పంట నష్టాన్ని లెక్క తేల్చిన వ్యవసాయశాఖ.. మొత్తం ఎంత నష్టమంటే..

ABN , First Publish Date - 2020-12-11T06:38:07+05:30 IST

పంటనష్టం అంచపై పది రోజులుగా సర్వే చేసిన వ్యవసాయశాఖ ఎట్టకేలకు నష్టం నిర్థారించింది. జిల్లావ్యాప్తంగా మొత్తం 82,500 ఎకరాల్లో వరి పూర్తిగా దెబ్బతిన్నట్టు గుర్తించింది. తద్వారా అన్నదాతలకు రూ.198 కోట్ల పెట్టుబడి నష్టం వాటిల్లినట్టు తేల్చింది.

పంట నష్టాన్ని లెక్క తేల్చిన వ్యవసాయశాఖ.. మొత్తం ఎంత నష్టమంటే..

‘లెక్క’తేల్చారు..

నివర్‌ తుఫాను పంట నష్టాన్ని లెక్క తేల్చిన వ్యవసాయశాఖ

జిల్లాలో 82,500 ఎకరాల్లో వరి దెబ్బతిన్నట్టు నిర్ధారణ

రూ.198 కోట్ల పెట్టుబడి నష్టం వాటిల్లినట్టు గుర్తింపు

నేడు నివేదిక రెడీ..  రేపటి నుంచి అభ్యంతరాల స్వీకరణ


(కాకినాడ-ఆంధ్రజ్యోతి): నివర్‌ తుఫాను నష్టం జిల్లా రైతులను నట్టేట ముంచేసింది. చేతికి పంట వచ్చే సమయంలో కకావికలం చేసింది. ఎక్కడికక్కడ పంట కళ్లకు కనిపించకుండా ముంచేసింది. ఈ నేపథ్యంలో పంటనష్టం అంచపై పది రోజులుగా సర్వే చేసిన వ్యవసాయశాఖ ఎట్టకేలకు నష్టం నిర్థారించింది. జిల్లావ్యాప్తంగా మొత్తం 82,500 ఎకరాల్లో వరి పూర్తిగా దెబ్బతిన్నట్టు గుర్తించింది. తద్వారా అన్నదాతలకు రూ.198 కోట్ల పెట్టుబడి నష్టం వాటిల్లినట్టు తేల్చింది. కాగా శనివా రం నుంచి గ్రామాల వారీగా బాధిత రైతుల జాబితా ప్రదర్శించనుంది. అదేరోజు నుంచి అభ్యంతరాలను కూడా స్వీకరించి అర్హులైన రైతుల పేర్లను చేర్చే ప్రక్రియ మొదలుపెట్టనుంది. గతనెల్లో వచ్చిన నివర్‌ తుఫాను ప్రభావంతో జిల్లా వ్యాప్తంగా వరి పంట భారీగా దెబ్బతింది. ఎక్కడికక్కడ కంకులు నేలకొరిగి కుళ్లిపోయాయి. మరికొన్నిచోట్ల నీటిలోనాని రూపురేఖలు కోల్పోయాయి. వేసిన కుప్పల కిందకు నీళ్లు చేరి అడుగునుంచి పంట మొత్తం పోయింది. తద్వారా మొత్తం పంటకు సంబంధించి ఎంత నష్టం వాటిల్లిందనేదానిపై వ్యవసాయశాఖ సర్వే ప్రారంభించింది. 48 మండలాల పరిధిలో 538 గ్రామాల్లో 1,204 బృందాలతో క్షేత్రస్థాయి సర్వే చేయగా గురువారంతో ఇది ముగిసింది. దీంతో జిల్లా వ్యాప్తంగా 82,500 ఎకరాల్లో వరి దెబ్బతినగా, ఎకరాకు ఒక్కో రైతు రూ.24 వేల వరకు నష్టపోయినట్టు గుర్తించింది.


అత్యధికంగా తొండంగి మండలంలో 2,163 ఎకరాల్లో పంట నష్టపోయినట్టు సర్వే బృందాలు నిగ్గుతేల్చాయి. ఆ తర్వాత ప్రత్తిపాడు మండలంలో 1,520 ఎకరాలు నష్టపోయినట్టు తేల్చారు. జిల్లావ్యాప్తంగా ఆయా మండలాల నుంచి వచ్చిన నష్టం వివరాలను గురువారం రాత్రి వరకు క్రోడీకరిస్తూనే ఉన్నారు. గురువారంతో నష్టం అంచనాలు పూర్తయినప్పటికీ వీటిని పూర్తిస్థాయిలో క్రోడీకరించి శుక్రవారం కలెక్టర్‌ పరిశీలనకు నివేదిక పంపనున్నారు. తిరిగి శనివారం నుంచి గ్రామాలవారీగా బాధితుల జాబితా ప్రదర్శించాలని నిర్ణయించారు. అదేరోజు నుంచి జాబితాలో పేరులేని రైతుల నుంచి అభ్యంతరాలు స్వీకరించనున్నారు. ఇదంతా పూర్తయ్యాక ఈనెల 15న తుది నివేదిక తయారుచేసి పరిహారం మంజూరుకోసం ప్రభుత్వానికి పంపనున్నా రు. కాగా నివర్‌ తుఫానుతో జిల్లావ్యాప్తంగా 1.50 లక్షల ఎకరాల్లో వరి నష్టపోయినట్టు అంచనా వేశారు. ఇందులో కుప్పవేసిన పంట అధికంగా ఉంది. కానీ సర్వే పేరుతో చివరకు 82,500 ఎకరాలనే పరిగణనలోకి తీసుకోవడం విశేషం.

Updated Date - 2020-12-11T06:38:07+05:30 IST