డబుల్ బొనాంజా
ABN , First Publish Date - 2020-07-19T10:42:04+05:30 IST
ప్రభుత్వ ఉద్యోగులు ఉద్యోగ విర మణ పొందిన తర్వాత వారికి శాఖాపరంగా రావాల్సిన చెల్లింపులు నయా పైసాతో జమా కట్టి

ఒకే ఫిట్‌మెంట్ ఏరియర్స్ రెండు సార్లు
రూ. 5 లక్షలకు బదులు రూ.11 లక్షలు మంజూరు
ఐటీ రిటర్న్ దాఖలులో బయటపడిన విషయం
అదనంగా వచ్చిన నగదును లెక్చరర్‌తో కట్టించి తప్పిదాన్ని కళాశాల యాజమాన్యం, ట్రెజరీ సిబ్బంది కప్పిపుచ్చే ప్రయత్నం
కాకినాడ (ఆంధ్రజ్యోతి) : ప్రభుత్వ ఉద్యోగులు ఉద్యోగ విర మణ పొందిన తర్వాత వారికి శాఖాపరంగా రావాల్సిన చెల్లింపులు నయా పైసాతో జమా కట్టి అధికారులు చెల్లిస్తారు. అలాగే వివిధ రూపాల్లో వారికి ఇవ్వాల్సిన మొత్తాన్ని విడతల వారీ చెల్లిస్తుంటా రనేది తెలిసిందే. ఇది రిటైరయిన ఉద్యోగులకు రొటీన్‌గా నిర్వ హించే ప్రక్రియ. కానీ రొటీన్‌కు భిన్నంగా సర్వీస్‌లో ఉన్న ఓ ఉద్యోగికి ఫిట్‌మెంట్‌కు సంబంధించిన ఏరియర్స్ మొత్తాన్ని రెండు సార్లు ఇచ్చి ఓ కళాశాల యాజమాన్యం, ట్రెజరీ సిబ్బంది త ప్పులో కాలేశారు.
తర్వాత వీరు విషయం తెలుసుకుని లెక్చరర్‌ను బుజ్జ గించి, జరిగిన తప్పును సరిదిద్దుకున్నారు. తదనుగుణంగా అద నంగా చెల్లించిన నగదును ఉద్యోగి జీపీఎఫ్ నుంచి లోన్ ఇప్పించి తిరిగి కట్టించుకున్నారు. ఇంతకూ ఏమి జరిగిందంటే.. తుని ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో పనిచేస్తున్న ఓ లెక్చరర్ స్టేట్ స్కేల్ నుంచి యూజీసీ స్కేల్‌కు మారారు. దీంతో అతనికి ఫిట్‌మెంట్ రూపంలో ప్రభుత్వం నుంచి రావాల్సిన ఏరియర్స్ వాస్తవంగా రూ. 5.8 లక్షలు. దీనికి సంబంధించి కళాశాల సిబ్బంది 2012 ఫిబ్రవరి లో బిల్లు తయారు చేసి ట్రెజరీకి పంపడానికి ఫైల్ సిద్ధం చేశారు. కానీ ఆ బిల్లు ప్రతిపాదనలను కళాశాల ప్రిన్సిపాల్, డ్రాయింగ్ డిస్బర్సింగ్ ఆఫీసర్ (డీడీవో) అనుమతికి సమర్పించలేదు. మళ్లీ నెల తర్వాత మరో బిల్లు రెడీ చేశారు. ఆ బిల్లు మొత్తం ఈసారి కాస్త పెరిగింది. రూ.5.64 లక్షలకు చేరింది.
