లబ్ధిదారులెక్కువ.. స్థలం తక్కువ
ABN , First Publish Date - 2020-03-02T10:55:36+05:30 IST
లబ్ధిదారులెక్కువ.. స్థలం తక్కువ

నేడు సాల్టు భూముల పరిశీలనకు అధికారుల రాక
కాకినాడ సిటీ, మార్చి 1: కాకినాడలో ఇళ్ల పట్టాల కోసం నమోదు చేసుకున్న వారు అధికంగా ఉన్నారు. వారికి కేటాయించాల్సిన స్థలం ఆ స్థాయిలో లేదు. ప్రభుత్వం భూమి కొరత ఏర్పడింది. దీంతో అధికారులు, ప్రజాప్రతినిధులు భూమికోసం తర్జనభర్జనలు పడుతున్నారని పలువురు అంటున్నారు. ఉగాదికి ఇళ్ళ పట్టాలను ఇచ్చి అర్హులకు గృహాలను నిర్మించాలనేది ప్రభుత్వం ఆలోచన. జిల్లా వ్యాప్తంగా ఇళ్ళ పట్టాల పంపిణీ కార్యక్రమాన్ని విజయవంతం చేసేందుకు ఇప్పటికే అధికారులు చర్యలు చేపట్టారు. రాష్ట్రవ్యాప్తంగా ఉగాదికి ఇళ్ళ పట్టాలను అందించే కార్యక్రమాన్ని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహనరెడ్డి కాకినాడ నుంచే ప్రారంభించనున్నారు. దీంతో ఇక్కడ లబ్ధిదారులకు ఇళ్ళ స్థలాల కేటాయింపులకు ప్రాధాన్యం ఏర్పడింది.
లబ్ధిదారులు 33,775 మంది
కాకినాడలో ఇళ్ళ స్థలాలకోసం దరఖాస్తు చేసుకున్న వారి సంఖ్య అధికారిక లెక్కల ప్రకారం 33,775 మంది ఉన్నారు. గ్రామీణ ప్రాంతాల్లో ఎకరానికి 60 మందిని ఎంపికచేసి వ్యక్తిగతంగా స్థలాన్ని ఇవ్వనున్నారు. అర్బన్ ప్రాంతాల్లో ఎకరానికి 40 మంది చొప్పున జీప్లస్ విధానంలో ఇళ్ళ నిర్మాణాలు చేపడుతున్నారు. నగరంలో ఉన్న అర్హులకు అవరసమైన స్థలం ఇక్కడ ప్రస్తుతానికి సమకూరలేదని అధికారులు చెబుతున్నారు. వ్యక్తిగతంగా ఇళ్ళ స్థలాలు ఇచ్చే పరిస్థితి అస్సలు లేకున్నా.. జీప్లస్ విధానంలోనైనా పట్టాలను అందజేసేందుకు అధికారులు భూమిని సేకరించే పనిలో ఉన్టట్టు తెలుస్తోంది.
అవసరమైన భూమి 465 ఎకరాలు
నగరంలో నమోదైన అర్హులకు 465 ఎకరాల భూమి అవసరమని అధికారులు లెక్కల్లో చూపించారు. ప్రస్తుతం 110 ఎకరాలను సేకరించినట్లు చెబుతున్నారు. వాస్తవానికి కాకినాడ పోర్టు భూమి 116 ఎకరాలు, 170 ఎకరాలు సాల్టు భూమిని సేకరించామని చెబుతున్నారు. కానీ దానిపై స్పష్టతలేదని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. సాల్టు భూమి 170 ఎకరాల సేకరణలో భాగంగా ఏటిమొగలో 90 ఎకరాలను చూశామని, మరో 80 ఎకరాలు ఏ ప్రాంతంలో సాల్టు భూమిని సేకరిస్తున్నారో స్పష్టత కొరవడింది. అయితే సాల్టు భూమి 170 ఎకరాలను ఇళ్ళ స్థలాలకు ఇచ్చేందుకు సంబంధిత అధికారులు అంగీకరించినట్లు అధికారులు చెబుతున్నారు. దీనికోసం సోమవారం సాల్టు కమిషన్ అధికారులు కాకినాడకు వస్తున్నట్లు చెబుతున్నారు. దీంతో ఆ భూమి ఎక్కడ కేటాయిస్తున్నారో స్పష్టత వచ్చే అవకాశం ఉంది. సాల్టు భూమి 170 ఎకరాలను కేటాయించినా, జీప్లస్ విధానంలో వెళ్ళినా అధిక సంఖ్యలో దరఖాస్తు చేసుకుని అర్హత ఉన్నవారికి ప్రస్తుతం ఉన్న భూమి కంటే ఎక్కువ అవసరం ఉంటుంది. దానికోసం తీవ్రంగా యత్నిస్తున్నట్లు ఆర్డీవో చిన్నకృష్ణ చెబుతున్నారు.