సర్వం గాలికి..

ABN , First Publish Date - 2020-08-01T11:09:58+05:30 IST

జిల్లా అంతటా దాదాపుగా కొవిడ్‌ విస్తరించింది. ప్రతి మండలంలో కేసులు వందల్లో నమోదయ్యాయి.

సర్వం గాలికి..

 జిల్లాలో రెడ్‌జోన్‌ల పర్యవేక్షణ అంతంత మాత్రమే

కేసులు వచ్చినచోట బారికేడ్లు, కర్రలతో రోడ్లు మూత.. ఫ్లెక్సీలు ఏర్పాటు

వైద్య పరీక్షల దగ్గర నుంచి హైపోక్లోరైడ్‌ ద్రావణం స్ర్పే వరకు సున్నా

పాజిటివ్‌ బాధితుని ఇంటి పరిసరాల్లో అప్పుడప్పుడు బ్లీచింగ్‌ చల్లి మమ

అంతకుమించి పర్యవేక్షణ శూన్యం.. ఎక్కడిక్కడ బారికేడ్లు తొలగించి రాకపోకలు

యథాతథంగా వాణిజ్య దుకాణాలు.. కార్పొరేషన్‌, పంచాయతీల పర్యవేక్షణ నిల్‌

అవసరాల పేరుతో కొవిడ్‌ సోకిన వ్యక్తి కుటుంబ సభ్యులూ యథేచ్ఛగా సంచారం

ఒకప్పుడు రెడ్‌జోన్‌లో సర్వం బంద్‌.. నిత్యావసరాలన్నీ ఇళ్లకే.. ఇప్పుడన్నీ మాయం


కాకినాడ,( ఆంధ్రజ్యోతి): జిల్లా అంతటా దాదాపుగా కొవిడ్‌ విస్తరించింది. ప్రతి మండలంలో కేసులు వందల్లో నమోదయ్యాయి. దీంతో ప్రస్తుతం 913 కంటైన్మెంట్‌ జోన్లు విధించారు. అత్యధికంగా కాకినాడలో 54, రాజమహేంద్రవరంలో 63, కరప 53, పెద్దాపురం 44, తొండంగి 10, అనపర్తి 70, ఏజెన్సీ గంగవరం 7, ఉప్పలగుప్తం 6.. ఇలా అన్నిచోట్లా విధించారు. కొన్ని నెలల కిందట వరకు పాజిటివ్‌ వచ్చిన ప్రాంతాన్ని రెడ్‌జోన్‌గా ప్రకటించేవారు. ఆ పేరు స్థానంలో కంటైన్మెంట్‌ జోన్‌  తీసుకువచ్చారు. కాకపోతే కేసులున్న ప్రాంతాల్లో ఇప్పటికీ రెడ్‌జోన్‌ పేరుతోనే ఫ్లెక్సీలు ఏర్పాటుచేస్తున్నారు. అయితే ఈ రెడ్‌ జోన్లపై ఇప్పుడు జిల్లాలో పర్యవేక్షణ పూర్తిగా కొరవడింది. దీంతో పెద్దఎత్తున పాజిటివ్‌లు పెరగడానికి కారణం అవుతున్నాయి. నగ రాలు, పట్టణాల్లో కొవిడ్‌ కేసులు వచ్చిన ప్రాంతాల్లో కార్పొరేషన్‌, మున్సి పల్‌ అధికారులు రహదారులను బారికేడ్లతోను పంచాయతీల్లో కర్రలు కట్టి మూసి వేస్తున్నారు.


రెడ్‌జోన్‌ ఏరియా అంటూ ఫ్లెక్సీలు ఏర్పాటు చేస్తు న్నారు. ఆ తర్వాత నుంచి పూర్తిగా గాలికి వదిలేస్తున్నారు. వాస్తవానికి  రెడ్‌జోన్‌ ప్రాంతాల్లో జనం ఎట్టి పరిస్థితుల్లో బయటకు రావడం నిషిద్ధం. ఏ అవసరాలున్నా స్థానిక ప్రభుత్వ వలంటీర్ల ద్వారా నిత్యవసర సరుకులు సరఫరా చేయించాలి. ఆ జోన్‌ పరిధిలో జనానికి టెస్ట్‌లు చేయాలి. దుకాణాలన్నీ మూసివేయాలి. జోన్‌ నుంచి బయటకు రాకపోకలు నిషిద్ధం. కానీ జిల్లాలో ఇవేవీ అమలవడం లేదు. ఏప్రిల్‌ వరకు కేసులు తక్కువగా ఉండడంతో ఇవన్నీ అధికారులు పక్కాగా చేశారు. జూన్‌, జూలై నెలల్లో కేసులు వేలల్లోకి చేరడంతో రెడ్‌జోన్లపై పర్యవేక్షణ వదిలేశారు. దీంతో జిల్లాలో జనం రెడ్‌జోన్ల నుంచి యథేచ్ఛగా బయటకు వచ్చేస్తున్నారు. అటు టెస్ట్‌లు కూడా చేయడం లేదు. లక్షణా లున్న వారు టెస్ట్‌లకు బయటకు వెళ్తే అక్కడ పని కావడం లేదు. అడ్డంగా వేసిన బారికేడ్లు, కర్రలు పక్కకు తొలగించి నిత్యం రాకపోకలు సాగిస్తున్నారు. కాకినాడ, రాజమహేంద్రవరం నగరాల్లో కేసుల తీవ్రత అధికంగా ఉంది.


