నగరం... నిర్మానుష్యం

ABN , First Publish Date - 2020-07-15T10:34:25+05:30 IST

కొవిడ్‌ కేసులు విపరీతంగా పెరిగిపోతున్న నేపథ్యంలో వైరస్‌ కట్టడికి మంగళవారం నుంచి విధించిన లాక్‌డౌన్‌తో..

నగరం... నిర్మానుష్యం

కాకినాడ, రాజమహేంద్రవరం, అమలాపురంల్లో మళ్లీ ప్రారంభమైన లాక్‌డౌన్‌


(కాకినాడ/రాజమహేంద్రవరం-ఆంధ్రజ్యోతి): కొవిడ్‌ కేసులు విపరీతంగా పెరిగిపోతున్న నేపథ్యంలో వైరస్‌ కట్టడికి మంగళవారం నుంచి విధించిన లాక్‌డౌన్‌తో కాకినాడ, రాజమహేంద్రవరం నగరాలు, రూరల్‌ ప్రాంతాలు, అమలాపురం పట్టణం నిర్మానుష్యంగా మారాయి. ఉదయం 11 గంటల తర్వాత అన్ని వాణిజ్య దుకాణాలు మూతపడ్డాయి. దీంతో ఎక్కడికక్కడ జనసంచారం తగ్గిపోయింది. ప్రధాన మార్కెట్లు, మాల్స్‌ను సైతం మూసివేశారు. పోలీసులు సైతం అన్ని కూడళ్లలో తిరుగుతూ పదకొండు తర్వాత అన్ని దుకాణాలను మూసివేయించారు. మరోపక్క లాక్‌డౌన్‌ అమలు చేస్తుండడంతో మార్కెట్ల వద్ద మళ్లీ జనసంచారం ఎక్కువ వుతోంది. ఉదయం జనం విచ్చలవిడిగా తిరిగినప్పటికీ మధ్యాహ్నం నుంచి తగ్గారు. ఉదయం కిక్కిరిసిన మెయిన్‌ మార్కెట్‌ మధ్యాహ్నం బోసిపోయింది. ఎన్ని రోజుల పాటు నగరంలో లాక్‌డౌన్‌ అమల్లో ఉంటుందనేది నమోదయ్యే పాజిటివ్‌ కేసుల ఆధారంగా నిర్ణయం ఉంటుందని అధికారులు చెప్తున్నారు.


మరోపక్క రెండు నగరాల్లో 11 తర్వాత బయటకు వచ్చే వాహనదారులపై మళ్లీ యథావిథిగా కేసులు నమోదు చేయాలని పోలీసు శాఖ నిర్ణయించింది. జరిమానాలు, వాహనాల స్వాధీనం తదితర రూపాల్లో జనసంచారాన్ని కట్టడి చేయాలని ఉన్నతాధికారులు ఆదేశాలు జారీ చేశారు. కాకినాడలో కలెక్టర్‌ మురళీధర్‌రెడ్డి, ఎస్పీ అద్నాన్‌ నయీం అస్మి, కమిషనర్‌ స్వప్నిల్‌ దినకర్‌, ఎంపీ వంగా గీత, ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర రెడ్డి, రాజమహేంద్రవరంలో కమిషనర్‌  అభిషిక్త్‌ కిశోర్‌, పోలీసుల శాఖ అధికారులు ముఖ్య ప్రాంతాల్లో పర్యటించి దుకాణాలను మూయించారు. నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే అందరికీ ప్రమాదమేనని తెలిపారు. ఆర్టీసీ బస్సులు, ఆటోలు మామూలుగానే తిరిగాయి. ప్రభుత్వ ఆసుపత్రుల్లో ఓపీ యఽథావిధిగా కొనసాగింది. 

Updated Date - 2020-07-15T10:34:25+05:30 IST