డ్రెడ్జింగ్కు రెడీ!
ABN , First Publish Date - 2020-12-05T07:10:42+05:30 IST
గోదాట్లో ఇసుక మేటలు డ్రెడ్జింగ్ చేయడానికి ప్రభుత్వం నిర్ణయించింది.

- గోదాట్లో ఇసుక తవ్వకాలకు బాతిమెట్రిక్ సర్వే
- రూ.75 లక్షల వ్యయంతో టెండర్
- కనీసం రెండు నెలలు పడుతుందంటున్న అధికారులు
- కొత్తపాలసీ అమలయ్యేదాకా పాత ఇసుక విధానమే
- స్టాక్ పాయింట్లు మాత్రం ఎత్తివేత
- మరికొద్దిరోజులపాటు పట్టా భూములకు అనుమతి
- ప్రభుత్వ ఉత్తర్వులు జారీ
(రాజమహేంద్రవరం-ఆంధ్రజ్యోతి)
గోదాట్లో ఇసుక మేటలు డ్రెడ్జింగ్ చేయడానికి ప్రభుత్వం నిర్ణయించింది. అఖండ గోదావరిలో 75 లక్షల క్యూబిక్ మీటర్ల నుంచి కోటి క్యూబిక్ మీటర్ల వరకూ ఇసుక ఉండవచ్చని అధికారుల ప్రాథమిక అంచనా. ధవళేశ్వరం బ్యారేజీ నుంచి పోలవరం ప్రాజెక్టు దిగువ వరకూ ఇసుక డ్రెడ్జింగ్ చేయడానికి వీలున్న ప్రాంతంలో ఇసుక డ్రెడ్జింగ్కు అనుకూలత, ప్రతికూలతలు గుర్తించడానికి బాతిమెట్రిక్ సర్వే చేయనున్నారు. ఇప్పటికే ఒకసారి టెండర్ పిలవగా ఎవరూ ముందుకు రాలేదు. రూ.75 లక్షల అంచనా తో రెండోసారి టెండరు పిలిచారు. త్వరలో ఖరారు కావచ్చని అధికారుల కథనం. టెండరు ఖరారైతే అఖండ గోదావరిలో పడవ మీద పయనిస్తూ గోదావరి లోతును గుర్తిస్తారు. నీరు ఎంత లోతు ఉంది, అక్కడ ఇసుక మేటలు ఏమేరకు ఉన్నాయి, అవి తొలగించడానికి వీలు ఉందా లేదా అనే విషయాల ను గుర్తిస్తారు. కానీ గతంలో డ్రెడ్జింగ్ను గ్రీన్ ట్రిబ్యునల్ వ్యతిరేకించింది. ఇటీవల డ్రెడ్జింగ్కు గ్రీన్ ట్రిబ్యునల్ కూడా అనుమతి ఇచ్చినట్టు ప్రచారం జరుగుతోంది. కానీ డ్రెడ్జింగ్ వల్ల పర్యావరణ సమతుల్యత దెబ్బతింటుందని, చేపలతోపాటు ఇతర జీవరాశులు నశిస్తాయనే వాదన ఉంది. కానీ మేటలు తొలగిస్తే బ్యారేజీ ఎగువన నీటి నిల్వ సామర్థ్యం పెరుగుతుందనేది ప్రభుత్వ వాదన. దీంతో ఇసుక డ్రెడ్జింగ్కే ప్రభుత్వం నిర్ణయించింది. అందుకే బాతిమెట్రిక్ సర్వేకు ఏపీఎండీసీ ద్వారా ఇప్పటికే రూ.75 లక్షలు ఇచ్చింది. కానీ ఈ సర్వే పూర్తయి డ్రెడ్జింగ్ మొదలయ్యేసరికి రెండు నుంచి మూడు నెలలు పట్టవచ్చని అధికారులు చెబుతున్నారు. ఎక్కువ సమయం పట్టకుండా ఒకే టెండరు కాకుండా ఎక్కువ విభాగాలుగా చేసి టెండర్లు పిలిస్తే త్వరగా పూర్తవుతుందని జిల్లా కలెక్టర్ మురళీధరరెడ్డి సూచించినట్టు సమాచారం. కానీ ఇరిగేషన్ అధికారులు ఈ సర్వే ఒకే సంస్థ ద్వారా చేయించడమే మేలు అని చెబుతున్నట్టు తెలిసింది. బహుశా శీతాకాలం పూర్తయ్యేసరికి ఈ సర్వే పూర్తికావచ్చు. అప్పుడు గోదాట్లో నీరు కూడా తగ్గుతుంది. ఇసుక కూడా ఇష్టానుసారం తవ్వేసుకోవచ్చు. ఇప్పటికే రెండు జిల్లాల నుంచి అఖండగోదావరిలో వందలాది పడవలతో ఇసుక తవ్వేస్తున్న సంగతి తెలిసిందే. డ్రెడ్జింగ్ అయితే చాలా వేగంగా ఇసుక తవ్వేయవచ్చనేది ప్రభుత్వ అంచనా.
- పాత ఇసుక విధానం కొనసాగింపు
ఇసుక కొత్త విధానానికి ప్రభుత్వ ఆమోదం తెలిపినప్పటికీ అమలు చేయడంలో కొంత జాప్యం జరుగుతోంది. బహుశా జనవరి 1నుంచి అమలు చేయవచ్చనే సమాచారం ఉంది. కానీ దీనిపై అధికారికంగా స్పష్టత రావలసి ఉంది. అప్పటివరకూ పాత విధానమే అంటే ప్రస్తుతం అమలులో ఉన్నవిధానమే కొనసాగుతోంది. కానీ స్టాక్పాయింట్లను పూర్తిగా ఎత్తివేయనున్నారు. కానీ కొత్తవిధానం అమలులోకి వచ్చేవరకూ పట్టా భూముల్లో కూడా ఇసుక తీసుకోవచ్చని అధికారులు చెబుతున్నారు. ఇప్పటికే సింగవరం, కోటిపల్లి ర్యాంపుల్లో పట్టా భూములకు అనుమతి ఇచ్చారు. కోరుమిల్లి, పులిదిండి, తాటిపూడి, అంకం పాలెం, ఊబలంక, జొన్నాడ ఓపెన్ రీచ్లకు కూడా అనుమతిచ్చారు. ఇవికాక గతంలో అనుమతి పొంది న మరికొన్ని ర్యాంపులు ఉన్నాయి. జిల్లాలో ప్రస్తుతం 40 ర్యాంపులను కొత్తగా ప్రతిపాదించి ఈసీ అనుమతికి పంపారు. మరో 20 ర్యాంపులను సిద్ధం చేస్తున్నారు. కొత్త విధానంలో మొత్తం ర్యాంపులను ఒక సంస్థకే అప్పగిస్తారనే ప్రచారం ఉంది. ఇసుక కోసం సచివాలయాల్లో కూడా ఇసుక బుకింగ్ జరుగుతోంది. కానీ రేట్లు అధికంగా పెంచేసినట్టు చెబుతున్నారు.