్‌ బారిన పడిన రాజమహేంద్రవరంలోని వీరభద్రపురం యువకుడికి పాజిటివ్‌ అని తేలడంతో అతడి కుటుంభసభ్యులను శనివారం అర్ధరాత్రి కాకినాడ జీజీహెచ్‌కు తరలించారు. తొలుత అనుమానిత కేసు గా స్థానిక ప్రజలు భావించారు. పాజిటివ్‌ అని తేలడంతో వీరభద్రపురంలో పరిస్థితి భయానకంగా మారింది. బాధిత కుటుంబానికి దగ్గరగా వున్నవారు, ఇరుగుపోరుగు భయపడిపోతున్నారు. కుటుంబం మొత్తాన్ని కాకినాడ తరలించడంతో స్థానిక ప్రజలకు సోకివుంటుందా అనే అనుమానాలు ఆందో ళన కలిగిస్తున్నాయి. వీరభద్రపురం వెళ్లే దారులన్నింటిని ట్రాఫిక్‌ పోలీసులు స్టాప్‌బోర్డులు పెట్టి బ్లాక్‌ చేశారు. లండన్‌ నుంచి మూడు రోజుల క్రితం నగరానికి వచ్చిన ఆ యువకుడు రాజమహేంద్రవరంలో ఎక్కడెక్కడ తిరిగాడు, ఎవరెవ రితో మాట్లాడాడనే వివరాలను మునిసిపల్‌ హెల్త్‌ అధికారులు సేకరిస్తున్నారు. 


కంట్రోల్‌రూం ఏర్పాటు

వీరభద్రపురంలో లండన్‌ నుంచి వచ్చిన ఓ యువకుడికి కరోనా పాజిటివ్‌ కావడంతో ఆ ప్రాంతంలో 250 కుటుంబా లను 14 రోజులపాటు గృహనిర్బంధంలో వుండాలని నగరపాలక సంస్థ వైద్యాధికారులు సూచించారు. వీరభద్రపురం లో రామాలయం వీధి, సాదుస్ర్తీల మఠం తదితర ప్రాంతాల్లోని కుటుంబాలను ఆదివారం ఉదయం నుంచే గృహనిర్బంధంలోనే ఉండాలని సూచించారు. వారికి కావల్సిన నిత్యా వసరాలు తామే సరఫరా చేస్తామని కమిషనర్‌ ప్రకటించా రు. అందునిమిత్తం ఏర్పాటు చేసిన కంట్రోల్‌ రూం నెం  0883-2479806, 9866657620 సమాచారం ఇవ్వాలని సూ చించారు. తీసుకోవాల్సిన జాగ్రత్తలపై ఆయా కుటుంబా ల కు మునిసిపల్‌ అధికారులు అవగాహన కల్పించారు. వీరభద్రపురంలో సోడియం హైపోక్లోరైడ్‌ను స్ర్పే చేశారు. మనిషికి మనిషికి మధ్య వుండాల్సిన దూరం, పాటించాల్సిన నిబంధనలను వివరించారు.


31 వరకు అన్నీ బంద్‌: కమిషనర్‌ 

రాజమహేంద్రవరంలో కరోనా వైరస్‌ పాజిటివ్‌ కేసు నమోదైనందున నగరంలో ఈ నెల 31వ తేదీ వరకు అత్యవసర సరుకులు మినహ అన్ని దుకాణాలు, పార్కులు, వ్యాయమశాలలు, ఈతకొలనులు, మ్యూజియంలను మూసివేయాలని నగరపాలక సంస్థ కమిషనర్‌ అభిషిక్త్‌కిషోర్‌ ఆదే శాలు జారీచేశారు. ఆలయాల్లో జాతరలు, చర్చిల్లో ప్రార్థనల విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలని, అన్ని రకాల కార్యక్రమాలను వాయిదా వేసుకోవాలని ఆదేశించారు. నగరంలోని ఏ ప్రదేశంలోను ప్రజలు గుమిగూడి ఉండరాదని ఆయన కోరారు. కార్పొరేషన్‌కు సహకరించాలని విజ్ఞప్తి చేశారు.


ఖతర్‌ నుంచి వచ్చిన యువకుడి తరలింపు

సౌదీ అరేబియాలోని ఖతర్‌ నుంచి వచ్చిన ఓ వ్యక్తిని జీజీహెచ్‌కు తరలించి, కరోనా వైరస్‌ పరీక్ష నిర్వహించారు. కాకినాడకు చెందిన వ్యక్తి(35)  ఇటీవల ఖతర్‌ నుంచి వచ్చాడు. ఎయిర్‌పోర్టు సిబ్బంది ఇచ్చిన సమాచారం మేరకు అతడిని ఆదివారం జీజీహెచ్‌కు తరలించగా వైరస్‌ పరీక్ష నిర్వహించారు.  ప్రస్తుతం జీజీహెచ్‌లో ప్రత్యేక ఐసోలేషన్‌, క్వారంటైన్‌లలో 11 మంది చికిత్స పొందుతున్నారు. ఇప్పటి వరకు జీజీహెచ్‌లో 37 మందికి ఈ వైరస్‌ పరీక్షలు నిర్వహించగా 26 మందికి నెగెటివ్‌, ఒకరికి పాజిటివ్‌గా రిపోర్టులు వచ్చాయి. మరో 10 మందికి రిపోర్టులు రావాల్సి ఉందని నోడల్‌ అఽధికారి తెలిపారు.

Updated Date - 2020-03-23T08:47:53+05:30 IST