ప్రశాంతంగా.. ప్రణాళికాబద్ధంగా...రాయండి..!

ABN , First Publish Date - 2020-03-04T08:58:22+05:30 IST

పరీక్షలకాలం వచ్చేసింది. నేటినుంచి ఇంటర్‌ పరీక్షలు ప్రారంభం కానున్నాయి. విద్యార్థులు ప్రణాళికాబద్ధంగా చదివినా పరీక్షలకు

ప్రశాంతంగా.. ప్రణాళికాబద్ధంగా...రాయండి..!

ఒత్తిడి లేకుండా ఉంటేనే మంచి మార్కులు

సమయాన్ని సద్వినియోగం చేసుకోండి

రాసేసిన పరీక్ష గురించి ఆలోచించొద్దు

రేపటి పరీక్షపైనే దృష్టి పెట్టండి

పరీక్షా కేంద్రానికి గంట ముందుగానే చేరుకోండి

పిల్లల్లో ఆత్మస్థైర్యం నింపాల్సిన బాధ్యత తల్లిదండ్రులదే 

నేటినుంచి ఇంటర్మీడియెట్‌ పరీక్షలు ప్రారంభం


రాజమహేంద్రవరం సిటీ, మార్చి 3: 

పరీక్షలకాలం వచ్చేసింది. నేటినుంచి ఇంటర్‌ పరీక్షలు ప్రారంభం కానున్నాయి. విద్యార్థులు ప్రణాళికాబద్ధంగా చదివినా పరీక్షలకు ముందు కొంత ఆందోళనకు గురవ్వడంవల్ల ప్రశాంతంగా పరీక్షలు రాసే పరిస్థితి ఉండదు. విద్యార్థులు పరీక్ష రాసేటప్పుడు కంగారుపడకుండా ప్రశాంతంగా పరీక్షలు పక్కా ప్లానింగ్‌తో రాయాలని నిపుణులు సూచిస్తున్నారు. ప్రతి నిమిషాన్ని ఉపయోగించుకుని స్కోరింగ్‌ చేయాల్సిన అవసరం ఉందంటున్నారు. ఇంటర్‌ పరీక్షలు రాసే విద్యార్థుల కోసం ఆంధ్రజ్యోతి ప్రత్యేక కథనం.


ప్లానింగ్‌ ఇలా...

ఇంటర్‌ పరీక్షలు రాసే విద్యార్థులు ప్రణాళికాబద్ధంగా ముందుకు వెళ్లాలి. ప్రశ్నాపత్రం తీసుకున్నాక 3 గంటల్లో పరీక్ష రాయాల్సి ఉంటుంది. ఇందులో 10 నిమిషాలు పేపర్‌ చదవడానికి, ఆఖరి 10 నిమిషాలు రాసింది ఒక్కసారి చూడడానికి ఉపయోగించాలి. మిగిలిన 160 నిమిషాలు 100 మార్కుల స్కోరింగ్‌ కోసం పరీక్ష రాయాలి. అంటే ప్రతి 10 మార్కులకు 16 నిమిషాలను కేటాయించుకుని పక్కాగా పరీక్ష రాస్తే ఉత్తీర్ణత తథ్యం. 


రాశాక ఆలోచించొద్దు

ఇంటర్‌ విద్యార్థులు పరీక్షలు రాశాక, రాసిన పరీక్ష గురించి ఆలోచిస్తే కొంత ఆందోళన మొదలవుతుంది. ఆ ఆందోళన ప్రభావం మరుసటి పరీక్షపై పడుతుంది. అందువల్ల పరీక్ష రాసిన తర్వాత రాసిన పరీక్ష గురించి చర్చించకూడదు. రేపటి పరీక్ష గురించి ఆలోచించి ముందుకు సాగాలి.


ఏడు గంటల నిద్ర అవసరం

పరీక్షల కాలంలో విద్యార్థులు కచ్చితంగా ఏడు గంటలు నిద్రపోవాల్సిన అవసరం ఉంది. 24 గంటల్లో మిగిలిన సమయాన్ని కంగారు పడకుండా కేటాయింపులు చేసుకుని వినియోగించుకోవాలి. ప్రతి నిమిషం విలువైందే కాబట్టి సమయస్ఫూర్తితో ముందుకు వెళ్లాలి. పరీక్షా కేంద్రానికి 20 నిమిషాలు ముందే చేరుకోవాలి. దారిలో ఏమైనా అవాంతరాలు ఏర్పడితే నిర్ణీత సమయంలో పరీక్షా కేంద్రానికి చేరుకోలేక బాధపడాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. అందువల్ల ముందుగానే వెళ్లడం ఉత్తమం.

Updated Date - 2020-03-04T08:58:22+05:30 IST