కొవిడ్‌ వారియర్లకు జీతాలివ్వకుండా.. చుక్కలు చూపిస్తున్న ఏపీ ప్రభుత్వం!

ABN , First Publish Date - 2020-12-10T06:47:45+05:30 IST

జిల్లాలో కొవిడ్‌ వారియర్లకు జీతాలివ్వకుండా ప్రభుత్వం చుక్కలు చూపిస్తోంది. ప్రాణాలకు తెగించి ఆరు నెలలుగా సేవలు అందిస్తున్నా పైసా జీతం కూడా విదల్చకుండా పస్తులుంచుతోంది.

కొవిడ్‌ వారియర్లకు జీతాలివ్వకుండా.. చుక్కలు చూపిస్తున్న ఏపీ ప్రభుత్వం!

‘వారియర్ల’కు వేతనాల్లేవు!


(కాకినాడ-ఆంధ్రజ్యోతి): జిల్లాలో కొవిడ్‌ వారియర్లకు జీతాలివ్వకుండా ప్రభుత్వం చుక్కలు చూపిస్తోంది. ప్రాణాలకు తెగించి ఆరు నెలలుగా సేవలు అందిస్తున్నా పైసా జీతం కూడా విదల్చకుండా పస్తులుంచుతోంది. కొవిడ్‌ సమయంలో వైద్య సేవలు అందించడానికి ఎవరూ సాహసించలేదు. ఆ సమయంలో ధైర్యంగా విధుల్లో చేరిన సిబ్బందికి ఠంఛనుగా జీతాలు ఇవ్వాల్సిన ప్రభుత్వం ఆరు నెలలుగా ఇబ్బందులు పెడుతోంది. ఒక్క కాకినాడ జీజీహెచ్‌లోనే వైద్యులతో కలిపి 400 మంది సిబ్బందికి ఇంతవరకు పైసా జీతం విదల్చలేదు. డీఎంఅండ్‌హెచ్‌వో,  డీసీహెచ్‌ఎస్‌ పరిధిలో ఏడాది కాంట్రాక్టు కింద విధుల్లో చేరిన 190 మందికి, ఆరు నెలల విభాగంలోని 200 మంది పరిస్థితి ఇంతే. పేరుకు జీతాలు విడుదల చేస్తూ జీవో ఇచ్చిన ప్రభుత్వం నిధులు మాత్రం మంజూరుచేయకపోవడం విశేషం. 


కొవిడ్‌ ప్రభావం జిల్లాలో ఈ ఏడాది మార్చి నుంచి మొదలైంది. వందల్లో పాజిటివ్‌లు నమోదై ఎక్కడికక్కడ కేసులు పెరిగిపోయాయి. ఈ నేపథ్యంలో వైద్య సిబ్బంది కొరత నివారించడానికి ప్రభుత్వం తాత్కాలిక పద్ధతిలో వైద్యులు, పారామెడికల్‌ సిబ్బందిని నియమించింది. జిల్లాలో ఎక్కడ పాజిటివ్‌ ఉన్నా వారిని కాకినాడ జీజీహెచ్‌కు తరలించాలని నిర్ణయం తీసుకోవడంతో జులైలో కాంట్రాక్టు పద్ధతిలో వైద్యులు, నర్సులు, ల్యాబ్‌ టెక్నిషియన్లు కలిపి దాదాపు 400 మందిని భర్తీ చేశారు. ఆరునెలలపాటు వీరంతా విధుల్లో ఉండాలని, ఆ తర్వాత కాంట్రాక్టు రద్దవుతుందని ప్రభుత్వం పేర్కొంది. అయితే విధుల్లో చేరినప్పటి నుంచి వీరంతా ప్రాణాలకు తెగించి తీరికలేకుండా పనిచేస్తున్నారు. వైద్యులైతే 80 మంది వరకు షిప్టుల్లో కొవిడ్‌ విధులు నిర్వహిస్తున్నారు. అయితే వీరికి ఇంతవరకు ప్రభుత్వం చిల్లిగవ్వ కూడా జీతం కింద ఇవ్వలేదు. అయిదు నెలలు పూర్తవుతున్నా ఒక్క నెల జీతం కూడా అందలేదు. పారామెడికల్‌ సిబ్బంది పరిస్థితి కూడా ఇంతే. అదిగో ఇదిగో అంటూ ఇప్పటివరకు ప్రభుత్వం కాలయాపన చేసుకుంటూ వస్తోంది. కానీ చేతల్లో మాత్రం జీతాల చెల్లింపులు చేయడం లేదు. దీనిపై రెండు నెలల కిందట జీజీహెచ్‌లో వైద్యులు ఆందోళనలు చేశారు. వేతనాలు ఇవ్వకపోతే విధులు బహిష్కరిస్తామని హెచ్చరించారు. దిగివచ్చిన ప్రభుత్వం కొద్దిరోజుల్లో చెల్లింపులు చేయడానికి అంగీకరించింది. కానీ ఇంతవరకు నయాపైసా కూడా అందలేదు.


