-
-
Home » Andhra Pradesh » East Godavari » enquiry sub collector lands
-
తప్పుడు ‘ఆన్‌లైన్’పై విచారణకు ఆదేశం
ABN , First Publish Date - 2020-12-19T05:58:02+05:30 IST
ఉప్పలగుప్తం తహశీల్దార్ కార్యాలయ కేంద్రంగా లేని భూములను ఆన్‌లైన్‌లో నమోదు చేసిన వ్యవహారంపై అమలాపురం సబ్‌కలెక్టర్ హిమాన్షుకౌశిక్ విచారణకు ఆదేశించారు.

సబ్‌కలెక్టర్ హిమాన్షుకౌశిక్
అమలాపురం, డిసెంబరు 18(ఆంధ్రజ్యోతి): ఉప్పలగుప్తం తహశీల్దార్ కార్యాలయ కేంద్రంగా లేని భూములను ఆన్‌లైన్‌లో నమోదు చేసిన వ్యవహారంపై అమలాపురం సబ్‌కలెక్టర్ హిమాన్షుకౌశిక్ విచారణకు ఆదేశించారు. ఈ నెల 11వ తేదీన ఆంధ్రజ్యోతిలో ‘లేని భూములకు ఆన్‌లైన్’ శీర్షికన ప్రచురితమైన వార్తా కథనంపై పూర్తిస్థాయిలో విచారణ జరిపి నివేదికను అందించాలని కోరుతూ ఈ నెల 14వ తేదీన సబ్‌కలెక్టర్ ఉత్తర్వులు జారీ చేశారు. ఉప్పలగుప్తం తహశీల్దార్ కార్యాలయ కేంద్రంగా రెవెన్యూ రికార్డుల్లో సుమారు 30 ఎకరాలు లేని భూములకు వివిధ సర్వే నంబర్ల పేరుతో ఉప్పలగుప్తం, ఎన్.కొత్తపల్లి గ్రామాల్లో మోటూరి బలరామమూర్తి కుటుంబీకుల పేరున ఆన్‌లైన్ చేశారు. ఈ వ్యవహారంలో ఆనాటి ఉద్యోగులు కీలక పాత్ర వహించారు. ముఖ్యంగా ఆయా గ్రామాలకు చెందిన వీఆర్వోలు, తహశీల్దార్ కార్యాలయంలో పనిచేసిన సాంకేతిక సిబ్బంది భారీగా ముడుపులు తీసుకుని ఈ అక్రమానికి ఒడిగట్టినట్టు ఆరోపణ. దీనిపై తక్షణం విచారణ జరిపి నివేదిక ఇవ్వాలని సబ్‌కలెక్టర్ హిమాన్షుకౌశిక్ ఉప్పలగుప్తం తహశీల్దార్‌ను ఆదేశిస్తూ ఉత్తర్వులు జారీచేశారు. దీనిపై ఉప్పలగుప్తం తహశీల్దార్ విచారణ చేపట్టి బాధ్యులను గుర్తించి నివేదిక సమర్పించాల్సి ఉంది.