‘హద్దు’ మీరి...
ABN , First Publish Date - 2020-03-02T11:00:12+05:30 IST
‘హద్దు’ మీరి...

కాకినాడలో పెరిగిన భవనాల అక్రమ నిర్మాణాలు
ఇరుకు సందుల్లోనూ బహుళ అంతస్తులు
టౌన్ ప్లానింగ్ సిబ్బంది పరోక్ష పాత్ర
‘స్పందన’లో ఫిర్యాదులతో రంగంలోకి ఏసీబీ అధికారులు
పలు లోపాలు, అవకతవకల గుర్తింపు
(ఆంధ్రజ్యోతి, కాకినాడ)
కాకినాడ సాంబమూర్తినగర్ రెవెన్యూ కాలనీలో చిన్న ఇరుకు సందు ఉంది. ఇక్కడ గత పది నెలలుగా జీ+5 భవన నిర్మాణం జరుగుతోంది. దీనికున్న అనుమతి జీ+2. కానీ జీ+4 నిర్మాణం చేస్తున్నారు. సెట్‌బ్యాక్స్, పార్కింగ్ ప్రదేశం విడిచిపెట్టలేదు. దీనిపై ‘స్పందన’లో చేసిన ఫిర్యాదులను టౌన్ ప్లానింగ్ విభాగం బుట్టదాఖలు చేసిందనే ఆరోపణలు వ్యక్తమవుతున్నాయి. ఈ క్రమంలోనే ఏసీబీ అధికారులు ఈ భవనాన్ని పరిశీలించారు. ప్లాన్‌లో చూపిన కొలతలు, నిర్మాణం లో ఉన్న కొలతలకు సంబంధం లేకపోవడాన్ని గుర్తించారు. ఇదే ప్రాంతంలో అయోధ్యనగర్‌లో నిర్మాణంలో ఉన్న మరో భవనం కొలతల్లో అక్రమాలు గుర్తించారు. కట్టడం నిర్మాణం జీ+5 స్టేజీలో ఉంది. భవనానికి నాలుగువైపులా కనీసం ఐదు అడుగుల స్థలాన్ని కూడా వదలకుండా నిర్మాణం సాగిస్తున్న వైనాన్ని తీవ్రంగా పరిగణించారు. రోడ్డు ఫేసింగ్ నుంచి భవంతి లోపలికి వెళ్లడానికి అడుగు స్థలం లేదు. దీని ముందు నగరపాలక సంస్థ డ్రైనేజీ నిర్మిస్తోంది. దీనిపై నుంచి స్లోప్ వేస్తేనే గానీ లోపలికి వెళ్లలేని పరిస్థితి. కాని ఎంతో ధైర్యంగా అనధికారికంగా ఈ నిర్మాణాన్ని చేస్తుం డడంపై టౌన్ ప్లానింగ్ విభాగానికి ఫిర్యాదులు వెళ్లాయి. కానీ ఎవరు పట్టించుకోకపోవడంతో దర్జాగా నిర్మాణం దర్జాగా సాగిపోతోంది. సూర్యారావుపేట లచ్చిరాజు వీధిలో జీ+1 భవంతి కట్టే స్థలంలో జీ+3 నిర్మాణం జరుగుతుంది. దీన్ని ఏసీబీ అధికారులు తనిఖీ చేయలేదు. భవనానికి సెట్ బ్యాక్‌లు విడిచిపెట్టలేదు. ఈ నిర్మాణం పక్కనే చిన్న చిన్న భవనాలు వున్నాయి. ఎటువంటి అగ్ని ప్రమాదాలు సంభవించినా ఎటూ వెళ్లలేని రీతిలో దీని నిర్మాణం జరుగుతోంది.
