నామినేషన్‌పై డామినేషన్‌!

ABN , First Publish Date - 2020-03-12T09:03:43+05:30 IST

జడ్పీటీసీ, ఎంపీటీసీ నామినేషన్లకు బుధవారం చివరిరోజు కావడంతో అభ్యర్థులు పెద్ద ఎత్తున నామినేషన్లు దాఖలు చేయడానికి క్యూ కట్టారు.

నామినేషన్‌పై డామినేషన్‌!

చివరిరోజు నామినేషన్ల పర్వంలో రెచ్చిపోయిన వైసీపీ నేతలు

పలుచోట్ల టీడీపీ అభ్యర్థులపై దౌర్జన్యకాండ

ఎస్‌.పైడిపాలలో పోలీసుల సమక్షంలోనే మహిళా అభ్యర్థిపై దాడి

పెద్దాడలో ఎంపీటీసీ అభ్యర్థి కారు అడ్డగింత

తొండంగిలో మరో అభ్యర్థి చేతిలో పత్రాలు చింపివేత

కరపలో హెచ్చరికలతో నామినేషన్‌ వేయలేకపోయిన జనసేన అభ్యర్థి         


(ఆంధ్రజ్యోతి ప్రతినిధి, కాకినాడ)

జడ్పీటీసీ, ఎంపీటీసీ నామినేషన్లకు బుధవారం చివరిరోజు కావడంతో అభ్యర్థులు పెద్ద ఎత్తున నామినేషన్లు దాఖలు చేయడానికి క్యూ కట్టారు. అధికార వైసీపీ నేతలు ఇదే అదనుగా తమ అభ్యర్థుల నామినేషన్లు పూర్తయ్యే వరకు సజావుగా ఉండి ఆ తర్వాత టీడీపీ, జనసేన అభ్యర్థుల నామినేషన్ల వంతు వచ్చేసరికి ఏకంగా రెచ్చిపోయారు. ఎక్కడికక్కడ దౌర్జన్యానికి దిగారు. రౌతులపూడిలో మండల పరిషత్‌ కార్యాలయంలో నామినేషన్ల వద్ద వైసీపీ నేతలు బుధవారం దౌర్జన్యానికి దిగారు. పోలీసుల ఎదుటే వీరంగం సృష్టించారు. రౌతులపూడి మండలం ఎస్‌.పైడిపాల ఎంపీటీసీ స్థానం జనరల్‌కు రిజర్వు అయ్యింది. వైసీపీ నేత రాయి ప్రసాద్‌ కుటుంబ సభ్యులైన అమ్మాజీ, వెంకటలక్ష్మి నామినేషన్‌ వేశారు. అటు మల్లంపేట టీడీపీ నుంచి శీరంరెడ్డి సీతాలక్ష్మి నామినేషన్‌ వేయడానికి మండల పరిషత్‌ కార్యాలయానికి వచ్చింది.


ఆమె రాకనువైసీపీ నేతలు అడ్డుకున్నారు. నామినేషన్‌ వేయకుండా ఎంపీడీవో కార్యాలయం వద్దే అడ్డగించారు. అభ్యర్థితో పాటు ఆమె వెంట వచ్చిన టీడీపీ నేతలపైనా దౌర్జన్యానికి దిగారు. ముఖ్యంగా వైసీపీ నేత రాయి ప్రసాద్‌, అతడి సోదరుడు రాజు తన అనుచరులతో దాడికి దిగారు. టీడీపీ అభ్యర్థి చేతిలో ఉన్న నామినేషన్‌ పత్రాలను బల వంతంగా లాక్కున్నారు.


చివరకు పోలీసుల సమక్షంలోనే చించి పారేశారు. దీంతో ఇరువర్గాల మధ్య ఘర్షణ జరి గింది. తనకు జరిగిన అన్యాయాన్ని టీడీపీ అభ్యర్థి సీతా లక్ష్మి ఎన్నికల అధికారి రమణకు వివరించినా పట్టించు కోలేదు. ఒకానొక దశలో ఎన్నికల అధికారిపైనా వైసీపీ నేతలు దాడికి దిగారు. న్యాయం చేయాలని వేడుకున్న టీడీపీ అభ్యర్థిని బెదిరించి బయటకు పంపేశారు. 


నామినేషన్లు వేయకుండా దౌర్జన్యకాండ

పెదపూడి మండలం పెద్దాడ ఎంపీటీసీ స్థానాన్ని ఎస్సీ మహిళకు కేటాయించారు. దీంతో టీడీపీ తరపున పెద్దాడకు చెందిన భాగ్యలక్ష్మి నామినేషన్‌ వేసేందుకు మాజీ ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డితో కలిసి కారులో బుధవారం పెదపూడి మండల పరిషత్‌ కార్యాలయానికి వెళ్లింది. వీరిని వైసీపీ నేతలు అడ్డుకున్నారు. కార్యాలయం దగ్గర రోడ్డుకు అడ్డంగా బైఠాయించి కారు వెళ్లకుండా చేశారు. తన నామినేషన్‌కు సమయం అవుతోందని, పంపాలని వేడుకున్నా వైసీపీ నేతలు కనికరించలేదు. పోలీసులు అక్కడే ఉన్నా మిన్నకుండిపోయారు. చివరకు చేసేది లేక ప్రపోజ్‌ చేసిన మరో వ్యక్తితో తన నామినేషన్‌ పత్రాలను లోపలకు పంపించారు. 


తుని నియోజకవర్గం తొండంగి మండలంలో టీడీపీ ఎంపీటీసీ అభ్యర్థి నేమాల నూకరాజు నామినేషన్‌ వేయ డానికి ఎంపీడీవో కార్యాలయానికి వెళాడు. వైసీపీ నేత, రాజు ఇతర నేతలు అతడిని అడ్డగించి చేతిలోని నామి నేషన్‌ పత్రాలను లాగేసుకున్నారు. ఒక్కసారిగా మీదపడి దౌర్జన్యం చేశారు. మరికొందరు నేతలు లాక్కున్న పత్రా లను చింపేశారు. దీంతో నూకరాజు నామినేషన్‌ వేయ లేకపోయాడు.  


కరప మండలం నడకుదురు-1 ఎంపీటీసీ అభ్యర్థిగా నామినేషన్‌ వేయడానికి వచ్చిన జనసేన అభ్యర్థి భాస్కర రావును వైసీపీ నేతలు అడ్డుకుని నామినేషన్‌ వేస్తే ఊరు కునేదిలేదని హెచ్చరించారు. వారి బెదిరింపులకు భయప డిన ఆ నేత నామినేషన్‌ వేయకుండా వెనుదిరిగాడు.  


ప్రత్తిపాడు నియోజకవర్గ పరిధిలోని శంఖవరం మండ లంలో మూడు ఎంపీటీసీ స్థానాలకు టీడీపీ అభ్యర్థులు నామినేషన్లు వేయడానికి సిద్ధపడగా అంతు చూస్తామని వైసీపీ ముఖ్య నేతలు పరోక్షంగా హెచ్చరించారు. దీంతో వారు నామినేషన్లు వేయలేకపోయారు. అదేవిధంగా బీజేపీ అభ్యర్థులకు కూడా బెదిరింపులు రావడంతో వారూ నామినేషన్ల వేయలేదు.

Updated Date - 2020-03-12T09:03:43+05:30 IST