ఉధృతంగా సుద్దగడ్డ వరద

ABN , First Publish Date - 2020-10-08T06:18:04+05:30 IST

సుద్దగడ్డ వరద ఉధృతి కొనసాగుతోంది. ఎగువ ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో సుద్దగడ్డ(కొండ)కాలువకు భారీగా నీరు వచ్చి చేరుతోంది...

ఉధృతంగా సుద్దగడ్డ వరద

గొల్లప్రోలు-తాటిపర్తి రహదారిపై నీరు


గొల్లప్రోలు, అక్టోబరు 7: సుద్దగడ్డ వరద ఉధృతి కొనసాగుతోంది. ఎగువ ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో సుద్దగడ్డ(కొండ)కాలువకు భారీగా నీరు వచ్చి చేరుతోంది. వరద నీటితో కాలువ పొంగిపొర్లి ప్రవహిస్తుండటంతో గొల్లప్రోలు, తాటిపర్తి తదితర ప్రాంతాల్లో వరి, ప్రత్తి, కాయగూరలు తదితర పంట పొలాలు ముంపునకు గురయ్యాయి. బుధవారం ఉధృతి అధికంగా ఉండటం, మూడు అడుగుల ఎత్తున వరద నీరు ప్రవహిస్తుండటంతో గొల్లప్రోలు-తాటిపర్తి పంచాయతీరాజ్‌ రహదారిపై వాహనాల రాకపోకలు నిలిపివేశారు. సుద్దగడ్డ వరద ఉధృతి పెరుగుతుండడం గొల్లప్రోలు కాలనీవాసులను అందోళనకు గురిచేస్తుంది. మరోవైపు ఏలేరు వరద ఉధృతి కొనసాగుతోంది. రిజర్వాయర్‌ నుం చి 5,100 క్యూసెక్కుల వరద నీటిని కాలువలకు విడుదల చేస్తున్నారు. గొల్లప్రోలు-పిఠాపురం మధ్య పంటపొలాలు ముంపులోనే ఉన్నాయి. గండ్లు నుంచి వరద నీరు పొలాల మీదుగా ప్రవహిస్తోంది.


రాకపోకలకు అంతరాయం

ప్రత్తిపాడు, అక్టోబరు 7: ప్రత్తిపాడు, లంపకలోవ గ్రామాల మధ్య ప్రవహించే సుద్దగడ్డ వాగు ఉధృతి కొనసాగుతోంది. బుధవారం కూడా వాగు తీవ్ర స్థాయిలో పొంగిప్రవహించడంతో వాగులో మంగళవారం కొట్టుకుపోయిన లారీని బయటకు తరలించే ఏర్పాట్లు చేపట్టలేదు. సుద్దగడ్డ ప్రమాదకర స్థాయిలో ప్రవహిస్తుండటంతో మండలంలోని 10 గ్రామాలకు పైబడి రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. ప్రత్తిపాడు, లంపకలోవ మార్గం ఆపివేయడంతో మండలంలోని గ్రామాల ప్రజలకు ఉత్తరకంచి, రాచపల్లి మార్గమే ప్రత్యామ్నాయంగా మారింది.

Updated Date - 2020-10-08T06:18:04+05:30 IST