ఎన్నో లోపాలు: కాకినాడ నగర ప్రణాళిక విభాగంపై వస్తున్న ఆరోపణలపై ఇటీవల ఏసీబీ అధికారులు చేసిన తనిఖీల్లో పలు లోపాలు వెలుగు చూశాయి. ఈ క్రమంలో భవనాల నిర్మాణ ప్లాన్‌లను, క్షేత్రస్థాయిలో కట్టడాల తీరును నిశితంగా పరిశీలించారు. అయితే బిల్డింగ్ పీనలైజేషన్ స్కీమ్ (బీపీఎస్) ద్వారా సదరు కట్టడాలను క్రమ బద్ధీకరించుకోవచ్చనే ఉద్దేశ్యంతో కొందరు నిర్మా ణాల్లో ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారు. సంబంధిత అధికారులు కాసులకు కక్కుర్తిపడి చూసీ చూడనట్టు వ్యవ హరిస్తున్నారనే ఆరోపణలు వెల్లువెత్తు తున్నాయి. తాజాగా ఇటీవల ఏసీబీ తనిఖీల్లో టౌన్ ప్లానింగ్ విభాగం లాగిన్‌లో కొన్ని రోజులుగా కదలకుండా ఉన్న భవనాల నిర్మాణ అనుమతులు, బీపీఎస్ దరఖాస్తులను గుర్తిం చారని తెలుస్తోంది.
క్షేత్రస్థాయి పరిశీలన శూన్యం: బహుళ అంతస్తుల కట్టడాల నిర్మాణ తీరు తీన్నులపై టౌన్ ప్లానింగ్ విభా గాధికారులు క్షేత్రస్థాయిలో పరిశీలించడం లేదని తెలు స్తోంది. పరిశీలించినా యజమానులు ఇచ్చే సొమ్ముతో వెనక్కు వెళ్లిపోతున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. పైగా యజమానులకు ఉచిత సలహా ఇస్తున్నారని విని కిడి. కట్టడం నిర్మాణానికి, ప్లాన్‌లో ఉన్న కొలతలకు పొంతన లేదని, బీపీఎస్‌లో క్రమబద్ధీకరించు కోవాల్సిం దిగా సూచిస్తున్నారని సమాచారం. దీంతో అనధికారిక కట్టడ నిర్మాణదారులు పేట్రేగి పోతున్నారు. రహదారి వెడల్పు కనీసం 30 అడుగుల నిబంధన ఉల్లంఘించి నిర్మాణాలు జరుగుతున్నా ఆపలేని పరిస్థితి నెలకొంది. సెట్‌బ్యాక్స్ కూడా విడిచిపెట్టకుండా ప్రధాన రహదారుల్లో మాస్టర్ ప్లాన్‌కు విరుద్ధంగా నిర్మాణాలు జరుగుతున్నాయి. ఆంధ్రప్రదేశ్ డవలప్‌మెంట్ మేనేజ్‌మెంట్ సిస్టమ్ (ఏపీడీపీ ఎంఎస్) ఇచ్చిన అనుమతులకు అనుగుణంగా నిర్మాణాలు చేస్తున్న వరకు ఏస్థాయిలో కూడా పర్యవేక్షణ ఉండడం లేదు. దీంతో ఎవరికి నచ్చినట్టు వారు నిర్మా ణాలు చేస్తున్నారు. ఎవరికి ఎంత ఇవ్వాలో వారికిచ్చేశాం, తమను అడిగేవారు ఎవరు ఉండరనే ధీమాతో నిర్మాణ దారులు పని కానిచ్చేస్తున్నారు.
కొరవడిన స్పష్టత :
అనుమతులు లేకుండా ప్రభుత్వ, దేవదాయ శాఖ భూములను ఆక్రమించి కొన్ని చోట్ల నిర్మాణాలు జరుగు తున్నాయి. ఇటువంటి వాటిని అధికారులు గుర్తించి, అనధికారిక కట్టడంగా (యూసీ) రెట్టింపు పన్ను విధిం చాలి. ఇటువంటి నిర్మాణాల సంఖ్యపై టౌన్ ప్లానింగ్ విభాగాల్లో స్పష్టత కొరవడింది. పాత భవనాలకు ఎటువంటి అనుమతీ తీసుకోకుండానే వాణిజ్య సముదా యాలుగా మార్పు చేస్తున్నా పట్టించుకోవడం లేదు. ఏసీబీ అధికారులు కూడా బీపీఎస్, లాండ్ రెగ్యులరైజేషన్ స్కీం (ఎల్‌ఆర్‌ఎస్), అక్రమణల పన్ను, ప్రకటనలపై పన్ను ఆరా తీసినట్టు సమాచారం.