కొవిడ్ వ్యాక్సిన్ పంపిణీ కి టాస్క్‌ఫోర్స్
ABN , First Publish Date - 2020-12-03T06:20:44+05:30 IST
జిల్లాలో కొవిడ్ వ్యాక్సిన్ పంపిణీ పర్యవేక్షణకు జిల్లా స్థాయి టాస్క్‌ఫోర్స్ కమిటీ ఏర్పాటు చేశామని, దీనికి జిల్లా వ్యాధి నిరోధక అధికారి (డీఐవో) మెంబర్ కన్వీనర్‌గా, ఆయా శాఖల అధికారు లు సభ్యులుగా వ్యవహరిస్తారని కలెక్టర్ మురళీధర్‌రెడ్డి తెలిపారు.

కలెక్టర్ మురళీధర్‌రెడ్డి
కాకినాడ, డిసెంబరు2 (ఆంధ్రజ్యోతి): జిల్లాలో కొవిడ్ వ్యాక్సిన్ పంపిణీ పర్యవేక్షణకు జిల్లా స్థాయి టాస్క్‌ఫోర్స్ కమిటీ ఏర్పాటు చేశామని, దీనికి జిల్లా వ్యాధి నిరోధక అధికారి (డీఐవో) మెంబర్ కన్వీనర్‌గా, ఆయా శాఖల అధికారు లు సభ్యులుగా వ్యవహరిస్తారని కలెక్టర్ మురళీధర్‌రెడ్డి తెలిపారు. ఈ మేరకు బుధవారం కలెక్టరేట్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన వివరాలు వెల్లడించారు. ఈనెల 1 నుంచి వచ్చే ఏడాది జనవరి 19 వరకు 50 రోజుల కార్యాచరణ అమలు చేస్తున్నామన్నారు. ఇందులో భాగంగా కొవిడ్ సెకండ్ వేవ్‌ను ధీటుగా ఎదుర్కోవడానికి ప్రణాళిక అమలు చేస్తామన్నారు. కేంద్ర ప్రభుత్వం కొవిడ్ వ్యాక్సిన్ జిల్లాకు పంపిణీ చేస్తే, దీన్ని ఎవరికి ఇవ్వాలనే దానిపై ఇప్పటికే ఉన్నతస్థాయి సమీక్షలో నిర్ణయించామన్నారు. ఇదే విషయంపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు యంత్రాంగానికి స్పష్టమైన ఆదేశాలిచ్చాయన్నారు. వ్యాక్సిన్ తొలుత ఎవరికి ఇస్తారనే అంశంపై ప్రజల్లో అపోహలున్నాయని, దీంతో తొలుత వైరస్ ప్రభావిత ప్రాంతాల్లో 50 ఏళ్లు దాటిన వ్యక్తుల్లో లక్షణాలున్న వారికి మాత్రమే వ్యాక్సినేషన్ వేస్తామన్నారు. అయితే సామాజిక, ప్రసార మాధ్యమాల్లో వ్యాక్సినేషన్ పంపిణీపై సంబంఽధిత అధికారుల వివరణ లేకుండా వచ్చే సమాచారాన్ని నమ్మొద్దన్నారు. కేంద్రం ప్రభుత్వం నుంచి జిల్లాకు వచ్చే వ్యాక్సిన్ భద్రత కోసం తగిన చర్యలు చేపట్టామన్నారు. అయితే వ్యాక్సిన్ వస్తోందని ప్రజలెవరూ కరోనా నిబంధనలు ఉల్లంఘించవద్దన్నారు. ఎవరికైతే వ్యాక్సిన్ అవసరం ఉంటుందో వారికే ఇస్తామని, మిగిలినవారు సెకండ్ వేవ్ నుంచి తప్పించుకునేలా జాగ్రత్తపడాలన్నారు. యథావిధిగా ప్రతి ఒక్కరూ కొవిడ్ నిబంధనలు పాటించాలన్నారు. సమావేశంలో డీఎంహెచ్‌వో డాక్టర్ కేవీఎస్ గౌరేశ్వరరావు, డీఆర్వో సీహెచ్ సత్తిబాబు పాల్గొన్నారు.