కలకలం
ABN , First Publish Date - 2020-12-30T07:19:47+05:30 IST
టన్ నుంచి రాజమహేంద్రవరం వచ్చిన ఆంగ్లో ఇండియన్ మహిళకు కొత్త వైరస్ స్ట్రెయిన్‌గా నిర్ధారణకావడం జిల్లా వాసుల్లో కలకలం రేపుతోంది.

కొత్త వైరస్‌తో జిల్లాలో భయం భయం
ఉలిక్కిపడిన రాజమహేంద్రవరం
రాజమహేంద్రవరం అర్బన్, డిసెంబరు 29 : బ్రిటన్ నుంచి రాజమహేంద్రవరం వచ్చిన ఆంగ్లో ఇండియన్ మహిళకు కొత్త వైరస్ స్ట్రెయిన్‌గా నిర్ధారణకావడం జిల్లా వాసుల్లో కలకలం రేపుతోంది. రాజమహేంద్రవరం ప్రజలను ఉలికిపాటుకు గురిచేసింది. పూణేలోని వైరాలజీ ల్యాబ్‌లో జరిపిన నమూనా పరీక్షల్లో రాజమహేంద్రవరం ప్రభుత్వాసుపత్రిలో కరోనా చికిత్స తీసుకుంటున్న ఆంగ్లో ఇండియన్ మహిళకు బ్రిటన్ స్ట్రెయిన్‌గా తేలింది. మంగళవారం జిల్లా వైద్యఆరోగ్యశాఖ ఉన్నతాధికారులు ఈ విష యాన్ని అధికారికంగా ధ్రువీకరించడంతో రాజమహేంద్రవరం ప్రజానీకం ఒక్కసారిగా ఉలిక్కిపడింది. సదరు ఆంగ్లో ఇండియన్ మహిళ రాజమహేంద్రవరం జిల్లా ప్రభుత్వాసుత్రిలోనే గత వారం రోజులుగా చికిత్స పొందుతున్నారు. బ్రిటన్ నుంచి ఈనెల 22న న్యూఢిల్లీ చేరుకున్న ఆమెకు ఢిల్లీలో చేసిన వైద్య పరీక్షల్లో కరోనా పాజిటివ్ నిర్ధారణ కావడం, 23న రాజమహేంద్రవరం రాగానే ఆమె ను, ఆమె కుమారుడిని రాజమహేంద్రవరం జిల్లా ప్రభుత్వాసుపత్రికి తరలించి వెద్యుల పర్యవేక్షణలో కరోనా చికిత్స అందిస్తున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆంగ్లో ఇండియన్ మహిళకు సోకింది కరోనా కాదని, రూపుమార్చుకున్న బ్రిటన్ స్ట్రెయిన్ అని స్పష్టంకావడంతో రాజమహేంద్రవరంలో భయం నెలకొంది. జిల్లావ్యాప్తంగానూ ఈ వార్త కలకలం రేపుతోంది. కొద్దిరోజుల కిందట బ్రిటన్ లో వెలుగుచూసిన ఈ కొత్త రకం కరోనా స్ట్రెయిన్ అత్యంత వేగంగా వ్యాపిస్తుందనే ప్రచారం జిల్లావాసులను మరింత కలవరపాటుకు గురిచేస్తోంది. అయితే ప్రస్తుతం రాజమహేంద్రవరం ప్రభుత్వాసుపత్రిలో చికిత్స పొందుతున్న ఆంగ్లో ఇండియన్ మహిళకు ఎలాంటి అనుమానిత లక్షణాలు లేవని ప్రభుత్వాసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ సోమసుందరరావు తెలిపారు. కరోనా చికిత్స అందిస్తున్నామని, ఆహారం కరోనా బాధితులకు ఇచ్చే డైట్ అందిస్తున్నామని అన్నారు. అయితే తనకు ఎలాంటి అనుమానిత లక్షణాలు లేనందున తమను ఇంటికి పంపించి వేయాలని కోరుతున్నట్టు ఆయన పేర్కొన్నారు. కానీ ప్రభుత్వ నిబంధనల మేరకు వారిద్దరినీ వైద్యుల అబ్జర్వేషన్‌లో ఉంచుతామ ని స్పష్టం చేశారు. కాగా స్ట్రెయిన్ సోకిన మహిళకు దగ్గు, జలుబు, జ్వరం వంటి అనుమానిత లక్షణాలు ఏమీ లేవని ప్రభుత్వాసుపత్రి వైద్యులు చెబుతున్నా ప్రజల్లో ఆందోళన వీడడంలేదు. ఇటు వైద్యవర్గాల్లోనూ కలవరం రేగుతోంది.
ఐసోలేషన్ గదుల్లో వైద్యం
రాజమహేంద్రవరం జిల్లా ప్రభుత్వాసుపత్రిలోని ప్రత్యేక కోవిడ్ ఐసోలేషన్ గదుల్లో ఆంగ్లో ఇండియన్ మహిళకు కరోనా వైద్యచికిత్స అందిస్తున్నారు. ఈమె కుమారుడికి నెగెటివ్ వచ్చిందని తేలినా ప్రభుత్వాసుపత్రిలోనే అబ్జర్వేషన్‌లో ఉంచారు. ప్రభుత్వాసుపత్రి ఫిజీషియన్లు డాక్టర్ నాయక్, డాక్టర్ అభిరామ్ ఇతర వైద్య సిబ్బంది వైద్యం అందిస్తున్నారు. స్ట్రెయిన్‌గా నిర్ధారణ అయినా కొత్త వైరస్ స్ట్రెయిన్‌కు ఇంకా ప్రత్యేకమైన మందులు, వైద్యసేవలు లేకపోవడంతో ప్రస్తుతం కరోనా బాధితులకు అందించే వైద్యసేవలనే ఈమెకు కూడా అందించే అవకాశం ఉంది. అయి తే కొత్త వైరస్ స్ట్రయిన్ రాజమహేంద్రవరంలో వెలుగుచూసిన నేపథ్యంలో తర్వాత ఎలాంటి పరిస్థితులు నెలకొంటాయనేదానిపై అందరిలోనూ ఆందోళన వ్యక్తమవుతోంది.