దాగుడుమూతా దండాకోర్‌

ABN , First Publish Date - 2020-11-06T06:55:18+05:30 IST

కాకినాడ, రాజమహేంద్రవరంలో రెండు కొత్త మెడికల్‌ కాలేజీలు, ఆసుపత్రుల నిర్మాణానికి రూ.300 కోట్ల విలువైన భూములను ఎట్టకేలకు లాగేసుకున్నారు. వరుస ఆందోళనలు, అభ్యంతరాలను సైతం కాదని విలువైన స్థలాలను కట్టబెట్టేశారు.

దాగుడుమూతా దండాకోర్‌
కాకినాడ ప్రభుత్వ ఐటీఐ ప్రాంగణం ఇదే


  • మెడికల్‌ కాలేజీల నిర్మాణానికి భూములు లాగేసినట్టే
  • కాకినాడ ఐటీఐకి చెందిన రూ.160 కోట్ల విలువైన 15.76 ఎకరాలు అప్పగింత
  • రాజమహేంద్రవరంలో రూ.125 కోట్ల విలువైన 12.57 ఎకరాల సెంట్రల్‌ జైలు స్థలం కూడా
  • ఒకపక్క ఐటీఐని ఎక్కడికీ తరలించకుండా ఆర్‌ఎంసీ విస్తరిస్తామంటున్న కలెక్టర్‌
  • ఇంకోపక్క ఐటీఐని మహిళా పాలిటెక్నిక్‌ క్యాంపస్‌కు తరలించడానికి ఏకంగా కౌన్సిల్‌ తీర్మానం
  • అసలు ఐటీఐని తమ మహిళా కాలేజీకి ఎలా తరలిస్తారంటూ జీపీటీ ఆందోళన
  • తరలింపు నిరసనల నుంచి తప్పించుకునేందుకు అధికారుల ఎత్తుగడగా అనుమానాలు


(కాకినాడ- ఆంధ్రజ్యోతి)

కాకినాడ, రాజమహేంద్రవరంలో రెండు కొత్త మెడికల్‌ కాలేజీలు, ఆసుపత్రుల నిర్మాణానికి రూ.300 కోట్ల విలువైన భూములను ఎట్టకేలకు లాగేసుకున్నారు. వరుస ఆందోళనలు, అభ్యంతరాలను సైతం కాదని విలువైన స్థలాలను కట్టబెట్టేశారు. కేబినెట్‌లో గురువారం కేటాయింపుల ఖరారును మమ అనిపించారు. కాకినాడలో రంగరాయ మెడికల్‌ కాలేజీ విస్తరణకు ఐటీఐని బలిచేయవద్దంటూ ఎన్ని నిరసనలు వ్యక్తమైనా చివరకు అవేం పనిచేయలేదు. కాదని సాంకేతిక విద్యాశాఖ మొత్తుకున్నా రూ.160 కోట్ల భూమిని పంచేశారు. ఒకపక్క మెడికల్‌ కాలేజీ విస్తరణకు ఐటీఐని తరలించబోమని కలెక్టర్‌ చెబుతున్నారు. ఇంకోపక్క దీన్ని మహిళా పాలిటెక్నిక్‌ క్యాంపస్‌కు తరలించడానికి కార్పొరేషన్‌ తీర్మానించింది. ఇలా ఐటీఐని బలిచేయడానికి ఎవరికివారే దాగుడు మూతలాడుతున్నట్టు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. 

ఉంచుతారా...తీసేస్తారా? 

