విషాదంలోనూ దోపిడీ

ABN , First Publish Date - 2020-07-28T17:00:08+05:30 IST

కరోనా మృతుల కుటుంబాల నుంచి కొందరు డబ్బులు వసూళ్లు..

విషాదంలోనూ దోపిడీ

కరోనా మృతుల తరలింపులో డబ్బుల వసూళ్లు

ప్రభుత్వ ప్రకటించిన సహాయం ఏమవుతోందో..

కొన్ని అంబులెన్స్‌ల నిర్వాహకుల అక్రమ వసూళ్లు

మహేంద్రవాడకు చెందిన ఒక బాధిత  కుటుంబం నుంచి రూ.28,500 వసూలు

కొవిడ్‌ మృతుల దహనాలు కైలాసభూమిలో..


(రాజమహేంద్రవరం- ఆంధ్రజ్యోతి): కరోనా మృతుల కుటుంబాల నుంచి కొందరు డబ్బులు వసూళ్లు చేస్తున్నారు. భౌతికకాయం కూడా చూపించకుండా దహనం చేస్తున్నట్టు చెబుతున్నప్పటికీ వాస్తవానికి ఆ పరిస్థితి లేదు. బంధువులకు సమాచారం ఇచ్చి ఆ తర్వాతే అంత్యక్రియల కోసం తరలిస్తున్నారు. ఈలోపు అంబులెన్సు, ఇతర ఖర్చులంటూ కొందరు వసూళ్లూ చేస్తున్నారు. అనపర్తి మండలం మహేంద్రవాడకు చెందిన మహిళ ఆదివారం కరోనాతో జీఎస్‌ఎల్‌లో మృతి చెందారు. ఆమెకు భర్త, కుమారుడు ఉన్నారు. వారికి భౌతికకాయం అప్పగించలేదు.


కానీ అంబులెన్స్‌, దహన ఖర్చులన్నీ కలిపి రూ.28,500 అవుతుందని కొందరు చెప్పగా, వారు ఆ సొమ్ము సమకూర్చారు.  తాము మోటారు సైకిల్‌ మీద వెళ్లగా, ఆమె మృతదేహాన్ని అంబులెన్స్‌లో తెచ్చి కైలాస భూమి లో దహనం చేశారని వారు తెలిపారు. తాము దూరం నుంచే దహన కార్యక్రమం చూసినట్టు చెప్పారు. ఇక అమలాపురంలో కిమ్స్‌లో చికిత్సపొందుతూ రావులపాలెంకు చెందిన ఒక వ్యక్తి మృతిచెందగా అంబులెన్స్‌కు, ఇతర ఖర్చులకు రూ.23 వేలవరకూ అయినట్టు సంబంధిత బంధువులు తెలిపారు. అసలే కరోనా. కనీసం మృతదేహాన్ని చూడడానికి కూడా వీలులేని పరిస్థితి ఉంది. కళ్లెదుట తిరుగుతున్న వ్యక్తులు కొద్ది రోజుల్లోనే చనిపోతున్నారు. ఈ పరిస్థితుల్లో కూడా అంబులెన్స్‌, ఇతర చార్జీలంటూ రూ.వేలాది వసూళ్లు చేయడం వారి కుటుంబాలను మరింత ఇబ్బంది పెట్టడమే.


జిల్లాలోని చాలా ప్రాంతాల నుంచి రాజమహేంద్రవరం కైలాసభూమికే కొవిడ్‌ మృతులను తీసుకొస్తున్నారు. ఆయా ప్రాంతాలలోని శ్మశానాలలో దహనాలు జరగనీయకపోవడంతో జిల్లా కలెక్టర్‌ డి.మురళీధరరెడ్డి రాజమహేంద్రవరం కైలాసభూమి నిర్వాహకుడు పట్టపగలు వెంకట్రావును ఒప్పించి ఇక్కడ దహనాలు చేయిస్తున్నారు. ఇక కరోనా మృతుల అంత్యక్రియలకు రూ. 15వేలు ఇస్తున్నట్టు ప్రకటించింది. ఆ సొమ్ములు ఏమి చేస్తున్నారో కూడా తెలియడం లేదు.


కైలాసభూమిలో 115 మృతుల అంత్యక్రియలు

రాజమహేంద్రవరం ఇన్నీస్‌పేట కైలాసభూమిలోనూ ఈనెల 1వ తేదీ నుంచి ఇప్పటివరకూ సుమారు 115 కొవిడ్‌ మృతదేహాలకు అంత్యక్రియలు నిర్వహించారు. జిల్లా నలుమూలల నుంచి ఇక్కడికే తీసుకొస్తున్నారు. ఇప్పటివరకూ రాజమహేంద్రవరం ప్రభుత్వాసుపత్రిలో సుమారు 30 మంది, జీఎస్‌ఎస్‌లో 18, దివాన్‌చెరువులో ఇద్దరు, ఉండలేశ్వరంలో ఇద్దరు, రంపచోడవరంలో ఇద్దరు, మారేడుమిల్లిలో ఒకరు, గోకవరంలో ఇద్దరు, కడియంలో ఒక్కరు, ధవళేశ్వరంలో ఒక్కరు, రూరల్‌లో 13 మంది మృతి చెందినట్టు సమాచారం.


Updated Date - 2020-07-28T17:00:08+05:30 IST