ఇక్కడ రెడ్‌జోన్‌ల్లో యథావిథిగా బారికేడ్లు తొలగించి రాకపోకలు సాగిపోతున్నాయి. ప్రముఖులు ఉండే ప్రాంతాల్లో అయితే బార్లా తెరుస్తున్నారు. కాకినాడలో ఓ సీఐకు పాజిటివ్‌ రాగా, ఆయన ఉండే చోట బారికేడ్లు తొలగించారు. అటు పంచాయతీల్లో కర్రలు తొలగించి రెడ్‌జోన్లలో రాకపోకలు సాగుతున్నాయి. ఇక్కడ పరీక్షలు సైతం లేవు. దుకాణాలూ తెరుచుకుంటున్నాయి. అన్నిచోట్లా ఇదే తంతు. చివరకు జోన్ల సంఖ్య 913కి పెరగడంతో సిబ్బంది కొరతతో బ్లీచింగ్‌, హైపోక్లోరైడ్‌ ద్రావణం స్ర్పే చేయడం లేదు.కేవలం పాజిటివ్‌ వచ్చిన ఇంటి వద్ద ఒకటీ, రెండు రోజులే హడావుడి ఉంటోంది. ఆ తర్వాత షరా మామూలే. మరోపక్క పాజిటివ్‌గా తేలిన తర్వాత రెండు, మూడు రోజులకుగాని స్పందించి జోన్‌లు ప్రకటించడం లేదు. ఈలోపు జరగాల్సిన నష్టం జరిగిపోతోంది.


హోంఐసోలేషన్‌ నుంచీ గుట్టుచప్పుడుకాకుండా..

పాజిటివ్‌ వచ్చిన ప్రాంతంలో మొత్తం కట్టుదిట్టం చేసి పంచా యతీలు, కార్పొరేషన్ల పరిధిలో మొన్నటివరకు వలంటీర్ల ద్వారా ఆయా కుటుంబాలకు సరుకులు పంపేవారు. కానీ ఇదెక్కడా జరగడం లేదు. అంతేకాకుండా వేలాది కేసుల నేపథ్యంలో కొవిడ్‌ సోకిన వ్యక్తులను హోంఐసోలేషన్‌లో ఉంచుతున్నారు. అయినా నిత్యావసరాల పేరుతో ఆయా కుటుంబాల్లోని వారు యథేచ్ఛగా బయటకు వస్తున్నారు. మార్కెట్లకు వచ్చి కొనుగోళ్లు చేస్తున్నారు. దీనివల్ల వైరస్‌ ఇతరులకు సులువుగా వ్యాపిస్తోంది.


రెడ్‌జోన్‌ పరిధిలోని బాధిత కుటుంబాల వరకు అధికారులు ఈ ఏర్పాట్లు చేస్తే కొవిడ్‌ నియంత్రణలో ఉంటుంది. కానీ ఇదెక్కడా జరగడం లేదు. పోలీసుల పహారా, అందుబాటులో వైద్య బృందం, నిత్యా వసరాల సరఫరా వంటివి చేస్తే కొంత కట్టుదిట్టమవుతుంది. కుటుంబ సభ్యులు ఇద్దరే ఉన్న ఇళ్లల్లో హోంఐసోలేషన్‌లో ఉన్న కొవిడ్‌ బాధితులు గుట్టుచప్పుడు కాకుండా రహదారులపైకి వచ్చేస్తున్నారు. కాకినాడ, రాజమహేంద్రవరం నగరాల్లో ౅కేసుల పెరుగుదలకు ఇది కూడా కారణంగా మారింది.

Updated Date - 2020-08-01T11:09:58+05:30 IST