పార్లమెంట్‌ స్థానానికో మెడికల్‌ కాలేజీ, అనుబంధంగా ఆసుపత్రి నిర్మించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. అందులోభాగంగా కాకినాడ, రాజమహేంద్రవరం, అమలాపురం.. ఈ మూడు ప్రాంతాలకు మూడు కాలేజీలు మంజూరుచేసింది. రాజమహేంద్రవరంలో కొత్త మెడికల్‌ కాలేజీ నిర్మాణానికి స్థలాలు లేకపోవడంతో ప్రస్తుత జిల్లా ఆసుపత్రికి ఆనుకుని ఉన్న సెంట్రల్‌ జైలు భూముల 12.57 ఎకరాలు లాగేసుకోవాలని అధికారులు ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపించారు. కానీ సెంట్రల్‌ జైలు అంగీకరించలేదు. భవిష్యత్తు అవసరాలకు ఇవి కావాలని వాదించింది. అయినా ఫలితం లేకుండా పోయింది. దీంతో రూ.180 కోట్లకు పైగా విలువైన భూమిని ప్రభుత్వం కొత్త మెడికల్‌ కాలేజీకి కట్టబెట్టేస్తూ గురువారం కేబినెట్లో తీర్మానించింది. అటు కాకినాడలో ఎలాగూ రంగరాయ మెడికల్‌ కాలేజీ ఉండడంతో దీన్ని విస్తరించాలని ప్రభుత్వం నిర్ణయించింది. కానీ ఆర్‌ఎంసీకి ఉన్న 17.32 ఎకరాలు చాలవని, పక్కనే ప్రభుత్వ ఐటీఐ కాలేజీకి ఉన్న 15.76ఎకరాలు కూడా తీసేసుకుంటే బాగుంటుందని అధికారులు ప్రభుత్వానికి ప్రతిపా దనలు పంపించారు. ఐటీఐ విద్యార్థులు, విద్యార్థి సంఘాలు, ఉద్యోగ సంఘాలు ఈ నిర్ణయాన్ని వ్యతిరేకించాయి. 70 ఏళ్ల చరిత్ర కలిగిన ఐటీఐ భూములు తీసుకోవద్దని ఆందోళన బాట పట్టాయి. క్యాంపస్‌కు ఉన్న భూముల విలువ రూ.160 కోట్ల వరకు ఉంటుందని, తమను తరలిస్తే వేరేచోట క్యాంపస్‌ నిర్వహణ చాలా కష్టం అవుతుందని ఉన్న తాధికారులకు విజ్ఞప్తులు పంపాయి. రాష్ట్ర సాంకేతిక విద్యాశాఖ కూడా అభ్యంతరం వ్యక్తం చేసింది. అయినాసరే అధికారులు వెనక్కు తగ్గకుండా ఐటీఐ మెడపై కత్తి పెట్టారు. దీంతో గురువారం కేబినెట్‌ సమా వేశంలో ఐటీఐకి చెందిన మొత్తం భూములు ఆర్‌ఎంసీ విస్తరణకు కేటాయిస్తూ నిర్ణయం తీసుకున్నారు. దీంతో కాకినాడ ఐటీఐ చరిత్ర ఇక ముగిసినట్లే అనే ఆందోళన వ్యక్తమవుతోంది. 

తలోమాటపై అనుమానాలు...

ఐటీఐ భూములను ఆర్‌ఎంసీకి ఇచ్చేసిన నేపథ్యంలో క్యాంపస్‌ను అక్కడే ఉంచుతారా? తరలించేస్తారా? అనే దానిపై ఉన్నతాధికారులు దాగుడుమూతలు ఆడుతున్నారు. నిరసనలు పెరగకుండా తెలివిగా తప్పుదారిపట్టిస్తున్నట్టు విద్యార్థుల్లో అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఐటీఐ క్యాంపస్‌ను గురువారం పరిశీలించిన కలెక్టర్‌ దీన్ని ఇక్కడే ఉంచుతామని, భూములను మాత్రం వాడుకుంటామని చెప్పారు. ఇంకోపక్క ఐటీఐను మహిళా పాలిటెక్నిక్‌ కాలేజీకి తరలిస్తామని, అక్కడ అయిదెకరాలు కేటాయిస్తున్నట్టు కాకినాడ కార్పొరేషన్‌లో ఇటీవల తీర్మానించారు. దీని వెనుక స్థానిక ఎమ్మెల్యే చక్రం తిప్పారు. దీంతో అసలు ఏది నిజం అనేది అంతుపట్టని పరిస్థితి నెలకొంది. ఇదంతా ఒకెత్తయితే మహిళా కాలేజీ ప్రాంగణంలోకి పురుషుల ఐటీఐని ఎలా తరలిస్తారంటూ కౌన్సిల్‌ నిర్ణయాన్ని పాలిటెక్నిక్‌ కాలేజీ ప్రశ్నిస్తోంది. వాస్తవానికి కలెక్టర్‌ చెప్పినట్లు మెడికల్‌ కాలేజీ ఆవరణలో ఐటీఐ కాలేజీ నడపం ఎంతవరకు సాధ్యం అనేది కూడా అనుమానం గా ఉంది. ఇన్ని పరిణామాల నేపథ్యంలో ప్రభుత్వ నిర్ణయంపై త్వరలో విద్యార్థి సంఘాలు న్యాయస్థానాన్ని ఆశ్రయించాలని నిర్ణయించాయి.

Updated Date - 2020-11-06T06:55:18+05:30 IST