కష్టమే ఈ‘సారీ’

ABN , First Publish Date - 2020-12-06T07:00:40+05:30 IST

జిల్లాలో ఈ ఏడాది ఖరీఫ్‌ సీజన్‌లో 2.19 లక్షల హెక్టార్లలో వరి నాట్లు పడ్డాయి.

కష్టమే ఈ‘సారీ’
రావులపాలెంలో ధాన్యం పట్టుబడి దృశ్యం

జిల్లాలో ఈసురోమంటున్న ఖరీఫ్‌ ధాన్యం సేకరణ

13 లక్షల మెట్రిక్‌ టన్నుల లక్ష్యానికి ఇప్పటివరకు 1.55 లక్షలే కొనుగోలు

 జిల్లా చరిత్రలో తొలిసారిగా అత్యంత దారుణంగా ధాన్యం కొనుగోలు

వరుస తుఫాన్లు, వరదలతో ఎక్కడికక్కడ తీవ్ర పంట నష్టం

ఫలితంగా ఈసారి 8.5 లక్షల మెట్రిక్‌ టన్నులు దాటడం గగనమే

రూ.256 కోట్ల ధాన్యం కొనుగోలుకు ఇంతవరకు రూ.25 కోట్లే చెల్లింపు


జిల్లాలో ఈ ఏడాది ఖరీఫ్‌ ధాన్యం సేకరణ ఈసురోమంటోంది. ఎక్కడికక్కడ కొనుగోళ్లు లేక..అన్నదాత నుంచి సరుకు రాక కొనుగోలు కేంద్రాలు దిక్కులు చూస్తున్నాయి. ధాన్యం కొనుగోళ్లు ఎప్పుడు మొదలైనా రాష్ట్రంలో తొలిస్థానం తూర్పుదే. కానీ ఈసారి వరుస ప్రకృత వైపరిత్యాలతో జిల్లాలో వరి పంట కకావికలమైంది. చేతికి వచ్చే దశలో ఎక్కడికక్కడ పూర్తిగా పాడైపోయింది. దీంతో ఈ ప్రభావం ఖరీఫ్‌ ధాన్యం కొనుగోళ్లపై తీవ్రంగా పడింది. ఈ సీజన్‌లో మొత్తం రూ.13 లక్షల మెట్రిక్‌ టన్నుల ధాన్యం సేకరణ లక్ష్యానికిగాను ఇంతవరకు జిల్లావ్యాప్తంగా కేవలం 1.5 లక్షల మెట్రిక్‌ టన్నులే కొనుగోలు జరిగింది. దీన్నిబట్టి పరిస్థితి ఎంత దయనీయంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. అంతేకాదు జిల్లా చరిత్రలో తొలిసారిగా ఈదఫా 8.5 లక్షల మెట్రిక్‌ టన్నులు దాటడం అసాధ్యమని అంచనా వేస్తున్నారు.

(కాకినాడ-ఆంధ్రజ్యోతి)

