రాజమండ్రి ఘటన అమానుషం : హర్ష కుమార్

ABN , First Publish Date - 2020-07-20T21:15:38+05:30 IST

తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరంలో 16ఏళ్ల బాలికపై కొందరు కామాంధులు

రాజమండ్రి ఘటన అమానుషం : హర్ష కుమార్

రాజమండ్రి : తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరంలో 16ఏళ్ల బాలికపై కొందరు కామాంధులు సామూహిక అత్యాచారానికి ఒడిగట్టిన ఘటన సంచలనమైన విషయం తెలిసిందే. ఈ ఘటనపై బాధిత కుటుంబానికి న్యాయం చేయాలని ఇప్పటికే పలువురు రాజకీయ నేతలు మీడియా ముందుకొచ్చి డిమాండ్ చేశారు. తాజాగా మాజీ ఎంపీ హర్ష కుమార్ మీడియా మీట్ నిర్వహించారు. బాలికకు మత్తు మందిచ్చి 10 మంది నిందితులు అత్యంత కిరాతకంగా నాలుగు రోజులు పాటు అత్యాచారం చేయటం అమానుషం అని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. బాలికను నిందితులు కోరుకొండ స్టేషన్ వద్ద విడిచిపెట్టినా పోలీసులు నిర్లక్ష్యంగా వ్యవహరించారని ఆయన మండిపడ్డారు.


నిందితులను కాపాడేందుకు పోలీసులు బాలిక పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరించారని ఆయన ఆరోపించారు. బాలికను జిల్లా కలెక్టర్ గాని, ఎస్పీ గాని పరామర్శించిక పోవటం దురదృష్టకరమన్నారు. బాలిక దళిత సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి కాబట్టి అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని ఆయన విమర్శించారు. తక్షణమే ప్రభుత్వం నుంచి అందజేయాల్సిన 8.50 లక్షలు బాలికకు ఇవ్వాలని హర్షకుమార్ డిమాండ్ చేశారు. మానవతా దృక్పథంతో బాలికకు న్యాయం జరిగేందుకు సహకరించాలని పోలీసులను మాజీ ఎంపీ కోరారు.

Updated Date - 2020-07-20T21:15:38+05:30 IST