దీంతో వేతనాల్లేకుండా ఎలా పనిచేయాలని వీరంతా ప్రశ్నిస్తు న్నారు. అటు జిల్లా వైద్య ఆరోగ్యశాఖ, డీసీహెచ్‌ఎస్‌ పరిధిలోనూ కొవిడ్‌ విధుల కోసం ప్రత్యేకంగా వైద్యులు, పారా మెడికల్‌ సిబ్బందిని తాత్కాలిక పద్ధతిలో నియమించారు. వీరికి కూడా జీతాలు అందడం లేదు. తొలుత ఏడాది ప్రాతిపదికపై మే నెలలో జిల్లావ్యాప్తంగా పీహెచ్‌సీలు, సీహెచ్‌సీలు, ఏరియా ఆసుపత్రులకు కలిపి 40 మంది వైద్యులను, 150 మంది పారామెడికల్‌ సిబ్బందిని ప్రభుత్వం నియమించుకుంది. వీరికి ఇప్పటివరకు కేవలం రెండు నెలలే జీతా లందాయి. ఆగస్టు నెల జీతంలో సగం మాత్రమే చెల్లించారు. అప్పటి నుంచి ఇప్పటివరకు మూడు నెలల నుంచి జీతాలు ఇవ్వడం లేదు. అడిగితే విధుల నుంచి తొలగిస్తారనే భయంతో వీరెవరూ కిక్కురుమనడం లేదు. అటు ఆరునెలల కాంట్రాక్టు విభాగంలో జూన్‌లో మరో 200 మందిని వైద్య ఆరోగ్యశాఖ భర్తీ చేసింది. వీరిలో 60 మంది వైద్యులు, 140 మంది పారా మెడికల్‌ సిబ్బంది ఉన్నారు. అసౌకర్యాలు, మౌ లిక సదుపాయాల లేమి మధ్య వీరంతా ప్రాణాలకు తెగించి పనిచేస్తున్నారు. కానీ వీరికి కూడా ఇంతవరకు ప్రభుత్వం జీతాలు చెల్లించడం లేదు. పారామెడికల్‌ సిబ్బందిలో దిగువస్థాయి సిబ్బందిలో కొందరికి మాత్రం కేవలం రెండు నెలలు ఇచ్చి ప్రభుత్వం చేతు లు దులిపేసుకుంది.


ఇదిమినహా మిగిలిన వారందరు పస్తులతోనే కాలం గడుపుతున్నారు. ఈవిధంగా జిల్లావ్యాప్తంగా మొత్తం కాంట్రాక్టు వైద్యులు, పారామెడికల్‌ సిబ్బందికి కలిపి రూ.20 కోట్ల వరకు జీతాల బాకీలు పేరుకుపోయాయి. ఇటు బాకీపడ్డ వేతనాలకు సంబంధించి డబ్బులు చెల్లించడానికి జీవో ఇచ్చినట్టు ప్రభు త్వం చెబుతోంది. సీఎఫ్‌ఎంఎస్‌కు బిల్లులు పంపితే నిధులురాక నిలిచిపోయాయనే సమాధానం వస్తోంది.

Updated Date - 2020-12-10T06:47:45+05:30 IST