జిల్లాలో ఈ ఏడాది ఖరీఫ్‌ సీజన్‌లో 2.19 లక్షల హెక్టార్లలో వరి నాట్లు పడ్డాయి. ఎన్నడూలేని విధంగా పొట్టదశలో పెద్దగా తెగుళ్లు లేకపోవడంతో దిగుబడి భారీగానే ఉంటుందని వ్యవసాయశాఖ అంచనా వేసింది. అయితే ప్రకృతి పగబట్టడంతో జిల్లాలో పరిస్థితి ఒక్కసారిగా తారుమారైంది. మూడు సార్లు వరదలు, వర్షాలు ఎక్కడికక్కడ పంటను ముంచేశాయి. కోలుకోలేని విధంగా చేలల్లో వరిని తుడిచిపెట్టేశాయి. ఆగస్టులో వరదలు జిల్లాను చుట్టేయడంతో డెల్టాతోపాటు కోనసీమలో లక్షల ఎకరాల్లో వరి పంట పూర్తిగా దెబ్బతింది. ఎక్కడికక్కడ పంట నేలకు వాలి కంకులు రాలిపోయాయి. దుబ్బులు కుళ్లిపోయి భారీగా నష్టం వాటిల్లింది. ఆ తర్వాత ఎలాగోలా కోలుకుంటే అక్టోబరులో తుఫాన్లు, భారీ వర్షాలు, వరదలు మరోసారి దెబ్బకొట్టాయి. దీంతో కోనసీమ, కాకినాడ,రామచంద్రపురం, రాజమహేంద్రవరం తదితర డివిజన్లలో 1.50 లక్షల ఎకరాల్లో పంట పూర్తిగా దెబ్బతింది. వరదలకు అనేక చోట్ల పంటలు కొట్టుకుపోయాయి. నేలకొరిగిన చోట్ల పంట కుళ్లిపోయి భారీగా నష్టం వాటిల్లింది. 40 వేల మెట్రిక్‌టన్నుల ధాన్యం పూర్తిగా రంగు మారిపోయింది. ఎలాగోలా వరుస గండాల నుంచి తప్పించుకుని అక్కడక్కడా పంట మిగిలిందనుకుంటే నివర్‌ తుఫాను తీవ్రంగా దెబ్బతీసింది. దాదాపు 1.47 లక్షల ఎకరాల్లో వరి పంట మళ్లీ దెబ్బతింది. ఈసారి పూర్తిగా నేలకొరిగి రోజుల తరబడి నీటిలో ఉండిపోవడంతో పంట కుళ్లిపోయింది. 60 వేల మెట్రిక్‌ టన్నుల వరకు ధాన్యం రంగుమారి పనికిరాకుండా పోయింది. అయితే ఖరీఫ్‌ ధాన్యం కొనుగోలు సీజన్‌ మొదలుకావడంతో జిల్లావ్యాప్తంగా 426 ధాన్యం కొనుగోలు కేంద్రాలు, 868 ఆర్‌బీకేల్లో వీటిని కొనుగోలు చేసే ప్రక్రియను జిల్లా పౌరసరఫరాల సంస్థ నవంబర్‌ 13 నుంచి మొదలు పెట్టింది. గతేడాదిలాగే 13 లక్షల మెట్రిక్‌ టన్నుల ధాన్యం కొనుగోలుకు సిద్ధమైంది. అయితే వరుస ప్రకృతి వైపరీత్యాల ప్రభావంతో ధాన్యం కొనుగోళ్లు అసలు కదలడం లేదు. గతేడాది డిసెంబర్‌ మొదటి వారానికి ఎనిమిది లక్షల మెట్రిక్‌ టన్నుల వరకు కొనుగోళ్లు జరిగితే ఈసారి 1.5 లక్షల మెట్రిక్‌ టన్నులకు ఇంకా చేరుకోలేదు. పైగా సేకరించిన ధాన్యంలో 40 వేల మెట్రిక్‌ టన్నుల ధాన్యం ఒక్క రాయవరం మండలం చెల్లూరు పీపీసీలో మాత్రమే జరిగింది. దీన్నిబట్టి మిగిలిన పీపీసీల పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. ఈ నేపథ్యంలో ఈ దఫా లక్ష్యానికి చాలా దూరంలో కొనుగోళ్లు ఆగిపోతాయని అధికారులు అంచనా వేస్తున్నారు. వచ్చే నెల జనవరి 15 నాటికి కొనుగోళ్లు పూర్తి చేయాల్సి ఉన్నందున ఆ సమయానికి దాదాపు 8.5 లక్షల మెట్రిక్‌ టన్నులకు కొనుగోళ్లు చేరుకోవడం గగనమని ఓ అంచనాకు వచ్చారు. జిల్లాచరిత్రలో ఇంత తక్కువ ధాన్యం సేకరణ కూడా ఇదేనని అధికారులు విశ్లేషిస్తున్నారు. మరోపక్క డిసెంబర్‌ 5 వరకు జిల్లావ్యాప్తంగా రూ.256 కోట్ల విలువైన 1.5 లక్షల మెట్రిక్‌ టన్నుల ధాన్యం కొనుగోలు జరగ్గా అన్నదాతలకు కేవలం రూ.25 కోట్లు మాత్రమే చెల్లింపులు జరిగాయి. సర్వర్ల సమస్యతో చెల్లింపుల్లో ఇబ్బందులు తలెత్తాయని జిల్లా పౌరసరఫరాల శాఖ పేర్కొంది.


Updated Date - 2020-12-06T07:00:40+05:30 IST