వరకట్న దాహానికి వివాహిత మృతి

ABN , First Publish Date - 2020-12-15T06:55:02+05:30 IST

వరకట్న వేధింపుల కారణంగా ఓ యువతి అనుమానాస్పద స్థితిలో మృతి చెందింది. కట్నం కోసం కొంతకాలంగా వేధిస్తున్న భర్త, అత్తమామలే తమ కుమార్తెను చంపేశారని తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు.

వరకట్న దాహానికి వివాహిత మృతి

భర్త, అత్తింటివారి వేధింపులే కారణమంటూ

బంధువుల ఆరోపణ 

కాకినాడ క్రైం, డిసెంబరు 14: వరకట్న వేధింపుల కారణంగా ఓ యువతి అనుమానాస్పద స్థితిలో మృతి చెందింది.  కట్నం కోసం కొంతకాలంగా వేధిస్తున్న భర్త, అత్తమామలే తమ కుమార్తెను చంపేశారని తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు.  రాజానగరం మండలం దివాన్‌చెరువుకు చెందిన అంకం గోవిందరాజు, అచ్యుతాంబ దంపతుల ఏకైక సంతానం రమ్యశ్రీ (24)ను కాకినాడ పల్లంరాజునగర్‌ పవన్‌గార్డెన్స్‌కు చెందిన మందాల వెంకటేష్‌కు ఇచ్చి 2018 ఆగస్టు 19న అంగరంగ వైభవంగా  వివాహం జరిపించారు. వెంకటేష్‌ హైదరాబాద్‌లో సాఫ్ట్‌వేర్‌ ఇంజనీర్‌గా పని చేస్తున్నాడని, నెలకు రూ.2 లక్షల జీతం అని తల్లిదండ్రులు చెప్పడంతో కట్నంగా రూ. 50 లక్షలు ఇచ్చేందుకు రమ్యశ్రీ తల్లిదండ్రులు  నిర్ణయించారు. వివాహం జరిగిన రెండేళ్లకు కట్నం సొమ్ము అందించేందుకు అంగీకరించి వివాహం జరిపించారు. పెళ్లి సమయాన పెళ్లికొడుక్కి 8 కాసుల బంగారం, రమ్యశ్రీకి 40 కాసుల బంగారం బహూకరించారు. ఏడాది పాటు సవ్యంగా సాగిన కాపురంలో కలతలు రేగాయి. 2019 నవంబరు 16న వీరికి పాప జన్మించింది.  భర్త ఎటువంటి ఉద్యోగం లేకుండా ఖాళీగా ఉండటం, ఈలోపు బిడ్డ పుట్టడంతో రమ్యశ్రీ ఏడాదిపాటు పుట్టింట్లోనే ఉండిపోయింది, కట్నం డబ్బులు ఇస్తేనే కాపురానికి తీసుకెళతామని భర్త, అత్తమామలు చెప్పడంతో నచ్చచెప్పి ఈ ఏడాది అక్టోబరు నెలలో బిడ్డతో రమ్యశ్రీని అత్తారింటికి పంపించారు. రమ్యశ్రీ ఇంటికి వచ్చిన మర్నాడే అత్తమామలు సౌభాగ్యలక్ష్మి, మురళీమోహన్‌ గుంటూరులో ఉన్న చిన్న కుమారుడు వద్దకు వెళ్లిపోయారు. అత్తమామల సూచనలతో పై ప్లాట్‌లో ఉంటున్న చిన్నాన్న కుటుంబం ప్రోత్సాహంతో భర్త వెంకటేష్‌ కట్నం కోసం నిత్యం వేధించడంతో పాటు కొట్టి చిత్రహింసలకు గురి చేసేవాడు. ఈ నేపథ్యంలో రమ్యశ్రీ సోమవారం విగతజీవిగా కనిపించింది. ఫ్యానుకు ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడినట్లు భర్త రమ్యశ్రీ తల్లిదండ్రులకు సమాచారం అందించారు. తమ కుమార్తె ఆత్మహత్య చేసుకుని చనిపోయేంత పిరికిది కాదని, ఫ్యాన్‌కు ఉరేసుకుంటే సోఫాలో విగత జీవిగా ఉండడం ఏమిటని రమ్యశ్రీ తల్లిదండ్రులు అన్నారు. భర్తే హత్యచేసి ఆత్మహత్యగా చిత్రీకరిస్తున్నాడని ఆరోపించారు.  త్రీటౌన్‌ ఇన్‌స్పెక్టర్‌ శ్రీరామ కోటేశ్వరరావు  మృతదేహాన్ని పరిశీలించారు. పోస్ట్‌మార్టం నిమిత్తం జీజీహెచ్‌కు తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ తెలిపారు. 


Updated Date - 2020-12-15T06:55:02+05:30 IST