అయితే ఏదో ఒక బిల్లుపై డీడీవో సంతకం చేసి ట్రెజరీకి పంపాలి. కానీ రూ.5.8 లక్షలు, రూ.5.64 లక్షల రెండు బిల్లులను 2015 ఏప్రిల్‌న డీడీవో సంతకాలతో ట్రెజరీలో సమర్పించారు. ట్రెజరీ సిబ్బంది కూడా ఈ రెండు బిల్లుల్లో వ్యత్యాసంగాని, ఒకే వ్యక్తికి సంబంధించి రెండుసార్లు ఫిట్‌మెంట్ ప్రతిపాదనలు ఎందుకు వచ్చాయని గమనించలేదు. రూ. 11.44 లక్షలకు వచ్చిన కాగితాలు మాత్రమే వారికి కనిపించాయి. దీంతో ఈ మొత్తాన్ని మంజూరు చేయడానికి లెక్చరర్‌తో వారు బేరం మాట్లాడుకున్నారు. మూడు శాతం ఇవ్వడానికి లెక్చరర్ అంగీకరిం చాడు. దీంతో ఆయన బ్యాంకు ఖాతాలో ఏపీ సీఎఫ్‌ఎంఎస్ ద్వారా రూ.11.44 లక్షలు 2019, మే 3న జమయ్యాయి. కానీ ఈ లెక్చరర్‌కు డబుల్ బొనాంజా లభించిందనే విషయం తెలియదు. ఈ లెక్చరర్ ఈ ఏడాది ఫిబ్రవరిలో ఏటా తన ఐటీ రిటర్న్ దాఖలులో భాగంగా సంబంధిత ప్రొఫార్మాలో అతని ఆదాయ వివరాలను చూపారు.
ఈ ఏడాది ఫిబ్రవరిలో రిటర్న్ వేశారు. ఇక్కడే బండారం బయటపడింది. కళాశాల ద్వారా రూ. 11.44 లక్షలు లెక్చరర్‌కు ఎలా వచ్చాయని ఐటీ శాఖ నుంచి కళాశాల ప్రిన్సిపాల్‌కు నోటీస్ వెళ్లింది. దీంతో ప్రిన్సిపాల్ సదరు లావాదేవీల నగదు ఫైల్‌ను తనిఖీ చేశారు. దీంతో ఒక ఫిట్‌మెంట్‌ను రెండుసార్లు ట్రెజరీకి పంపారని గుర్తించారు. గండం నుంచి గట్టెక్కడానికి లెక్చరర్‌ను బతిమాలడడం ప్రారంభించారు. లెక్చరర్ అడ్డం తిరిగారు. చివరకు సర్వీస్‌లో ఉన్న ఈ లెక్చరర్ శాం తించి నాకు అదనంగా వచ్చిన రూ. 5.8 లక్షలు ఖర్చయిపోయాయని, ఒకేసారి చెల్లించలేనని, వాయిదాల సౌకర్యం ఇస్తే కడతానని అంగీక రించాడు.
ఇదంతా ఈ ఏడాది మార్చి 15 వరకు ఈ కళాశాలలో తతంగం నడిచింది. తర్వాత లాక్‌డౌన్ ప్రారంభమైంది. చివరకు బాధ్యులైన ట్రెజరీ సిబ్బంది, గుడ్డిగా సంతకం పెట్టిన డీడీవో లెక్చరర్‌ను వారి దారిలోకి తెచ్చుకున్నారు. వాయిదాల ప్రకారం తిరిగి చెల్లిస్తే ఎప్పటికైనా ఇబ్బందేనని, నీ జీపీఎఫ్ నుంచి లోన్ ఇప్పిస్తా మని, వచ్చిన డబ్బును వెంటనే తిరిగి కట్టేయాలని అతన్ని కాళ్లావేళ్లా పడడంతో సర్వీస్‌లో ఉన్న ఆయన అంగీకరించాడు. దీంతో కథ సుఖాంతమైంది. దీనిపై డీటీవో ఏ రాధాకృష్ణ సుబ్రహణ్యశర్మ మాట్లా డుతూ తుని డిగ్రీ కళాశాలకు సంబంధించి అక్కడ సిబ్బంది వేత నాలు, బెనిఫిట్స్ జిల్లా కార్యాలయం కాకినాడకు రావని, లెక్చరర్‌కు రెండుసార్లు ఫిట్‌మెంట్ మంజూరు విషయం కూడా తెలియదని, తగిన ఆధారాలతో సంప్రదిస్తే విచారిస్తామని చెప్పారు.