హెక్టారుకు రూ.15వేలు ఇవ్వాలి

ABN , First Publish Date - 2020-12-07T05:57:28+05:30 IST

నివర్‌ తుఫాన్‌ వల్ల నష్టపోయిన రైతులకు ఎకరానికి రూ.15 వేలు చొప్పున ఇన్‌పుట్‌ సబ్సిడీ ఇవ్వాలని రైతు సమాఖ్య రాష్ట్ర అధ్యక్షుడు యెర్నేని నాగేంద్రనాథ్‌ డిమాండ్‌ చేశారు.

హెక్టారుకు రూ.15వేలు ఇవ్వాలి
వివిధ సంఘాల నాయకులతో నాగేంద్రనాథ్‌

  అమలాపురం టౌన్‌, డిసెంబరు 6: నివర్‌ తుఫాన్‌ వల్ల నష్టపోయిన రైతులకు ఎకరానికి రూ.15 వేలు చొప్పున ఇన్‌పుట్‌ సబ్సిడీ ఇవ్వాలని    రైతు సమాఖ్య రాష్ట్ర అధ్యక్షుడు యెర్నేని నాగేంద్రనాథ్‌ డిమాండ్‌ చేశారు. గత సీజన్‌లో ఎకరాకు 36 బస్తాల దిగుబడి వస్తే ప్రస్తుతం కోనసీమ తదితర ప్రాంతాల్లో 10 నుంచి 15 బస్తాల ధాన్యానికి దిగుబడి  తగ్గిపోయిందన్నారు. నేటికీ పంట చేలల్లో ముంపునీరు దిగక రైతులు చేలను దున్నేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. అమలాపురం శెట్టిబలిజ గ్రంథాలయంలో ఆదివారం భారత్‌ కిసాన్‌ సంఘర్షణ కోఆర్డినేషన్‌ కమిటీ ప్రతినిధుల సమావేశం జరిగింది. ఈ సందర్భంగా నాగేంద్రనాథ్‌ మాట్లాడుతూ ప్రభుత్వం మార్చి 31 వరకు మాత్రమే కాల్వలకు నీటిని విడుదల చేస్తామని ప్రకటించారని అయితే రైతుల ప్రస్తుత పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని మరో నెల రోజుల పాటు కాల్వలకు అదనంగా నీటిని విడుదల చేయాలని డిమాండ్‌ చేశారు. వ్యవసాయ నల్ల చట్టాల రద్దుకు ఢిల్లీలో ఆందోళన చేస్తున్న రైతులకు మద్దతుగా ఈ నెల 8న భారత్‌కిసాన్‌ సంఘర్షణ సమితి ఆధ్వర్యంలో 500 రైతు సంఘాలతో చేపట్టిన భారత్‌ బంద్‌ను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. యాళ్ల బ్రహ్మానందం, అయితాబత్తుల ఉమామహేశ్వరరావు, కుడుపూడి సూర్యనారాయణరావు, వాసంశెట్టి సత్యం, కె.సత్తిబాబు, కారెం వెంకటేశ్వరరావు, అయితాబత్తుల సుభాషిణి, రేవు తిరుపతిరావు, పచ్చిమాల వసంతకుమార్‌, అడపా సత్యనారాయణ, జి.దైవకృప పాల్గొన్నారు. 

 

Updated Date - 2020-12-07T05:57:28+05:30 IST